
డీల్ విలువ రూ.3,498 కోట్లు
డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ తాజాగా ఆదిత్య బిర్లా రియల్టీ(ఏబీఆర్‌ఈఎల్) నుంచి పల్ప్, పేపర్ బిజినెస్ కొనుగోలుకి కాంపిటీషన్ కమిషన్‌ను ఆశ్రయించింది. తద్వారా రూ.3,498 కోట్ల విలువైన ఈ డీల్‌పై అనుమతిని కోరింది. 1984లో ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో ఏబీఆర్‌ఈఎల్ నెలకొల్పిన సెంచురీ పల్ప్ అండ్ పేపర్ బిజినెస్‌ను ఐటీసీ సొంతం చేసుకోనుంది. ప్రస్తుతం వార్షికంగా 4.8 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో దేశీ పేపర్ పరిశ్రమలో సుప్రసిద్ధ కంపెనీగా సెంచురీ పల్ప్ అవతరించింది. అయితే ప్రతిపాదిత కొనుగోలు కారణంగా పోటీకి సంబంధించి ఎలాంటి ఆందోళనలు తలెత్తబోవని ఐటీసీ పేర్కొంది.
ఇదీ చదవండి: మీరు ఆస్తిపరులా? లేదా ధనవంతులా?
దేశీ పేపర్ మార్కెట్లలో తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో తాజా డీల్ ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపబోదని సీసీఐకు వివరించింది. కాగా.. పల్ప్, పేపర్ బిజినెస్‌ను స్లంప్ సేల్ ప్రాతిపదికన ఐటీసీకి విక్రయించేందుకు బోర్డు అనుమతించినట్లు ఈ ఏడాది మార్చిలో ఏబీఆర్‌ఈఎల్ తెలియజేసింది. ఇందుకు నగదు రూపేణా ఐటీసీ రూ. 3,498 కోట్లు చెల్లించేందుకు అంగీకరించినట్లు వెల్లడించింది. తద్వారా తమకు కీలకమైన రియల్టీ విభాగంపై దృష్టిసారించనున్నట్లు పేర్కొంది. 2020–24 మధ్యకాలంలో రూ, 4,000 కోట్ల ఫ్రీ క్యాష్ ఫ్లో సాధించిన పేపర్ బోర్డ్స్, ప్యాకేజింగ్ విభాగం ఇకపైనా ఇదే రీతిలో కొనసాగనున్నట్లు ఐటీసీ ఇటీవల అంచనా వేసిన సంగతి తెలిసిందే.