breaking news
acquisition
-
అదానీ–జేపీ డీల్‌కు సీసీఐ సై
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో చిక్కుకున్న జైప్రకాష్ అసోసియేట్స్(జేపీ) కొనుగోలుకి కాంపిటీషన్ కమిషన్(సీసీఐ) తాజాగా అదానీ గ్రూప్‌ను అనుమతించింది. దీంతో ప్రస్తుతం దివాలా పరిష్కార ప్రక్రియలో ఉన్న జేపీని సొంతం చేసుకునేందుకు అదానీ గ్రూప్ వేసిన బిడ్ గెలుపొందే వీలుంది. తద్వారా అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలపర్స్ లేదా అదానీ గ్రూప్‌లోని ఏ ఇతర సంస్థ అయినా జేపీలో 100 శాతం వాటా కొనుగోలుకి అనుమతించింది. వెరసి అదానీ గ్రూప్ సంస్థలు జేపీని సొంతం చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐబీసీ చట్ట నిబంధనలమేరకు ఇటీవల సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు ప్రకారం దివాలా పరిష్కార ప్రణాళిక దాఖలుకు సీసీఐ అనుమతి తప్పనిసరి. కాగా.. జేపీ దివాలా పరిష్కార ప్రణాళికను ప్రస్తుతం రుణదాతల కమిటీ(సీవోసీ) సమీక్షిస్తోంది. సీసీఐ అనుమతి తదుపరి మాత్రమే దివాలా పరిష్కార ప్రణాళికను సీవోసీ సమీక్షించి అంగీకరిస్తుంది. కాగా.. జేపీ కొనుగోలుకి అదానీ గ్రూప్‌తోపాటు.. దాల్మియా భారత్ ప్రతిపాదనను సైతం తాజాగా సీసీఐ అనుమతించింది. వేదాంతా గ్రూప్, జిందాల్ పవర్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్ తదితర సంస్థలు సైతం జేపీ కొనుగోలుకి వీలుగా సీసీఐను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. 2024 జూన్3న జేపీపై కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియకు ఎన్సీఎల్టీ అలహాబాద్ బెంచ్ ఆదేశించింది. రుణ చెల్లింపుల్లో వైఫల్యం ఇందుకు కారణంకాగా.. రుణదాతలకు రూ. 57,185 కోట్లు బకాయిపడటం గమనార్హం! -
రూ.3 లక్షల కోట్లు ఇస్తా.. గూగుల్‌కే ఆఫర్ ఇచ్చిన ఇండియన్
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్‌కే ఆఫర్ ఇచ్చాడో భారతీయ యువకుడు. రాయిటర్స్ కథనం ప్రకారం.. పెర్ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సీఈఓ, భారత సంతతికి చెందిన అరవింద్ శ్రీనివాస్ (Aravind Srinivas) గూగుల్ క్రోమ్ కొనుగోలు చేయడానికి 34.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3,02,152 కోట్లు) నగదు బిడ్ చేశారు. దాదాపు 17 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థకు కేవలం మూడేళ్ల ఏఐ స్టార్టప్ ఆఫర్ ఇవ్వడం విశేషం.ఎన్విడియా, సాఫ్ట్ బ్యాంక్ సహా పలువురు ఇన్వెస్టర్ల నుంచి 1 బిలియన్ డాలర్లు సమీకరించిన పెర్ప్లెక్సిటీ ఏఐ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ 18 బిలియన్ డాలర్లుగా ( సుమారు రూ.1,57,800 కోట్లు) ఉంది. అంటే దాని విలువ కంటే దాదాపు రెట్టింపు ధరను గూగుల్ క్రోమ్ కొనుగోలుకు ఆఫర్ చేసింది. ఈ డీల్ కు పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చేందుకు పలు ఫండ్లు ముందుకొచ్చాయని చెబుతోన్న పెర్ప్లెక్సిటీ ఏఐ.. పేర్లను మాత్రం వెల్లడించలేదు.ఆన్లైన్ సెర్చ్ మార్కెట్ గుత్తాధిపత్యాన్నిఆక్షేపిస్తూ కోర్టు తీర్పు నేపథ్యంలో గూగుల్‌పై ఇప్పటికే రెగ్యులేటరీ ఒత్తిడి కొనసాగుతోంది. ఈ క్రమంలో క్రోమ్‌ను వదులుకోవాలన్న ప్రతిపాదన కూడా ఉంది. అయితే కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళతాం కానీ బ్రౌజర్ ను విక్రయించే ఉద్దేశం మాత్రం లేదని గూగుల్ తెలిపింది. ఈ పరిణామాలు జరుగుతుండగానే పెర్ప్లెక్సిటీ ఏఐ నుంచి కొనుగోలు ప్రతిపాదన రావడం గమనార్హం.