బిహార్ ఎన్నికలపై బీజేపీ చీఫ్ నడ్డా వ్యాఖ్య
ఔరంగాబాద్/హాజీపూర్: బిహార్ అసెంబ్లీ ఎన్నికలను అధికార ఎన్డీయే వికాసానికి, విపక్షాల ఇండియా కూటమి వినాశానికి మధ్య జరుగుతున్న పోరుగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా అభివర్ణించారు. గురువారం ఆయన ఎన్డీయే అభ్యర్థుల తరఫున ఔరంగాబాద్, వైశాలి జిల్లాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు. ఇరవయ్యేళ్ల పాలనలో సీఎం నితీశ్ కుమార్ రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ను అంతం చేశారన్నారు. బిహార్ సర్వతోముఖాభివృద్ధికి ఎన్డీయే పాటుపడుతోందని చెప్పారు. పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. అందుకే ఈ ఎన్నికలు వికాసానికి, వినాశానికి మధ్య జరుగుతున్న పోరాటం వంటివని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నడ్డా కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. ఆ పార్టీని చిన్నవైన భాగస్వామ్య పక్షాలను అంతం చేసే పరాన్నభుక్కుగా ఆయన పేర్కొన్నారు. యువతకు ఉద్యోగావకాశాల కల్పనతోపాటు, వలసలకు చెక్ పెడతామంటూ ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇస్తున్న హామీలను ప్రస్తావిస్తూ నడ్డా.. గతంలో ఆ పార్టీ నేతలు పాల్పడిన ‘భూమికి బదులుగా ఉద్యోగాలు’కుంభకోణం గుర్తుకు వస్తోందని వ్యాఖ్యానించారు. భారీ ఉద్యోగాల కల్పన వట్టిదేనంటూ ఆయన వీరందరికీ వేతనాలను చెల్లించేందుకు నిధులెక్కడి నుంచి తీసుకువస్తారని ప్రశ్నించారు.


