రెండు తెలుగు రాష్ట్రాల్లో పత్తి రైతులు సంక్షోభంలో ఉన్నారు. సేద్యపు ఖర్చులు పెరుగుతూ ఉండటం, న్యాయమైన ధర లభించక పోవటం, ప్రకృతి వైపరీత్యాలకు పంట నష్టపోవడం, పత్తి దిగుమతులు పెరుగుతూ ఉండటం ఇందుకు కారణాలు.
తెలంగాణలో ఎకరాకు సగటున 11.74 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా, ఎకరాకు 12 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేస్తామని సీసీఐ చెప్పింది. ఆంధ్రప్రదేశ్‌లో 4.56 లక్షల హెక్టార్లలో రైతాంగం పత్తి సేద్యం చేశారు. సుమారు 8 లక్షల టన్నుల పత్తి దిగుబడివస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ క్రమంలో భారీ వర్షాలకు అపార నష్టం జరిగింది. ఎకరం సేద్యంపై 40 వేలకు పైగా రైతు పెట్టుబడి పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎటువంటి వంకలూ పెట్టకుండా రైతుల వద్ద ఉన్నపత్తిని పూర్తిగా కొనుగోలు చేయాల్సిన బాధ్యత సీసీఐ చేపట్టే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
సంక్షోభంలో ఉన్న పత్తి రైతుల వద్ద నుంచి పత్తి సేకరణకు చాలా ఆలస్యంగా కొనుగోలుకేంద్రాల ఏర్పాటు ప్రకటన వచ్చింది. రెండు రాష్ట్రాల్లో ఎక రాకు 12 క్వింటాళ్ల పత్తి కొను గోలు చేస్తానని చెప్పి 7 క్వింటా ళ్లకు తగ్గించారు. పత్తికి 8,110 రూపాయల మద్దతు ధర ఇవ్వాలంటే తేమ 12% మించరాదని నిబంధన పెట్టారు. రైతు సీసీఐ కేంద్రాల్లో అమ్ముకోవాలంటే ముందుగా రైతు సేవా కేంద్రాల్లో పేరు నమోదు చేసుకున్న తర్వాత,కేంద్రం పెట్టిన ‘కిపాస్ కిసాన్ స్లాట్’లో 24 గంటల ముందు బుక్ చేసుకోవాలి. దీనిపై 70% మంది రైతులకు అవగాహన లేదు. సీసీఐ నిబంధనలు రైతుల నుంచి పత్తి కొనుగోళ్లను తగ్గించుకోవటానికే!
చదవండి : Ande Sri బడిలో చదవలేదు..లోకమే ఆయనకు విశ్వవిద్యాలయం
రెండు రాష్ట్రాల్లో తుపాన్, భారీ వర్షాల వల్ల పత్తికి నష్టం జరిగి ఎకరాకు దిగుబడి 5 నుండి 7 క్వింటాళ్లకుమించి రాదనీ, అందుకే సేకరణ ఎకరాకు 12 నుండి 7 క్వింటాళ్లకు తగ్గించడం జరిగిందనీ సీసీఐ చెప్పటం మోసమే! ఎటువంటి ఆంక్షలూ లేకుండా పత్తి మద్దతు ధరను 10 వేలుగా ప్రకటించాలనీ, పత్తి దిగుమతులపై 30% సుంకం విధించాలనీ, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పత్తి కొనుగోలు చేయాలనీ... రైతాంగం ఆందోళన బాట పట్టాలి.
– బొల్లిముంత సాంబశివరావు
రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు


