
ఈరోజుల్లో చాలా కుటుంబాల్లో ఇల్లు, బంగారం, భూమి కొనుగోలు కోసం అధికంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇవి దీర్ఘకాలంలో భద్రతా భావనను కలిగిస్తాయి. సామాజికంగా గౌరవం తెస్తాయి. ఇవి ఆర్థికంగా జీవితంలో విజయానికి సంకేతంగా నిలుస్తాయి. కానీ ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులు వస్తే వెంటనే ఉన్న భూమి అమ్మి ఖర్చు చేయలేని పరిస్థితులు నెలకొంటాయి. స్థిరాస్తులు వెంటనే నగదుగా మార్చుకోలేని ఆస్తులని గుర్తించాలి. పెద్ద ఇల్లు, బంగారం, వేల గజాల భూమి ఉన్నా నెలవారీ ఖర్చులు, ఆరోగ్య సమస్యలను తీర్చలేవు. ఇందువల్లే మనం నిజంగా ‘ఆస్తిపరులమా? ధనవంతులమా?’ అనే భావన వస్తుంది.
ఎందుకు ఇలాంటి పరిస్థితులు వస్తాయి?
సామాజిక ఒత్తిడి
చదువు పూర్తయి ఉద్యోగం సంపాదించి పెళ్లి జరిగేలోపు ఇల్లు కొనాలి అనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. దీనివల్ల పెద్ద మొత్తంలో ఈఎంఐతో స్థిరాస్తిలో కొనుగోలు చేస్తుంటారు. ఇది వారి ఆదాయాన్ని కొన్నేళ్లపాటు పరిమితం చేస్తుంది.
ఆర్థిక ప్రణాళిక లోపాలు
చాలా మంది అత్యవసర నిధిని ఏర్పాటు చేయరు. తగిన బీమా కవరేజీ ఉండదు. అన్ని పెట్టుబడులు బంగారం, భూమి వంటి స్థిరమైన ఆస్తులపైనే ఉండిపోతాయి. వాటితో రెగ్యులర్ ఆదాయం ఒనగూరదు.
ఆదాయాన్నిచ్చే ఆస్తులను విస్మరించడం
మ్యూచువల్ ఫండ్స్, డివిడెండ్ స్టాక్స్, అద్దె ఇల్లు, సైడ్ బిజినెస్ వంటి ఆదాయమిచ్చే పెట్టుబడులను విస్మరిస్తారు. భద్రత అనే నెపంతో బంగారం, స్థిరాస్తుల్లోనే మొత్తం పెట్టుబడిని మళ్లిస్తారు. కానీ అవి మిగతా అవసరాలను తీర్చలేవని గ్రహించరు.
ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి?
ఆస్తుల్లో పెట్టుబడి పెట్టే ముందు కనీసం 3–6 నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి. తగిన హెల్త్, లైఫ్, ఆస్తి బీమా ఉండాలి. డబ్బును సులభంగా విత్‌డ్రా చేసే వీలుండే లిక్విడ్ ఇన్వెస్ట్‌మెంట్స్ (సిప్, షార్ట్ టర్మ్ ఫండ్స్)లో ఇన్వెస్ట్ చేయాలి. నిరంతర నగదు ప్రవాహం కోసం డివిడెండ్ స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టాలి. క్రమానుగత పెట్టుబడులు ప్రారంభించి దీర్ఘకాలిక ఆదాయానికి మార్గాలు వేయాలి. వీలైతే ఫ్రీలాన్సింగ్ లేదా సైడ్ బిజినెస్ ప్రారంభించాలి. అద్దె ఇల్లు/ కమర్షియల్ ప్రాపర్టీ వంటి ఆదాయ ఆస్తులను అన్వేషించాలి.
ఇదీ చదవండి: పండగ రోజు బంగారం ధరల తుపాను.. తులం ఎంతంటే..