ఇన్వెస్కో అసెట్ మేనేజ్‌మెంట్‌లో వాటా కొనుగోలు
అమల్లోకి జాయింట్ వెంచర్ ఏర్పాటు
హిందుజా గ్రూప్‌నకు చెందిన ఇండస్ ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ మ్యూచువల్ ఫండ్స్‌లోకీ అడుగుపెట్టింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ ప్రమోటర్ అయిన ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్, అమెరికాకు చెందిన ఇన్వెస్కో సంయుక్తంగా అసెట్ మేనేజ్‌మెంట్ జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసినట్టు ప్రకటించాయి. ఇన్వెస్కోకు చెందిన ఇన్వెస్కో అసెట్ మేనేజ్‌మెంట్ ఇండియాలో ఇండస్‌ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్‌ఎల్) 60 శాతం వాటా కొనుగోలు చేసింది. మిగిలిన 40 శాతం వాటాను ఇన్వెస్కో కలిగి ఉంటుంది.
2025 సెప్టెంబర్ చివరికి ఇన్వెస్కో అసెట్ మేనేజ్‌మెంట్ ఇండియా రూ.1,48,358 కోట్ల నిర్వహణ ఆస్తులతో (ఏయూఎం) 16వ అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ సంస్థగా ఉంది. ఇరు సంస్థలు తమదైన బలాబలాలతో అసెట్ మేనేజ్‌మెంట్ వ్యాపార వృద్ధికి కృషి చేయనున్నట్టు ప్రకటించాయి. ఇన్వెస్కోకు అంతర్జాతీయంగా పెట్టుబడుల నిర్వహణలో ఉన్న అపార అనుభవం, ఇండస్ ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌కు భారత్‌లో ఉన్న బ్యాంక్, బీమా సంస్థల పంపిణీ బలాలతో అసెట్ మేనేజ్‌మెంట్ వ్యాపారాన్ని మరింత మంది ఇన్వెస్టర్లకు చేరువ చేయగలమని ఇవి భావిస్తున్నాయి. సౌరభ్ నానావతి ఆధ్వర్యంలోని ప్రస్తుత మేనేజ్‌మెంట్ ఇక ముందూ కొనసాగుతుందని ఈ సంస్థలు ప్రకటించాయి.
ఆర్థిక సేవల దిగ్గజంగా అవతరిస్తాం..
అసెట్ మేనేజ్‌మెంట్‌ను కూడా చేర్చుకోవడం ద్వారా 2030 నాటికి ఆర్థిక సేవల దిగ్గజంగా అవతరించేందుకు వీలు కలుగుతుందని ఐఐహెచ్‌ఎల్ చైర్మన్ అశోక్ హిందుజా పేర్కొన్నారు. ‘‘భారత్‌లో ఆదాయాలు పెరుగుతున్నాయి. జనాభా పరమైన అనుకూలతలు ఉన్నాయి. అద్భుతమైన పెట్టుబడుల అవకాశాలు పలకరిస్తున్నాయి. కనుక ఇదొక చక్కని అనుకూల తరుణం’’అని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా?


