హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాబోయే దాదాపు రెండు దశాబ్దాల్లో 2044 నాటికి దక్షిణాసియాలోని ఎయిర్‌లైన్స్‌కి సుమారు 3,300 కొత్త విమానాలు అవసరం కానున్నాయి. ఇందులో భారత్ వాటా దాదాపు 90 శాతం ఉండనుంది. అమెరికన్ విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ తమ కమర్షియల్ మార్కెట్ ఔట్‌లుక్ (సీఎంవో)లో ఈ మేరకు అంచనాలు వేసింది. బుధవారమిక్కడ ఏవియేషన్ సదస్సు వింగ్స్ 2026 కార్యక్రమం సందర్భంగా బోయింగ్ ఎండీ (కమర్షియల్ మార్కెటింగ్,
యురేషియా, ఇండియన్ సబ్‌కాంటినెంట్) అశ్విన్ నాయుడు ఈ విషయాలు తెలిపారు.
3,300 విమానాల డిమాండ్‌కి సంబంధించి 2,875 చిన్న విమానాలు, 395 పెద్ద విమానాలు ఉండవచ్చని చెప్పారు. ప్రాంతీయంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత్‌లో విమానాల సంఖ్య వచ్చే 20 ఏళ్లలో నాలుగు రెట్లు పెరగనుందని నాయుడు తెలిపారు. ఇదే సమయంలో భారత్, దక్షిణాసియాలో ప్యాసింజర్ ఎయిర్ ట్రాఫిక్ సగటున 7 శాతం వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మధ్యతరగతి జనాభా, ఆర్థిక వృద్ధి, ఎయిర్‌పోర్టులు, కనెక్టివిటీ పెరుగుతుండటం ఇందుకు దోహదపడుతుందని
వివరించారు.
భారీగా సిబ్బంది ..
వచ్చే రెండు దశాబ్దాల్లో ప్రాంతీయంగా విమానయాన సంస్థలకు సుమారు 1,41,000 మంది సిబ్బంది అవసరమవుతారని నాయుడు తెలిపారు. ఇందులో 45,000 మంది పైలట్లు, 45,000 మంది టెక్నీషియన్లు, 51,000 మంది క్యాబిన్ సిబ్బంది ఉంటారని వివరించారు. దక్షిణాసియాలో మెయింటెనెన్స్, రిపేర్, డిజిటల్ సర్వీసులు, శిక్షణ మొదలైన ఏవియేషన్ సరీ్వసులపై 195 బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు కావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. హైటెక్ తయారీ రంగం, ఈకామర్స్ తదితర రంగాల దన్నుతో ఎయిర్ కార్గో మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందనుందని, ఈ నేపథ్యంలో కొత్తవి, కన్వర్ట్ చేసిన ఫ్రైటర్ల సంఖ్య ప్రస్తుత స్థాయి నుంచి అయిదు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు.


