ఆరు గ్యారంటీలు..420 హామీలపై ప్రజలను కాంగ్రెస్ మోసగిస్తోంది
ల్యాండ్ మాఫియాకు తెలంగాణను అప్పగించింది
మూసీ నది సుందరీకరణ డీపీఆర్ ఎక్కడ?
వంచించే ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడతాం
మేం అధికారంలోకి రాగానే అర్బన్ నక్సలైట్లను అంతం చేస్తాం
ప్రజా వంచన దినం మహాధర్నాలో రాష్ట్ర బీజేపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలనలో సీఎం అండ్ సన్స్ మోడల్ ఉండేదని.. ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో అది సీఎం అండ్ బ్రదర్స్ మోడల్‌గా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద ప్రజావంచన దినం పేరిట ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ మహాధర్నా చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో ఆరు గ్యారంటీలు, 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్.. ప్రజలను నమ్మించి మోసం చేస్తోందని దుయ్యబట్టారు.
విద్యార్థులు, ఉద్యోగులు, పెన్షనర్లు, యువత, నిరుద్యోగులు, రైతులు, మహిళలకు ఎన్నికల ముందు హామీల వర్షం కురిపించిందన్నారు. వంచించే ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్‌కు పోటీగా నిలబడే సర్పంచ్ అభ్యర్థులను హౌస్ అరెస్టులు, జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని రాంచందర్‌రావు ఆరోపించారు. అర్బన్ నక్సలైట్లను అంతమొందిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం అర్బన్ నక్సలైట్లను పెంచి పోషిస్తోందని దుయ్యబట్టిన రాంచందర్‌రావు.. తాము అధికారంలోకి రాగానే అర్బన్ నక్సలిజాన్ని అంతం చేస్తామని స్పష్టం చేశారు.
మోదీ ప్రభుత్వం తెలంగాణకు సాయం చేయట్లేదంటూ బీఆర్‌ఎస్ గతంలో నిందించినందుకు ఆ పార్టీని ప్రజలు ఇంటికి పంపారని.. ప్రస్తుతం కాంగ్రెస్ సైతం అదే దారిలో నడుస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ లాభాల కోసమే ‘హిల్ట్’పాలసీని తెచ్చిందని.. ఇది అవినీతికి తెరతీయడం వంటిదేనని రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. మూసీ సుందరీకరణకు బీజేపీ వ్యతిరేకం కాదని.. కానీ అక్కడ ఏం చేయబోతున్నారనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా? అని ఆయన ప్రశ్నించారు. మూసీ సుందరీకరణ డీపీఆర్ ఎక్కడుందని ఆయన నిలదీశారు. భూములను వేలం వేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తూ రాష్ట్రాన్ని ల్యాండ్ మాఫియాకు అప్పగించిందని రాంచందర్‌రావు ఆరోపించారు. సామాన్యులకు ఒరిగిందేమీ లేనప్పుడు తెలంగాణ రైజింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు.
రెండేళ్లుగా నయవంచన పాలన: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
రెండేళ్లుగా కాంగ్రెస్ నయవంచన పాలన కొనసాగిస్తోందని.. 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం తప్ప ఏ వర్గంలోనూ పెద్దగా మార్పు రాలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ఓటు వేస్తే ఉచిత బస్సు, సన్న బియ్యం తప్ప ఇతర హామీలేవీ అమలు చేయడం లేదని మండిపడ్డారు.
ప్రభుత్వం భూములు అమ్మితే తప్ప సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. హామీల అమల్లో ప్రభుత్వ తీరుపై ఈ సందర్భంగా చార్జిïÙట్ విడుదల చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజలను మభ్యపెట్టే లక్ష్యంతో జిల్లాలు తిరుగుతున్నారని.. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సర్పంచ్ స్థానాలను గెలుచుకుంటున్నారని ఆరోపించారు. కేంద్ర నిధులతోనే గ్రామాల్లో సీసీ రోడ్లు, అంగన్‌వాడీ, పంచాయతీ భవనాలు, ఉపాధి హామీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయని.. వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులేమిటని ప్రశ్నించారు.
రాష్ట్రంలో లంకెబిందెల కోసం సీఎం రేవంత్‌రెడ్డి వెతుకుతున్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హిల్ట్ పాలసీ పేరుతో రూ. 6.30 లక్షల కోట్ల కుంభకోణానికి తెరతీశారని.. పరిశ్రమలను మూసేసి ఆ భూములను కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. హిల్ట్ పాలసీ వెనుక చెడ్డీ గ్యాంగ్ ఉందని.. రేవంత్‌రెడ్డి రాబందు రెడ్డిగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాధర్నాలో ఎంపీలు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీలు కొమురయ్య, అంజిరెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, నాయకులు పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


