సాక్షి,హైదరాబాద్: ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో బీజేపీ చేపట్టిన ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మార్చేసిందని, ఏ ముఖం పెట్టుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ పదేళ్ల పాటు నియంత పాలన చేశారు. ఆయన కుటుంబం చేతిలో పదేళ్లు తెలంగాణ బంధీ అయ్యింది. కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజలు విసిగిపోయి ఏదో మార్పు చేస్తారని కాంగ్రెస్‌కు ఓటు వేశారు. అంతే కానీ కాంగ్రెస్ పార్టీపై ప్రేమతో కాదు.
ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన రెండేళ్ల పాలన పై ఉత్సవాలు చేస్తున్నారు. ఏ ముఖం పెట్టుకుని రేవంత్ రెడ్డి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు? రేవంత్ రెడ్డి ప్రతీ సందర్భంలో ఫ్రీ బస్సు, సన్న బియ్యం రెండే విషయాలు చెబుతున్నారు. ఆ సన్న బియ్యంలో కేంద్రం వాటా ఉంది. కేసీఆర్ పోయి రేవంత్ వచ్చారు అంతే. పరిపాలనలో మార్పు రాలేదు. తెలంగాణలో ఇంకేమీ మారలేదు. ఏ రంగంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు జరగలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ విసిరాడు. ఇచ్చిన హామీలపై చర్చకు ఎక్కడికైనా రండి. మా కార్యకర్తలు సమాధానం చెబుతారు. ప్రెస్ క్లబ్ కైనా, ఇంకా ఎక్కడికైన పర్వాలేదు. మా ప్రశ్నలకు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. భూములు, మద్యం అమ్మకపోతే ప్రభుత్వం నడవని పరిస్థితి ఏర్పడింది. ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ రెడ్డి ఒకసారి చదువుకోవాలని సూచిస్తున్నా.
బెల్ట్ షాపులు మూసివేస్తామని చెప్పారు.. ఏమైంది? రేవంత్ రెడ్డి ప్రజల దృష్టి మళ్ళించే ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి, బీఆర్‌ఎస్‌కి తేడా లేదు. రెండు కుటుంబ పార్టీలే, అవినీతి పార్టీలే, ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేసే పార్టీలే అంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు.
బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యులు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను నమ్మించి నట్టేట ముంచింది. తెలంగాణ సమాజం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. ప్రజల దృష్టిని మళ్లించి మోసం చేయడానికి సీఎం రేవంత్ కుట్రలు చేస్తున్నారు. వంచించడమే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీ. హైడ్రా పేరుతో, మూసీ ప్రక్షాళన పేరుతో గతంలో ద్రుష్టి మళ్ళించారు. ఇప్పుడు రైజింగ్ తెలంగాణ పేరుతో ప్రజల ఫోకస్ మళ్లిస్తున్నారు. కరప్షన్ లో, డ్రగ్స్, గన్ కల్చర్ లో తెలంగాణ రైజింగ్ అవుతోంది.
రెండేళ్లలో భూ మాఫియా పడగలెత్తింది. వాటాల కోసం మంత్రుల మధ్య గొడవలు బయటపడుతున్నాయి. పారిశ్రామిక భూములను అప్పనంగా దారాదత్తం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. తెలంగాణ సంపదను దోచి కాంగ్రెస్ అధిష్టానానికి పంపుతున్నారు. బీఆర్‌ఎస్ చేసిన పాపలు.. అప్పులు మళ్లీ కాంగ్రెస్ కూడా చేస్తోంది. పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది అంటూ బీజేపీ నాయకుడు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు.


