మూసీలో ముందడుగు
● నిర్వాసితులకు టీడీఆర్ రూపంలో పరిహారం
● తొలిదశలో 21 కి.మీ. మేర సుందరీకరణ పనులు
● ఫేజ్–1 ఏలో హిమాయత్ సాగర్– గాంధీ సరోవర్
● ఫేజ్–1 బీలో ఉస్మాన్‌సాగర్– గాంధీ సరోవర్ వరకు అభివృద్ధి
55 ఎకరాల భూ సమీకరణకు సర్కారు నిర్ణయం
సాక్షి, సిటీబ్యూరో: మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇన్నాళ్లూ మూసీ అభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారిన భూ సమీకరణకు మార్గం సుగమమైంది. నది సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ ప్రక్రియను ప్రారంభించింది. హైదరాబాద్ జిల్లాలోని గోల్కొండ మండలం, రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పరిధిలో సుమారు 55 ఎకరాల భూములను సేకరించనుంది. ఈమేరకు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఆర్‌డీసీఎల్) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. భూ నిర్వాసితులకు భూ బదలాయింపు హక్కు (ట్రాన్స్‌ఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్స్–టీడీఆర్) రూపంలో పరిహారం అందించాలని నిర్ణయించారు.
పట్టా భూములకు టీడీఆర్ సర్టిఫికెట్ల
● సుందరీకరణలో సీఎం రేవంత్ లక్ష్యానికి అనుగుణంగా.. బాపూఘాట్ ప్రాంతాన్ని గాంధీ సరోవర్‌గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలి దశలో జంట జలాశయాలైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల నుంచి బాపూఘాట్ వరకు అభివృద్ధి చేయనున్నారు. ఫేజ్–1ఏలో హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 9.2 కి.మీ, ఫేజ్–1బీలో ఉస్మాన్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 11.8 కిలోమీటర్ల పరిధిలో భూసేకరణ చేపట్టి.. నదికి రెండు వైపులా మొత్తం 21 కి.మీ. మేర అభివృద్ధి చేయనున్నారు. పరీవాహక ప్రాంతంలో సరైన రెవెన్యూ పత్రాలు, పట్టా భూములున్న వారికి టీడీఆర్ సర్టిఫికెట్లను అందజేయనున్నారు.
సుందరీకరణ ఇలా..
ఘన, జల వ్యర్థాలతో నిండిపోయిన నదిని మొదట శుభ్రం చేస్తారు. 2 మీటర్ల లోతు వ్యర్థాలు, పూడిక తీస్తారు. ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మిస్తారు. చుట్టూ మురుగునీటి శుద్ది కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలను మళ్లించి.. 24/7 నదిలో పారేలా సుందరీకరిస్తారు. నడక మార్గాలు, సైకిల్ ట్రాక్‌లు, భూగర్భ జలాల రీచార్జ్ కోసం పార్క్‌లు, వర్షపు తోటలు, గ్రీన్‌రూఫ్‌లు, బ్యాటరీ వాహనాలు, ఎలక్ట్రిక్ రిక్షాలు వంటివి ఉంటాయి. నైట్ ఎకానమీలో భాగంగా అమ్యూజ్‌మెంట్‌పార్క్, వాటర్ ఫాల్స్, చిల్డ్రన్స్ వాటర్ స్పోర్ట్స్, వీధి వర్తకుల వ్యాపార సముదాయాలు, వంతెనలు, వినోద కేంద్రాలు, రెస్టారెంట్లు, క్రీడా సౌకర్యాలు, వాణిజ్య, రిటైల్ స్థలాలను అభివృద్ది చేస్తారు.


