నోటిఫై అయిన 322 మిల్లుల్లో కొనుగోళ్లు జరపాలని జిన్నింగ్ మిల్లుల సంఘం డిమాండ్
సమ్మె నిర్ణయాన్ని విరమించుకోవాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి... తిరస్కరించిన జిన్నింగ్ మిల్లుల సంఘం
పత్తిని మిల్లులకు తీసుకురావొద్దని మిల్లర్ల వినతి
సాక్షి, హైదరాబాద్: పత్తి కొనుగోళ్ల విషయంలో నెలకొన్న గందరగోళానికి తెరపడడం లేదు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తీసుకొచ్చిన నిబంధనలపై నిరసన వ్యక్తం చేస్తూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేయనున్న విషయం తెలిసిందే. ఎల్–1, ఎల్–2 నుంచి ఎల్–12 వరకు మిల్లుల విభజనను వ్యతిరేకిస్తూ మిల్లర్లు ఈనెల 6వ తేదీన బంద్‌కు పిలుపునిచ్చా రు. అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి మేరకు బంద్ ఆలోచనను వాయిదా వేసుకున్నారు. అయితే పదిరోజులైనా నిబంధనల్లో సడలింపులు లేకపోవడంతో సోమవారం నుంచి మిల్లులను బంద్ చేయనున్నట్టు ఇటీవల అల్టిమేటం ఇచ్చారు.
అయితే వివిధ మార్కెట్‌లకు పెద్దఎత్తున పత్తి వస్తున్న నేపథ్యంలో బంద్ ఆలోచన విరమించుకోవాలని మంత్రి తుమ్మల, వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్రమోహన్‌తోపాటు ఆయా జిల్లా కలెక్టర్లు జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో జరిపిన చర్చలు సఫలం కాలేదు. రాష్ట్రంలో సీసీఐ నోటిఫై చేసిన 322 మిల్లులను తెరిపించి, అన్నింటిలో కొనుగోళ్లు జరిపితేనే పత్తి కొనుగోళ్లు సాగుతాయని స్పష్టం చేసినట్టు అసోసియేషన్ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి బి.రవీందర్‌రెడ్డి, కక్కిరాల రమేశ్ ‘సాక్షి’కి తెలిపారు. బంద్ నేపథ్యంలో పత్తిని మిల్లులకు తీసుకురావొద్దని రైతులకు వారు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర జౌళిశాఖ అధికారులతో మాట్లాడిన మంత్రి తుమ్మల
పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని జిన్నింగ్ మిల్లుల యాజమన్యాలు అల్టిమేటం ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర జౌళిశాఖ అధికారులతో ఆదివారం ఫోన్‌లో మాట్లాడారు. సీసీఐ తీసుకొచ్చిన ఎల్–1, ఎల్–2..నిబంధనలతో జిన్నింగ్ మిల్లర్లు నష్టపోతున్నారని, అన్ని జిన్నింగ్ మిల్లులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పత్తి రైతులు ఇప్పటికే అకాల వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సీసీఐ తీసుకొచ్చిన 12 లోపు తేమశాతం, ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి నిబంధనతో కష్టాలు పడుతున్నారని తెలిపారు.
మంగళవారం రాష్ట్రానికి సీసీఐ సీఎండీ!
సీసీఐ ఆంక్షలు, జిన్నింగ్ మిల్లుల బంద్ వంటి అంశాలపై ప్రభుత్వంతో చర్చించేందుకు ఈనెల 18న సీసీఐ సీఎండీ లలిత్‌కుమార్ గుప్తా రాష్ట్రానికి రానున్నట్టు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చేసిన విజ్ఞప్తుల నేపథ్యంలో సీసీఐ సీఎండీని ప్రభుత్వంతో చర్చలకు పంపించినట్టు సమాచారం. కాగా సీసీఐ సీఎండీ వచ్చేంత వరకు ఈ సమస్య పరిష్కారం కాదని తేలిపోవడంతో సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి.


