సాక్షి, కామారెడ్డి జిల్లా: గర్గుల్ గ్రామంలో బాంబులు కలకలం రేపాయి. గ్రామ శివారులోని మొగుళ్ల సాయ గౌడ్‌కు చెందిన పొలంలో బాంబు పేలడంతో కుక్క అక్కడికక్కడే మృతి చెందింది. భారీ శబ్దం, పొగ రావడంతో చుట్టుపక్కలున్న రైతులు ఉలిక్కిపడ్డారు. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తమ పొలాల్లో బాంబులు వేసి వెళ్లారని రైతులు ఆందోళన చెందుతున్నారు.
బాంబుల భయంతో కూలీ పనివారు ఎవరు కూడా పనికి రావడం లేదని రైతులు అంటున్నారు. యాసంగి వరి నాట్లు వేసే సీజన్ అవడంతో పంట దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాంబు పేలుళ్లపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో రైతులు ఫిర్యాదు చేశారు. నిందితుల్ని పట్టుకుని శిక్షించాలని రైతులు కోరుతున్నారు.


