
ముంబై: ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (ఎం అండ్ ఎం) ఎస్ఎంఎల్ ఇసుజు లిమిటెడ్‌లో 58.96 శాతం నియంత్రణ వాటాను జపాన్‌కు చెందిన సుమిటోమో కార్పొరేషన్, ఇసుజు మోటార్స్ నుండి రూ .555 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ లావాదేవీలో భాగంగా పబ్లిక్ షేర్ హోల్డర్ల నుంచి అదనంగా 26 శాతం వాటాను పొందేందుకు ఎం అండ్ ఎం తప్పనిసరి ఓపెన్ ఆఫర్ ను ప్రారంభించనుంది.
కొనుగోలు అనంతరం రెగ్యులేటరీ అనుమతులకు లోబడి కంపెనీ పేరును 'ఎస్ ఎంఎల్ మహీంద్రా లిమిటెడ్ 'గా మార్చనున్నారు. అలాగే ఎస్‌ఎంఎల్ బోర్డును పునర్‌వ్యవస్థీకరించారు. మహీంద్రా గ్రూప్ లో ఏరోస్పేస్ & డిఫెన్స్, ట్రక్కులు, బస్సులు & సీఈ ప్రెసిడెంట్‌గా ఉన్న వినోద్ సహాయ్ ఎస్‌ఎంఎల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా నియమితులయ్యారు. అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవోగా డాక్టర్ వెంకట్ శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు.
ఈ వ్యూహాత్మక కొనుగోలుతో 3.5 టన్నులకుపైబడిన వాణిజ్య వాహన విభాగంలో మహీంద్రా సంస్థ సామర్థ్యం మరింత మెరుగుపడనుంది. ఈ విభాగంలో ప్రస్తుతం కంపెనీ 3% మార్కెట్ వాటాను కలిగి ఉంది. 1983లో ఏర్పాటైన ఎస్‌ఎంఎల్ సంస్థ ట్రక్కులు, బస్సుల విభాగంలో దేశవ్యాప్తంగా బలమైన బ్రాండ్‌గా ప్రసిద్ధి చెందింది.