ఎవరీ అరవింద్ శ్రీనివాస్?చెన్నైలో జన్మించిన అరవింద్ శ్రీనివాస్ ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్. గతంలో గూగుల్లోనే పనిచేసిన శ్రీనివాస్ డెనిస్ యారాట్స్, జానీ హో, ఆండీ కొన్విన్స్కీలతో కలిసి 2022లో పెర్ప్లెక్సిటీ ఏఐ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ రియల్ టైమ్‌లో సమాధానాలను అందించే తన సంభాషణాత్మక ఏఐ సెర్చ్ ఇంజిన్‌తో శరవేగంగా అభివృద్ధి చెందింది. ఈ కంపెనీ ఇటీవల తన సొంత ఏఐ ఆధారిత బ్రౌజర్ కామెట్ ను కూడా ప్రారంభించింది. క్రోమ్ ను కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా వినియోగదారులను చేరుకోవచ్చని యోచిస్తోంది.👉 చదవండి: ఐఐటీ హైదరాబాద్‌లో అద్భుతం.. డ్రైవర్ లేని బస్సుల ఘనత -
పూర్తిగా మహీంద్రా చేతుల్లోకి ఎస్ఎంఎల్ ఇసుజు
ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (ఎం అండ్ ఎం) ఎస్ఎంఎల్ ఇసుజు లిమిటెడ్‌లో 58.96 శాతం నియంత్రణ వాటాను జపాన్‌కు చెందిన సుమిటోమో కార్పొరేషన్, ఇసుజు మోటార్స్ నుండి రూ .555 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ లావాదేవీలో భాగంగా పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి అదనంగా 26 శాతం వాటాను పొందేందుకు ఎం అండ్ ఎం తప్పనిసరి ఓపెన్ ఆఫర్ ను ప్రారంభించనుంది.కొనుగోలు అనంతరం రెగ్యులేటరీ అనుమతులకు లోబడి కంపెనీ పేరును 'ఎస్ ఎంఎల్ మహీంద్రా లిమిటెడ్ 'గా మార్చనున్నారు. అలాగే ఎస్ఎంఎల్ బోర్డును పునర్వ్యవస్థీకరించారు. మహీంద్రా గ్రూప్ లో ఏరోస్పేస్ & డిఫెన్స్, ట్రక్కులు, బస్సులు & సీఈ ప్రెసిడెంట్‌గా ఉన్న వినోద్ సహాయ్ ఎస్ఎంఎల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమితులయ్యారు. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవోగా డాక్టర్ వెంకట్ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు.ఈ వ్యూహాత్మక కొనుగోలుతో 3.5 టన్నులకుపైబడిన వాణిజ్య వాహన విభాగంలో మహీంద్రా సంస్థ సామర్థ్యం మరింత మెరుగుపడనుంది. ఈ విభాగంలో ప్రస్తుతం కంపెనీ 3% మార్కెట్ వాటాను కలిగి ఉంది. 1983లో ఏర్పాటైన ఎస్ఎంఎల్ సంస్థ ట్రక్కులు, బస్సుల విభాగంలో దేశవ్యాప్తంగా బలమైన బ్రాండ్‌గా ప్రసిద్ధి చెందింది. -
టాటా మోటార్స్ రూ.10,000 కోట్ల సమీకరణ!
న్యూఢిల్లీ: ఇటలీ కంపెనీ ఇవెకో గ్రూప్ కొనుగోలు కోసం తీసుకుంటున్న స్వల్పకాలిక రుణాన్ని (బ్రిడ్జ్ ఫైనాన్సింగ్) తీర్చివేసేయడంపై టాటా మోటార్స్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సుమారు 1 బిలియన్ యూరోలను (సుమారు రూ. 10,000 కోట్లు) ఈక్విటీగా, మిగతా మొత్తాన్ని దీర్ఘకాలిక రుణాలుగా సమకూర్చుకునే యత్నాల్లో ఉన్నట్లు టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్‌వో పీబీ బాలాజీ తెలిపారు. ఇవెకో డీల్ ముగిసిన 12–18 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చన్నారు. 3.8 బిలియన్ యూరోలతో (సుమారు రూ. 38,240 కోట్లు) వాణిజ్య వాహనాల కంపెనీ ఇవెకో గ్రూప్‌ను టాటా మోటార్స్ కొనుగోలు చేయనుంది. ఇందుకు మోర్గాన్ స్టాన్లీ, ఎంయూఎఫ్‌జీ తదితర సంస్థలు బ్రిడ్జ్ ఫైనాన్సింగ్ చేస్తున్నాయి.