సాక్షి,హైదరాబాద్: కొత్త ఏడాది రాకతో తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ వాతావరణ నెలకొంది. ఇప్పటికే సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు పట్టణాలు వదిలి పల్లెలకు వెళ్లేందుకు సర్వం సిద్దం చేసుకున్నారు. పండుగకు కావాల్సిన కొత్తబట్టలు, బంగారం, ఇతర వస్తువుల్ని కొనుగోలు చేసుకున్నారు. ఈ క్రమంలో పలువురు సోషల్ మీడియా వేదికలపై తమ ఊరిలో సంక్రాంతి పండుగ సంబరాలపై షార్ట్స్,సెల్ఫీలతో పాటు ఇతర వివరాల్ని షేర్ చేస్తూ ఆనందాన్ని నెటిజన్లతో పంచుకుంటున్నారు. అయితే, అలా చేయొద్దని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పండక్కి ఊరెళ్తె మూడో కంటికి కనపడకూడదని సూచిస్తున్నారు.
సంక్రాంతి సందర్భంగా చాలా మంది ఊర్లకు వెళ్లే అవకాశం ఉండటంతో దొంగలు ఈ సమయాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ ముత్యం రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు. ప్రజలు ముందస్తుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ ఏర్పాట్ల గురించి ఆయన మాట్లాడారు.
సీసీ కెమెరాలు
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే పోలీసులు సీసీ కెమెరాలను అమర్చారు. వీటి సహాయంతో అనేక నేరాలను ఛేదించాం. ప్రజలు కూడా తమ కాలనీలు, ఇళ్లు, షాపింగ్ మాళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి.
ఇళ్ల భద్రతా చర్యలు
ఊర్లకు వెళ్లే వారు ఇంట్లో ఒక గదిలో లైటు వేసి ఉంచడం, తలుపులకు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేయడం, బీరువా తాళాలను ఇంట్లో ఉంచకుండా వెంట తీసుకెళ్లడం వంటి చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా, ఇంటి ముందు చెత్త, దినపత్రికలు, పాల ప్యాకెట్లు పేరుకుపోకుండా చూసుకోవాలని, లేకపోతే దొంగలు ఇంట్లో ఎవరూ లేరని గుర్తించే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.
వాహనాల భద్రత
విలువైన వస్తువులను స్కూటర్ డిక్కీల్లో లేదా కార్లలో ఉంచకూడదు. ద్విచక్ర వాహనాలు, కార్లను ఇంటి ఆవరణలోనే పార్క్ చేయాలని, బయట రోడ్లపై పార్క్ చేయకూడదు. వాహనాలకు హ్యాండిల్ లాక్‌తో పాటు వీల్ లాక్ కూడా వేయండి. ఇంట్లో బంగారు నగలు,నగదు ఉంటే వాటిని బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవడం మంచిది. ఎక్కువ రోజులు ఊర్లకు వెళ్లేవారు వాటిని వెంట తీసుకెళ్లాలి. ప్రయాణ సమయంలో బ్యాగుల్లో నగలు, డబ్బు పెట్టుకున్నప్పుడు వాటిని దగ్గరలో ఉంచుకోవాలి. బస్సులో పెట్టి కిందికి దిగితే దొంగలు అపహరించే అవకాశం ఉంది.
టెక్నాలజీ ఆధారిత భద్రత
ఇళ్లలో టైమర్‌తో కూడిన లైట్లు, మోషన్ సెన్సర్ లైట్లు అమర్చుకోండి. హోమ్ సెక్యూరిటీ సిస్టం ద్వారా మొబైల్ నుంచే ఇంటిని ప్రత్యక్షంగా గమనించే అవకాశం ఉంది. డీవీఆర్‌లను ఇంటి లోపల రహస్య ప్రదేశంలో అమర్చుకోవాలి. ప్రజలు తమ ప్రాంతాల్లో గస్తీ ఏర్పాటుకు సహకరించాలని, పోలీస్ స్టేషన్ నంబర్లు, బీట్ కానిస్టేబుల్ నంబర్లు దగ్గర ఉంచుకోవాలి. కాలనీల్లో కమిటీలు ఏర్పాటు చేసి వాచ్‌మెన్లను నియమించుకోవాలని, కొత్త వ్యక్తుల కదలికలను గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వాలి
సోషల్ మీడియాతో తస్మాత్ జాగ్రత్త
ప్రజలు సోషల్ మీడియాలో తమ ప్రయాణ వివరాలను షేర్ చేయకూడదు. దూర ప్రాంతాలకు వెళ్లేవారు తమ చిరునామా, ఫోన్ నంబర్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు తెలియజేయాలి. దీంతో వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేయగలం. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండి, పోలీసులతో సమన్వయం చేస్తే చోరీలను నియంత్రించడం సులభమని సైబరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలను గమనించి వెంటనే 100 డయల్, సైబరాబాద్ పోలీస్ వాట్సాప్ నంబర్ 9490617444 కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


