అమెరికన్ కృత్రిమ మేధ (ఏఐ) సంస్థ ఎన్‌కోరాను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ సర్వీసుల దిగ్గజం కోఫోర్జ్ వెల్లడించింది. 100% వాటాల కోసం 2.35 బిలియన్ డాలర్లని (సుమారు రూ.21,133 కోట్లు) తెలిపింది. పూర్తి స్టాక్స్ లావాదేవీ రూపంలో ఈ డీల్ ఉంటుందని వివరించింది. ఎన్‌కోరా ప్రస్తుత షేర్‌హోల్డర్లకు 1.89 బిలియన్ డాలర్ల ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయనున్నట్లు కోఫోర్జ్ పేర్కొంది.
ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజాలు అడ్వెంట్ ఇంటర్నేషనల్, వార్‌బర్గ్ పింకస్ మొదలైనవి ఎన్‌కోరాలో వాటాదార్లుగా ఉన్నాయి. తమ ఏఐ ఆధారిత ఇంజనీరింగ్ సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని కోఫోర్జ్ సీఈవో సుధీర్ సింగ్ చెప్పారు. ఎన్‌కోరా కలయికతో 2.5 బిలియన్ డాలర్ల టెక్ సేవల దిగ్గజం ఆవిర్భవిస్తుందని కోఫోర్జ్ పేర్కొంది.
2027 ఆర్థిక సంవత్సరంలో ఏఐ ఆధారిత ఇంజనీరింగ్, డేటా, క్లౌడ్ సర్వీసుల విభాగం ఆదాయమే ఏకంగా 2 బిలియన్ డాలర్ల పైగా ఉంటుందని తెలిపింది. ఏఐ ఆధారిత ఇంజనీరింగ్ వ్యాపారం 1.25 బిలియన్ డాలర్లపైగా, క్లౌడ్ సేవలు 500 మిలియన్ డాలర్లు, డేటా ఇంజనీరింగ్ 250 మిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని కోఫోర్జ్ పేర్కొంది.


