పత్తి పంటను అమ్ముకోలేక రైతుల పరేషాన్
తేమ శాతం పేరిట తక్కవ ధరకు కొనుగోలు
ఎల్ 1, ఎల్ 2 కేటగిరీల విభజనతో పూర్తిగా తెరుచుకోని మిల్లులు
అకాల వర్షాలతో పంటనష్టపోయిన రైతులకు దొరకని మద్దతు ధర
ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు పేరు మల్లన్న. ఈయనది ఆదిలాబాద్ జిల్లా తాంసి(బి) గ్రామం. ఈ వానాకాలం సీజన్‌లో 14 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశాడు. మొదటిసారి పత్తితీతలో 60 క్వింటాళ్ల దిగుబడి వచి్చంది. తేమశాతం ఎక్కువగా ఉండటంతో మద్దతు ధర కోసం పత్తిని ఆరబెట్టాడు. అయితే ప్రస్తుతం ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి ఉండటంతోపాటు కౌలు రైతులకు అమ్ముకునే అవకాశం లేదు. దీంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలో ఉన్నాడు.
సాక్షి, హైదరాబాద్: ఈ వానాసీజన్‌లో రెండుమూడు సార్లు కురిసిన అకాల వర్షాలతో ఇబ్బంది పడిన పత్తి రైతులను మోంథా తుపాను మరింత కుంగదీసింది. దీనికి సీసీఐ ఆంక్షలు కూడా తోడయ్యాయి. ఆయా జిల్లాల్లోని మార్కెట్లను పత్తి పంట ముంచెత్తుతున్నా, సీసీఐ కొనుగోళ్లు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. పత్తికి ప్రధాన మార్కెట్లుగా ఉన్న వరంగల్, ఆదిలాబాద్‌లో కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. సీసీఐకి విక్రయిస్తే మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 8,110 దక్కుతుందని భావించిన రైతులకు నిరాశే మిగులుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా గురువారం వరకు సీసీఐ ద్వారా 91.17 వేల మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోళ్లు జరిగితే, ప్రైవేటు వ్యాపారులు కూడా సుమారు 40 వేల మెట్రిక్ టన్నులకు పైగా పత్తిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సీసీఐ విధించిన ఆంక్షల నేపథ్యంలోనే ఈ పరిస్థితి ఎదురవుతుందని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ చెబుతుండగా, నిబంధనలకు అనుగుణంగా తేమ శాతం లేని పత్తిని కొనుగోలు చేయడం లేదని సీసీఐ స్పష్టం చేస్తోంది.
తేమ శాతం 8 నుంచి 12 శాతం ఉంటేనే మద్దతు ధర
రాష్ట్రంలో చలికాలం వచ్చినా, వాతావరణంలో మార్పులు వల్ల కొద్ది రోజులుగా ఎండలు లేదు. పలు జిల్లాల్లో అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో ఇప్పటికే మొదటి విడత పత్తి తీసిన రైతులు దాన్ని విక్రయించేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. వర్షాలకు పత్తి నల్లబడడం, తేమ 12 శాతానికి పైగా ఉండడంతో మార్కెట్లకు తీసుకొచ్చిన పత్తిని సీసీఐ కొనుగోలు చేయకుండా పక్కనబెడుతోంది.
తడవకుండా, రంగు మారకుండా ఉన్న 12 శాతం లోపు తేమ ఉన్న తెల్లని పత్తికి మాత్రమే సీసీఐ క్వింటాల్‌కు మద్ధతు ధర రూ. 8110 చెల్లించి కొనుగోలు చేస్తుంది. దీంతో వరంగల్, ఆదిలాబాద్, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్, నారాయణపేట, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి తదితర మార్కెట్లన్నీ పత్తితో నిండిపోయాయి.
ఈ పరిస్థితుల్లో రైతులు జిన్నింగ్ మిల్లులకు నేరుగా విక్రయిస్తున్నారు. మిల్లర్లు క్వింటాల్‌కు రూ. 6,500 నుంచి రూ. 7,000 వరకు ధర చెల్లిస్తున్నారు. గురువారం వరంగల్‌లో పత్తి ధర రూ. 6,950గా పలికినట్టు మార్కెటింగ్ అధికారి ఒకరు తెలిపారు. ఆదిలాబాద్, నాగర్‌కర్నూలు, నారాయణపేట మొదలైన మార్కెట్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.
ఆంక్షలతో అవస్థలెన్నో...
సీసీఐ తీసుకొచి్చన కపాస్ కిసాన్ యాప్‌ను ఇప్పటి వరకు లక్ష మంది రైతులు కూడా డౌన్‌లోడ్ చేసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. జిన్నింగ్ మిల్లులను ఎల్–1, ఎల్–2, ఎల్–3 ప్రాతిపదికన కేటగిరీలుగా విభజించడంతో రాష్ట్రంలోని 322 మిల్లులకు గాను గురువారం నాటికి 256 మిల్లులు మాత్రమే తెరుచుకున్నాయి. రాష్ట వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం సుమారు 25 లక్షల మంది రైతులు 45.32 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తే... ఇప్పటి వరకు విక్రయించింది మాత్రం 50వేల మంది రైతులే.
ఈ సీజన్‌లో 28.29 లక్షల మెట్రిక్ టన్నుల పత్తిని కొనుగోలు చేయనున్నట్టు మార్కెటింగ్ శాఖ అంచనా వేయగా, కేవలం 91 వేల మెట్రిక్ టన్నులే ఇప్పటి వరకు సేకరించడాన్ని బట్టి సీసీఐ ఆంక్షల ప్రభావం ఎంత మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని జిన్నింగ్ మిల్లుల యజమానులు పత్తి కాకుండా వరి, ఇతర పంటలు సాగు చేసిన రైతుల పేరిట కపాస్ కిసాన్ యాప్ ఇన్‌స్టాల్ చేయించి, తమ దగ్గరున్న నిల్వ పత్తిని మద్ధతు ధరకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
పాత పద్ధతితోనే రైతుకు లాభం
నాలుగు ఎకరాల్లో పత్తి వేసిన. పురుగుతో తక్కువ కాత వచ్చింది. ఈ సమయంలోనే పడిన వర్షాలతో పత్తి దెబ్బతింది. సీసీఐకి అమ్మాలంటే నిబంధనల పేరుతో ఇబ్బంది పెడుతున్నారు. పాత పద్ధతిలో కొనుగోలు చేస్తేనే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. – తాళ్ల కిరణ్, పత్తిరైతు, ఆత్మకూరు, హనుమకొండ జిల్లా


