సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం అయ్యాయి. సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్.. పట్టుమని అరగంట కూడా ఉండకుండా వెళ్లిపోయారు. అయితే ఈలోపే సభలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.
మూడోసారి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. బీఆర్‌ఎస్‌ఎల్పీలో ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఆపై శాసన సభ ప్రారంభం అయ్యి.. జాతీయ గీతం ఆలాపన దాకా ఉన్నారు. అంతకంటే కాస్త ముందు.. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత వద్దకు వెళ్లి పలకరించారు. షేక్ హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆ సమయంలో కేటీఆర్, పాడి కౌశిక్‌రెడ్డి తప్ప అంతా నిల్చున్నారు.
ఆపై మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి సహా అధికార పార్టీ విప్‌లు కూడా కేసీఆర్‌ను పలకరించారు. నూతనంగా ఎన్నికైన జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సైతం కేసీఆర్‌ను పలకరించి ఆశీర్వాదం తీసుకున్నారు. అయితే.. ఆ తర్వాత ఆయన సభలో కనిపించలేదు. అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్ట్రర్‌లో సంతకం చేసిన అనంతరం జీరో అవర్ ప్రారంభం కాకముందే కేసీఆర్ వెళ్లిపోయారు. అక్కడి నుంచి ఆయన నేరుగా నందినగర్ నివాసానికి చేరుకున్నారు.
కాగా, కృష్ణా జలాల పంపిణీపై జరగనున్న శీతాకాల సమావేశాలు రణరంగాన్ని తలపించే అవకాశాలున్నాయి. ఈ అంశంపై ఇటీవల కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి స్పందనతోపాటు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధాన్ని బట్టి చూస్తే ఈసారి అసెంబ్లీ వాడీవేడిగా జరగనుందని తెలుస్తోంది. ఈసారి కనీసం 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఆర్‌ఎస్ పట్టుపడుతోంది. అయితే నేటి పరిణామం నేపథ్యంలో కేసీఆర్ సభకు హాజరవుతారా? లేదా? అనే ఉత్కంఠ కొనసాగనుంది.




