సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో కేసీఆర్-రేవంత్ కరచలనం.. పలకరింపుపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. అయితే.. కేసీఆర్‌ను తాను ముఖ్యమంత్రి హోదాలో కలవడం ఇదే తొలిసారేం కాదు కదా అని రేవంత్ అంటున్నారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియా చిట్‌చాట్‌లో ఈ అంశంపై స్పందించారు.
‘‘కేసీఆర్‌ను నేను సీఎం హోదాలో కలవడం ఇదే తొలిసారేం కాదు. గతంలో ఆస్పత్రిలోనూ కలిశాను కదా. నేను సభా నాయకుడ్ని. కాబట్టి అందరినీ గౌరవిస్తా. అందుకే కేసీఆర్‌ను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నా. మరి సభలో నుంచి వెంటనే ఎందుకు వెల్లిపోయారే ఆయన్నే అడగాలి’’ అని రేవంత్ అన్నారు.
శీతాకాల సమావేశాల్లో భాగంగా.. తొలిరోజు అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకం చేసి వెళ్లిపోయారు. అయితే ఆయన వెళ్లే లోపు సభలో సీఎం రేవంత్, ప్రభుత్వం విప్‌లు, మంత్రులు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సైతం కేసీఆర్ దగ్గకు వెళ్లి పలకరించి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఆ సమయంలో కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి మినహా మిగతా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు. అయితే..
రాకరాక సభకు వచ్చిన కేసీఆర్ కొద్దిసేపైనా సభలో ఉంటారనుకున్నామని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగా... బావుంది అని చెప్పారు. నా ఆరోగ్యం గురించి కూడా అడిగారు.. బావుందని చెప్పా. కేసీఆర్ హాస్పిటల్ లో దీక్ష చేశారు. నేను రోడ్లపై దీక్ష చేశాను. నేను ఒరిజినల్ ఉద్యమకారుడిని. తెలంగాణ కోసం పోరాడిన మాజీ శాసన సభ్యుల సంతాప తీర్మానం చదివే సమయంలో కేసీఆర్ బయటకి వెళ్లారు. మౌనం పాటించిన తర్వాత కేసీఆర్ వెల్తే బావుండేది అని కోమటిరెడ్డి అన్నారు.
పెద్ద మనిషిగా కేసీఆర్ ను కలవడంలో తప్పు లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కేసీఆర్ ను కలిశారు. నేనూ కేసీఆర్‌ను కలవాలి అనుకున్నా. కానీ, ఆయన చుటటూ దుర్మార్గులు ఉన్నారు. అందుకే కలవలేదు అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ అన్నారు.


