అమరుడా... అందెశ్రీ!
అందెశ్రీ సహజ కవి, ప్రజాకవి. కాళి దాసుది మేఘ సందేశం, అందెశ్రీది నది సందేశం. ‘నది నడిచి పోతున్నది, నావనై నను రమ్మన్నది’ అంటూ దేశ దేశాలను సందర్శించి ప్రపంచ నదులెన్నో చూసి పరవశించాడు. కవిత్వం కోసం ప్రపంచంలోని నదుల వెంట నడిచిన కవి ప్రపంచంలో అందెశ్రీ ఒక్కడే! అత్యంత పేదరికం నుండి ఆశు కవిగా, ప్రకృతి కవిగా పరిణతి చెందాడు.
అందెశ్రీది వాక్శుద్ధి గల కవిత్వం. ఆయన పలికింది సత్యమై కూర్చుంటుంది. అలనాటి పోతులూరి వీరబ్రహ్మం గురించి విన్నాము. పోతులూరి సమాజానికి తిరుగుబాటు నేర్పాడు. రాజులను మార్చాడో లేదో తెలియదు గానీ అందెశ్రీ ప్రభుత్వాలను మార్చుతాను అన్నాడు. ‘వాడెంత’ అన్నవాడిని కుర్చీ నుండి దించే దాక హృదయంలో అగ్నిగుండమై రగిలాడు. అదే ‘నిప్పుల వాగు’ పాటల, కవితల సంకలనం. అది ఆరేండ్ల కృషి. ఆనాడు అవమానించబడిన చాణక్యుడు నంద రాజ్యాన్ని కూల్చి మౌర్య చంద్రగుప్తునికి పట్టాభిషేకం చేసినట్లు... నేటి చాణక్యుడిగా నిలిచి, ‘ఇంటర్వ్యూ నువ్వు చెయ్యాలి. నేను జవాబులు చెప్పాలి’ అని భవిష్యత్ తెలిసిన అందెశ్రీ... రేవంత్‌రెడ్డిని ఇంటర్వ్యూ చేయమన్నాడు. ‘ఆ చదువు రానివాడు నాలుగు నుడుగులు నేర్వగానే ఇంత పొగరా!’ అని అనుకున్న వారు ఉన్నారు. అతడు అంద రినీ ప్రేమించాడు. అతడికి కులం లేదు, ధనం లేదు. అందెశ్రీలో ఎంత పొగరున్నదో, ఎంత విద్వత్తున్నదో అంత వినయ సంపన్నుడు. అది ఆయన గురువుగా గౌరవించే శ్రీరాం సర్‌కు తెలుసు. నాకు తెలుసు. ఆయన వాక్శుద్ధిని గమనించిన సంస్కృతపండితులూ, వయోవృద్ధులూ ఆయనకు తలలు వంచి నమస్కరించారు. అందెశ్రీని ఒక్క మాటలో చెప్పాలంటే... ఆధునిక ఋషి. 1995లో ‘ప్రవహించే పాట: ఆంధ్రప్రదేశ్ దళిత పాటలు’ అనే పాటల పుస్తకం కోసం... అన్ని ప్రాంతాలనుండి వందలాది కవుల పాటలను సేకరిస్తున్న కాలంలో అందెశ్రీ వెలువరించిన రెండు పాటల పుస్తకాలు అందించాడు. అవి అన్నీ ప్రకృతి, పల్లె జీవితం, మానవీయత గురించిన పాటలు.
1992లో ప్రారంభించిన ‘దరకమే’ ఐక్యవేదికలో చేరలేదు. పాట కవుల వేదిక, అలాగే ‘కథకుల వేదిక’ ప్రత్యేకంగా ఉండాలని అనుకున్న ప్రకారం... గూడ అంజయ్య పాట కవుల వేదికను ప్రారంభించాడు. అందెశ్రీ దానితో కలిసి కొన్ని పాటలు రాశాడు. ఆ పాట కవుల వేదికే ‘తెలంగాణ ధూం ధాం’కు బీజం వేసింది. కామారెడ్డి సభతో తన రూపం తీసుకుంది. పాట కవులు, కళాకారులు తప్ప ఎవరూ వేదికపై ఉండరాదనే నియమంతో ‘తెలంగాణ ధూం ధాం’ బయల్దేరింది. పాట కవుల వేదికను ‘తెలంగాణ ధూం ధాం’గా మలచడంలో అందెశ్రీది కీలక పాత్ర. మారోజు వీరన్న కృషి అంత ర్లీనంగా ఉండింది. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాను ‘తెలంగాణ ధూం ధాం’ నిర్మాత అందెశ్రీనే అని! ఈ విషయాన్ని ‘నడుస్తున్న చరిత్ర తెలంగాణ’ సిరీస్ 2వ పుస్తకంలోనే ఇరవై యేళ్ళ క్రితం నమోదు చేశాను. ‘రసమయి’ బాలకిషన్ కళాకారుడిగా తెలంగాణ ధూం ధాంకు ఐకా¯Œ గా నిలిస్తే దాని రూపురేఖలను తీర్చిదిద్ది సాహిత్యాన్ని అందించినది అందెశ్రీ. అంతడుపుల నాగరాజు కళాబంధం దాన్ని రసమయం చేసింది.
అందెశ్రీ బడిలో చదవలేకపోయాడు. లోకమే విశ్వవిద్యాలయంగా చదివినవాడు. అతడు పశువులను కాశాడు. సుతారి పని చేశాడు. నిజామాబాద్‌లో శృంగేరీ పీఠానికి చెందిన శంకర్ మహరాజ్ గురూజీ ఆయనకు జ్ఞానబోధ చేశాడు. బిరుదురాజు రామరాజు కన్నబిడ్డగా చూసుకున్నాడు. బాసర వాక్కులమ్మ స్ఫూర్తితో ఎది గాడు. తెలంగాణ రాష్ట్ర గీతం రాసిన కవిగా నిలిచాడు. వర్తమానంలో సాహిత్యం మీద బతికిన మహాకవి అందెశ్రీ. ఏ నిర్మాణంలో ఇమడలేనని చెప్పి స్వతంత్రుడుగా జీవించిన కవి.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతడి పాడె మోసి ముందుకు నడిచాడు. అమరుడైనాక కూడ ఆయన కోరుకున్నట్టు ‘పద్మ భూషణ్’, ‘పద్మవిభూషణ్’ తప్పక వరిస్తాయి. అమరుడా...అందెశ్రీ! నీకు జోహార్లు.
-బి.ఎస్. రాములు
తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ చైర్మన్


