
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్‌కే ఆఫర్ ఇచ్చాడో భారతీయ యువకుడు. రాయిటర్స్ కథనం ప్రకారం.. పెర్‌ప్లెక్సిటీ ఏఐ (Perplexity AI) సీఈఓ, భారత సంతతికి చెందిన అరవింద్ శ్రీనివాస్ (Aravind Srinivas) గూగుల్ క్రోమ్ కొనుగోలు చేయడానికి 34.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3,02,152 కోట్లు) నగదు బిడ్ చేశారు. దాదాపు 17 ఏళ్ల చరిత్ర ఉన్న సంస్థకు కేవలం మూడేళ్ల ఏఐ స్టార్టప్ ఆఫర్ ఇవ్వడం విశేషం.
ఎన్విడియా, సాఫ్ట్ బ్యాంక్ సహా పలువురు ఇన్వెస్టర్ల నుంచి 1 బిలియన్ డాలర్లు సమీకరించిన పెర్‌ప్లెక్సిటీ ఏఐ కంపెనీ ప్రస్తుత మార్కెట్ విలువ 18 బిలియన్ డాలర్లుగా ( సుమారు రూ.1,57,800 కోట్లు) ఉంది. అంటే దాని విలువ కంటే దాదాపు రెట్టింపు ధరను గూగుల్ క్రోమ్ కొనుగోలుకు ఆఫర్ చేసింది. ఈ డీల్ కు పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చేందుకు పలు ఫండ్‌లు ముందుకొచ్చాయని చెబుతోన్న పెర్‌ప్లెక్సిటీ ఏఐ.. పేర్లను మాత్రం వెల్లడించలేదు.
ఆన్‌లైన్ సెర్చ్ మార్కెట్ గుత్తాధిపత్యాన్నిఆక్షేపిస్తూ కోర్టు తీర్పు నేపథ్యంలో గూగుల్‌పై ఇప్పటికే రెగ్యులేటరీ ఒత్తిడి కొనసాగుతోంది. ఈ క్రమంలో క్రోమ్‌ను వదులుకోవాలన్న ప్రతిపాదన కూడా ఉంది. అయితే కోర్టు తీర్పుపై అప్పీలుకు వెళతాం కానీ బ్రౌజర్ ను విక్రయించే ఉద్దేశం మాత్రం లేదని గూగుల్ తెలిపింది. ఈ పరిణామాలు జరుగుతుండగానే పెర్‌ప్లెక్సిటీ ఏఐ నుంచి కొనుగోలు ప్రతిపాదన రావడం గమనార్హం.
ఎవరీ అరవింద్ శ్రీనివాస్?
చెన్నైలో జన్మించిన అరవింద్ శ్రీనివాస్ ఐఐటీ మద్రాస్ గ్రాడ్యుయేట్. గతంలో గూగుల్‌లోనే పనిచేసిన శ్రీనివాస్ డెనిస్ యారాట్స్, జానీ హో, ఆండీ కొన్విన్స్కీలతో కలిసి 2022లో పెర్‌ప్లెక్సిటీ ఏఐ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ రియల్ టైమ్‌లో సమాధానాలను అందించే తన సంభాషణాత్మక ఏఐ సెర్చ్ ఇంజిన్‌తో శరవేగంగా అభివృద్ధి చెందింది. ఈ కంపెనీ ఇటీవల తన సొంత ఏఐ ఆధారిత బ్రౌజర్ కామెట్ ను కూడా ప్రారంభించింది. క్రోమ్ ను కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా మూడు బిలియన్లకు పైగా వినియోగదారులను చేరుకోవచ్చని యోచిస్తోంది.
👉 చదవండి: ఐఐటీ హైదరాబాద్‌లో అద్భుతం.. డ్రైవర్ లేని బస్సుల ఘనత