నాలుగో స్థానానికి...: ఇన్వెస్టర్లతో సమావేశం సందర్భంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఇవెకో కూడా కలిస్తే 6 టన్నుల ట్రక్కుల కేటగిరీలో టాటా మోటార్స్ గ్రూప్ మొత్తం అమ్మకాలు వార్షికంగా 2.3 లక్షల యూనిట్ల పైచిలుకు ఉంటుంది. తద్వారా దాదాపు వోల్వో గ్రూప్‌తో సమానంగా నాలుగో స్థానంలో ఉంటుంది. కొనుగోలుకు ముందు ఏటా 1.8 లక్షల యూనిట్లతో టాటా మోటార్స్ గ్రూప్ ఆరో స్థానంలో, 50,000 యూనిట్లతో ఇవెకో 17వ స్థానంలో ఉన్నాయి. తొలి మూడు స్థానాల్లో దైమ్లర్ గ్రూప్ (3.5 లక్షల యూనిట్లు), సీఎన్హెచ్టీసీ గ్రూప్ (2.5 లక్షలు), ట్రాటన్ గ్రూప్ (2.4 లక్షల యూనిట్లు) ఉన్నాయి. 2024 డిసెంబర్ నాటికి ఇవెకో సంస్థకు అంతర్జాతీయంగా 32,000 మంది ఉద్యోగులు ఉన్నారు. -
అమెరికన్ సంస్థల్లో హైదరాబాద్ కంపెనీ విలీనం
హైదరాబాదీ ఏజెంటిక్ ఏఐ సంస్థ కోవాసెంట్ టెక్నాలజీస్ తాజాగా అమెరికాకు చెందిన కోనాఏఐ, డీక్యూబ్ డేటా సైన్సెస్‌లో విలీనమైంది. ఎంటర్ప్రైజ్ రిస్క్ మేనేజ్మెంట్, సైబర్ సెక్యూరిటీ తదితర విభాగాల్లో ఏజెంటిక్ ఏఐ వినియోగాన్ని మరింతగా పెంచేందుకు ఈ వ్యూహాత్మక విలీనం దోహదపడగలదని కోవాసెంట్ టెక్నాలజీస్ సీఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు.ఇదీ చదవండి: బడ్జెట్ ధరలో మోటో 5జీ ఫోన్ఏఐ ఆధారిత సర్వీసెస్ యాజ్ సాఫ్ట్వేర్ విభాగంలో అగ్రగామిగా ఎదిగేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. ఇకపై కోవాసెంట్కి అనిల్ కోనా సీవోవో, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా వ్యవహరిస్తారు. కోనాఏఐ, డీక్యూబ్ వ్యవస్థాపకుడు అయిన అనిల్‌కి ఫోరెన్సిక్ అనలిటిక్స్.. సైబర్ సెక్యూరిటీలో అపార అనుభవం ఉంది. -
క్యాప్‌జెమిని చేతికి డబ్ల్యూఎన్ఎస్
సొంత అవసరాల కోసం దేశీయంగా మూడు దశాబ్దాల క్రితం బ్రిటిష్ ఎయిర్వేస్ నెలకొల్పిన డబ్ల్యూఎన్ఎస్ చివరికి ఫ్రెంచ్ దిగ్గజం క్యాప్‌జెమిని చేతికి చిక్కింది. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్(బీపీఎం) సంస్థ డబ్ల్యూఎన్ఎస్ను 330 కోట్ల డాలర్ల(సుమారు రూ. 28,250 కోట్లు) నగదు చెల్లింపు ద్వారా క్యాప్‌జెమిని సొంతం చేసుకోనుంది. బీపీఎం రంగంలో భారీ డీల్‌కు తెరతీస్తూ టెక్నాలజీ సేవల గ్లోబల్ దిగ్గజం క్యాప్‌జెమిని.. డబ్ల్యూఎన్ఎస్ను కొనుగోలు చేస్తోంది. ఒక్కో షేరుకీ 76.5 డాలర్లు చొప్పున ఆఫర్ చేసింది. ఇది గురువారం ముగింపు(ఎన్వైఎస్ఈ) ధరతో పోలిస్తే 17 శాతం అధికంకాగా.. నెల రోజుల సగటు ధరతో చూస్తే 27 శాతం ప్రీమియం చెల్లిస్తోంది. ఇందుకు నగదు రూపేణా మొత్తం 3.3 బిలియన్ డాలర్లు వెచ్చించనుంది. వెరసి బీపీఎం విభాగంలో అతిపెద్ద డీల్స్‌లో ఒకటిగా ఇది నిలవనుంది. తాజా డీల్‌కు రెండు సంస్థల బోర్డులు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు క్యాప్‌జెమిని వెల్లడించింది. రెండు కంపెనీలూ భారత్‌లో పటిష్ట కార్యకలాపాలు విస్తరించాయి. సంయుక్తంగా 2,00,000 మంది సిబ్బందిని కలిగి ఉన్నాయి. తాజా కొనుగోలుతో తమ క్లయింట్లకు బిజినెస్, టెక్నాలజీ ట్రాన్స్ఫార్మేషన్ కార్యకలాపాలను క్యాప్‌జెమిని.. మరింత సమర్థవంతంగా సమకూర్చగలుగుతుంది. సంప్రదాయ బిజినెస్ ప్రాసెస్ సర్వీసుల నుంచి ఆధునిక ఏఐ ఆధారిత మేథో కార్యకలాపాలను క్యాప్‌జెమిని అందించగలుగుతుంది.