ఇస్లామాబాద్:పాకిస్తాన్ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రైవేటీకరణలో విజయవంతంగా అమ్ముడుపోయింది. అరీఫ్ హబీబ్ గ్రూప్ ఈ సంస్థను 135 బిలియన్ రూపాయలకు కొనుగోలు చేసింది.
పాకిస్తాన్ ప్రభుత్వం మంగళవారం (డిసెంబర్ 23, 2025) జాతీయ విమానయాన సంస్థ పీఐఏను ప్రైవేటీకరించింది. ఈ ప్రక్రియలో మూడు సంస్థలు అరీఫ్ హబీబ్ గ్రూప్, లక్కీ సిమెంట్, ఎయిర్‌బ్లూ పోటీ పడ్డాయి. ప్రారంభ బిడ్డింగ్‌లో అరీఫ్ హబీబ్ రూ.115 బిలియన్, లక్కీ సిమెంట్ రూ.105.5 బిలియన్, ఎయిర్‌బ్లూ రూ.26.5 బిలియన్ ఆఫర్ చేశాయి. ప్రభుత్వ రిఫరెన్స్ ధర రూ.100 బిలియన్‌గా నిర్ణయించబడింది. చివరి దశలో ఓపెన్ ఆక్షన్‌లో అరీఫ్ హబీబ్ తన ఆఫర్‌ను పెంచుతూ 135 బిలియన్ రూపాయల వద్ద విజయం సాధించింది.
ఈ ఒప్పందం ద్వారా ప్రస్తుతం పీఐఏలోని 75శాతం షేర్లు అరీఫ్ హబీబ్ గ్రూప్‌కు బదిలీ అవుతాయి. మిగిలిన 25శాతం షేర్లను కొనుగోలు చేయడానికి 90 రోజుల గడువు ఇవ్వబడింది.
గత కొన్ని ఏళ్లేగా పీఐఏ భారీ నష్టాల్లో ఉంది. మిస్‌మేనేజ్మెంట్, ఆర్థిక సమస్యలు, సేవా ప్రమాణాల లోపం కారణంగా ఈ సంస్థను నిలబెట్టడం కష్టమైంది. ఒకప్పుడు ప్రతిష్టాత్మకంగా ఉన్న ఈ జాతీయ విమానయాన సంస్థను పునరుద్ధరించడమే ఈ ప్రైవేటీకరణ లక్ష్యంగా పాక్ ప్రభుత్వం ఈ అడుగు వేసింది.
అరీఫ్ హబీబ్ గ్రూప్ వచ్చే ఐదు సంవత్సరాల్లో రూ.80 బిలియన్ అదనపు పెట్టుబడి పెట్టాలని ప్రకటించింది. ఈ పెట్టుబడి ద్వారా విమానయాన సేవలను మెరుగుపరచడం, ఆధునీకరణ చేయడం, అంతర్జాతీయ పోటీకి తగిన విధంగా పీఐఏను నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది.
కాగా, పాకిస్తాన్ జాతీయ విమానయాన సంస్థ అమ్మకం దేశ ఆర్థిక సంస్కరణల్లో కీలక మలుపు. అరీఫ్ హబీబ్ గ్రూప్ ఆధ్వర్యంలో పీఐఏ మళ్లీ పుంజుకుంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్న.


