నింగిలో విమానాలు నేలమీదే లాభాలు | Domestic aviation industry estimated to post up to Rs 18000 crore loss in FY26 | Sakshi
Sakshi News home page

నింగిలో విమానాలు నేలమీదే లాభాలు

Dec 31 2025 4:39 AM | Updated on Dec 31 2025 7:06 AM

Domestic aviation industry estimated to post up to Rs 18000 crore loss in FY26

 ఏవియేషన్‌ నష్టాలు@ రూ. 18,000 కోట్లు 

ప్యాసింజర్ల రద్దీ తగ్గుదల, కరెన్సీ క్షీణత కారణం

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) దేశీ విమానయాన పరిశ్రమ నష్టాలు ముందస్తు అంచనాలకు మించి ఉండనున్నాయి. గతంలో ఇవి రూ. 9,500–10,500 కోట్లుగా ఉంటాయని పరిశ్రమ భావించినప్పటికీ, అంతకన్నా ఎక్కువగా రూ. 17,000–18,000 కోట్ల స్థాయిలో ఉండొచ్చని రేటింగ్స్‌ ఏజెన్సీ ఇక్రా ఒక నివేదికలో తెలిపింది. విమాన ప్రయాణికుల రద్దీ తగ్గుదలతో పాటు ఇతరత్రా అంశాలు ఇందుకు కారణమని పేర్కొంది. ఇక దేశీ విమానయాన ప్రయాణికుల ట్రాఫిక్‌ వృద్ధి గతంలో భావించినట్లుగా 4–6 శాతంగా కాకుండా 0–3 శాతం స్థాయికే పరిమితం కావొచ్చని అంచనాలను సవరించింది.

ఎయిరిండియా బోయింగ్‌ 787–8 విమాన దుర్ఘటన, వేల కొద్దీ ఇండిగో విమాన సేవల రద్దుతో విమాన ప్రయాణాలపై సెంటిమెంటు దెబ్బతినడం ఇందుకు కారణమని పేర్కొంది. సీమాంతర ఉద్రిక్తతలతో విమాన సేవల్లో అంతరాయాలు, పలు సర్వీసులు క్యాన్సిల్‌ కావడంలాంటి అంశాల వల్ల ఏప్రిల్‌–నవంబర్‌ మధ్య కాలంలో ప్యాసింజర్ల రద్దీ, ఊహించిన దాని కన్నా తక్కువగా నమోదైనట్లు ఇక్రా వివరించింది. 

మరిన్ని విశేషాలు.. 
డిసెంబర్‌ 3–8 మధ్య ఇండిగో కార్యకలాపాల్లో అంతరాయాల వల్ల సుమారు 4,500 ఫ్లయిట్లు రద్దయ్యాయి. ఇవి మొత్తం పరిశ్రమ వార్షిక డిపార్చర్లలో 0.4% అయినప్పటికీ, విమాన ప్రయాణాలపై ఈ ఉదంతంతో ప్రతికూల ప్రభావం పడింది. ఈ ఆర్థిక సంవత్సరం దేశీ విమానయాన సంస్థల ద్వారా అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ప్యాసింజర్ల వృద్ధి 7–9 శాతానికి పరిమితం కావచ్చు. గతంలో ఇది 13–15%గా ఉంటుందని అంచనా వేశారు. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికుల వృద్ధి నెమ్మదించడంతో పాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం వల్ల విదేశీ మారకంపరమైన నష్టాలు పెరగడంలాంటి అంశాల వల్ల దేశీ విమానయాన పరిశ్రమ మరింతగా నష్టపోనుంది.

2025 నవంబర్‌లో దేశీయంగా విమాన ప్రయాణికుల రద్దీ 1.54 కోట్లుగా ఉండొచ్చని అంచనా. ఇది 2024 నవంబర్‌లో నమోదైన 1.42 కోట్లతో పోలిస్తే 8.4%, ఈ ఏడాది అక్టోబర్‌లో రిజిస్టరయిన 1.40 కోట్లతో పోలిస్తే 10.1% అధికం.  2025 ఏప్రిల్‌–నవంబర్‌ మధ్య కాలంలో దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య వార్షికంగా 2.2 % పెరిగి 10.96 కోట్లకు చేరింది.  ఈ ఏడాది అక్టోబర్‌లో దేశీ ఎయిర్‌లైన్స్‌ ద్వారా అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన వారి సంఖ్య వార్షికంగా 8.3 % పెరిగి 29.9 లక్షలకు చేరింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement