
దివాలా పరిష్కార బిడ్‌తో కొనుగోలుకి వీలు
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న జైప్రకాష్ అసోసియేట్స్(జేపీ) కొనుగోలుకి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) తాజాగా అదానీ గ్రూప్‌ను అనుమతించింది. దీంతో ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న జేపీని సొంతం చేసుకునేందుకు అదానీ గ్రూప్ వేసిన బిడ్ గెలుపొందే వీలుంది. తద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ లేదా అదానీ గ్రూప్‌లోని ఏ ఇతర సంస్థ అయినా జేపీలో 100 శాతం వాటా కొనుగోలుకి అనుమతించింది.
వెరసి అదానీ గ్రూప్ సంస్థలు జేపీని సొంతం చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐబీసీ చట్ట నిబంధనలమేరకు ఇటీవల సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం దివాలా పరిష్కార ప్రణాళిక దాఖలుకు సీసీఐ అనుమతి తప్పనిసరి. కాగా.. జేపీ దివాలా పరిష్కార ప్రణాళికను ప్రస్తుతం రుణదాతల కమిటీ(సీవోసీ) సమీక్షిస్తోంది.
సీసీఐ అనుమతి తదుపరి మాత్రమే దివాలా పరిష్కార ప్రణాళికను సీవోసీ సమీక్షించి అంగీకరిస్తుంది. కాగా.. జేపీ కొనుగోలుకి అదానీ గ్రూప్‌తోపాటు.. దాల్మియా భారత్ ప్రతిపాదనను సైతం తాజాగా సీసీఐ అనుమతించింది. వేదాంతా గ్రూప్, జిందాల్ పవర్, పీఎన్‌సీ ఇన్‌ఫ్రాటెక్ తదితర సంస్థలు సైతం జేపీ కొనుగోలుకి వీలుగా సీసీఐను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 2024 జూన్3న జేపీపై కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు ఎన్‌సీఎల్‌టీ అలహాబాద్ బెంచ్ ఆదేశించింది. రుణ చెల్లింపుల్లో వైఫల్యం ఇందుకు కారణంకాగా.. రుణదాతలకు రూ. 57,185 కోట్లు బకాయిపడటం గమనార్హం!