
ఈక్విటీ, దీర్ఘకాలిక రుణాలపై దృష్టి
ఇవెకో కొనుగోలుకు తీసుకునే తాత్కాలిక రుణాల తీర్చివేతపై కసరత్తు
న్యూఢిల్లీ: ఇటలీ కంపెనీ ఇవెకో గ్రూప్ కొనుగోలు కోసం తీసుకుంటున్న స్వల్పకాలిక రుణాన్ని (బ్రిడ్జ్ ఫైనాన్సింగ్) తీర్చివేసేయడంపై టాటా మోటార్స్ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా సుమారు 1 బిలియన్ యూరోలను (సుమారు రూ. 10,000 కోట్లు) ఈక్విటీగా, మిగతా మొత్తాన్ని దీర్ఘకాలిక రుణాలుగా సమకూర్చుకునే యత్నాల్లో ఉన్నట్లు టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్‌వో పీబీ బాలాజీ తెలిపారు. ఇవెకో డీల్ ముగిసిన 12–18 నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి కావచ్చన్నారు. 3.8 బిలియన్ యూరోలతో (సుమారు రూ. 38,240 కోట్లు) వాణిజ్య వాహనాల కంపెనీ ఇవెకో గ్రూప్‌ను టాటా మోటార్స్ కొనుగోలు చేయనుంది. ఇందుకు మోర్గాన్ స్టాన్లీ, ఎంయూఎఫ్‌జీ తదితర సంస్థలు బ్రిడ్జ్ ఫైనాన్సింగ్ చేస్తున్నాయి.
నాలుగో స్థానానికి...: ఇన్వెస్టర్లతో సమావేశం సందర్భంగా వెల్లడించిన వివరాల ప్రకారం ఇవెకో కూడా కలిస్తే 6 టన్నుల ట్రక్కుల కేటగిరీలో టాటా మోటార్స్ గ్రూప్ మొత్తం అమ్మకాలు వార్షికంగా 2.3 లక్షల యూనిట్ల పైచిలుకు ఉంటుంది. తద్వారా దాదాపు వోల్వో గ్రూప్‌తో సమానంగా నాలుగో స్థానంలో ఉంటుంది. కొనుగోలుకు ముందు ఏటా 1.8 లక్షల యూనిట్లతో టాటా మోటార్స్ గ్రూప్ ఆరో స్థానంలో, 50,000 యూనిట్లతో ఇవెకో 17వ స్థానంలో ఉన్నాయి. తొలి మూడు స్థానాల్లో దైమ్లర్ గ్రూప్ (3.5 లక్షల యూనిట్లు), సీఎన్‌హెచ్‌టీసీ గ్రూప్ (2.5 లక్షలు), ట్రాటన్ గ్రూప్ (2.4 లక్షల యూనిట్లు) ఉన్నాయి. 2024 డిసెంబర్ నాటికి ఇవెకో సంస్థకు అంతర్జాతీయంగా 32,000 మంది ఉద్యోగులు ఉన్నారు.