ఇదీ చదవండి: రోజుకు 12 గంటలు.. వారానికి 6 రోజులు.. సండే కూడా ఆఫీస్డబ్ల్యూఎన్ఎస్ నేపథ్యమిదీ...1999లో బ్రిటిష్ ఎయిర్వేస్ ముంబైలో సొంత అవసరాల కోసం డబ్ల్యూఎన్ఎస్ను నెలకొలి్పంది. పుణేలో డెలివరీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. 2002లో వార్బర్గ్ పింకస్ 40 కోట్ల డాలర్లకు మెజారిటీ వాటా కొనుగోలు చేసి కంపెనీ పేరును డబ్ల్యూఎన్ఎస్గా మార్చింది. 2006లో ఎన్వైఎస్ఈలో లిస్ట్ చేసింది. 2013లో వార్బర్గ్ పింకస్ 19.2 కోట్ల డాలర్లకు డబ్ల్యూఎన్ఎస్ను విక్రయించింది. కంపెనీ ప్రధానంగా బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్తోపాటు.. డేటా అనలిటిక్స్ సర్వీసులు అందిస్తోంది. 2025లో 1.27 బిలియన్ డాలర్ల ఆదాయం సాధించింది. -
చేతులు మారుతున్న కంపెనీలు.. రూ.వందల కోట్ల డీల్స్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఐటీసీ తాజాగా శ్రేష్ఠ నేచురల్ బయోప్రొడక్ట్స్లో 100 శాతం వాటా సొంతం చేసుకోనుంది. 24మంత్ర ఆర్గానిక్ బ్రాండు కంపెనీతో వాటా కొనుగోలు ఒప్పందాన్ని(ఎస్పీఏ) కుదుర్చుకున్నట్లు స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఐటీసీ వెల్లడించింది. ఇందుకు నగదు రూపేణా దాదాపు రూ. 473 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది.24మంత్ర బ్రాండుతో 100 రకాలకుపైగా ఫుడ్ ప్రొడక్టులను శ్రేష్ఠ విక్రయిస్తోంది. తద్వారా వేగవంత వృద్ధిలోనున్న ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్టుల విభాగంలో ఐటీసీ మరింత విస్తరించనుంది. కాగా.. మరోపక్క సహచర సంస్థ మదర్ స్పార్‡్ష బేబీ కేర్‌లో మిగిలిన 73.5 శాతం వాటా సైతం చేజిక్కించుకోనున్నట్లు పేర్కొంది. 2022లో ఈ డీ2సీ కంపెనీలో 26.5 శాతం వాటా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కేఫిన్‌టెక్ చేతికి ఎసెంట్ ఫండ్ సర్వీసెస్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇన్వెస్టర్ సొల్యూషన్స్ సేవల సంస్థ కేఫిన్ టెక్నాలజీస్ (KFin Technologies) తాజాగా ఎసెంట్ ఫండ్ సర్వీసెస్‌లో (Ascent Fund Services) 51 శాతం వాటాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ 34.7 మిలియన్ డాలర్లు. వచ్చే అయిదేళ్లలో ఎసెంట్‌లో కేఫిన్‌టెక్ 100 శాతానికి వాటాలు పెంచుకోనుంది. ఇందుకోసం మిగతా 49 శాతం వాటాలను 2028, 2029, 2030లో ఏడాదికి 16.33 శాతం చొప్పున దక్కించుకోనుంది.సింగపూర్ హెడ్‌క్వార్టర్స్‌గా కార్యకలాపాలు సాగిస్తున్న ఎసెంట్ అంతర్జాతీయంగా 260 పైచిలుకు గ్లోబల్ ఆల్టర్నేటివ్ అసెట్ మేనేజర్లకు ఫండ్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసులు అందిస్తోంది. అత్యంత వేగంగా ఎదుగుతున్న అంతర్జాతీయ ఫండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో కేఫిన్‌టెక్ విస్తరించేందుకు ఈ డీల్ ఉపయోగపడుతుందని సంస్థ ఎండీ శ్రీకాంత్ నాదెళ్ల తెలిపారు. ఇరు సంస్థలు సమిష్టిగా మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుని, పరిశ్రమలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతాయని ఎసెంట్ సహ–వ్యవస్థాపకుడు కౌషల్ మండలియా తెలిపారు.