
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీ-హెచ్) క్యాంపస్‌లో అద్భుత ఘనత నమోదైంది. క్యాంపస్ రోడ్లపై రోజువారీ సేవల కోసం అందుబాటులోకి తెచ్చిన ఏఐ ఆధారిత డ్రైవర్ రహిత బస్సులు రోజుల వ్యవధిలోనే 10,000 మందికి పైగా ప్రయాణీకులను తరలించాయి. ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ ఆన్ అటానమస్ నావిగేషన్ (టిహాన్) రూపొందించిన వాహనాలు పూర్తిగా ఎలక్ట్రిక్‌గా, మానవ డ్రైవర్ లేకుండా నడుస్తాయి.
ఆరు సీట్ల, పద్నాలుగు సీట్లుగా రెండు వేరియంట్ల వాహనాలు ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో సేవలు అందిస్తున్నాయి. కొత్తగా క్యాంపస్ రోడ్లపైకి వచ్చిన ఈ బస్సులు ఇప్పటికే 10,000 మందికి పైగా ప్రయాణీకులను తరలించాయి. ప్రయాణీకుల ఫీడ్ బ్యాక్ ఎక్కువగా సానుకూలంగా ఉందని, 90 శాతం సంతృప్తి రేటు ఉందని టిహాన్ నివేదించింది.
అన్ని విధాలా సిద్దంగా..
ఐఐటీ హైదరాబాద్ రూపొందించిన డ్రైవర్ రహిత బస్సులు కేవలం ప్రయోగాత్మకం కాదు. సాంకేతికపరంగా అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాయి. ఈ బస్సులలో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వ్యవస్థలను అమర్చారు. ఇవి వేగాన్ని సర్దుబాటు చేయడానికి, అడ్డంకులను గుర్తించడానికి, సురక్షిత దూరాలను నిర్వహించడానికి అనుమతిస్తాయి.
ఈ డ్రైవర్ రహిత బస్సుల ప్రాజెక్ట్ టెక్నాలజీ రెడీనెస్ లెవల్ 9కు చేరుకుంది. అంటే ఇది వాస్తవ-ప్రపంచ పరిస్థితులలో నిరూపించుకుంది. ఐఐటీ హైదరాబాద్‌కు ఈ ప్రాజెక్ట్ ఒక రవాణా పరిష్కారం మాత్రమే కాకుండా భారతదేశ మొబిలిటీ రంగంలో సరికొత్త ఆవిష్కరణ సాధ్యమని చూపించే ఒక ప్రదర్శన. దేశంలోనే తొలి అటానమస్ నావిగేషన్ టెస్ట్‌బెడ్‌ను కూడా టిహాన్ నిర్మించింది.
ఈ సదుపాయం భారతీయ డ్రైవింగ్ పరిస్థితులను ప్రతిబింబిస్తుంది. కంపెనీలు, పరిశోధకులు, ప్రభుత్వ సంస్థలు పబ్లిక్ రోడ్లపై ఉపయోగించే ముందు సెల్ఫ్ డ్రైవింగ్ వ్యవస్థలను పరీక్షించడానికి, ధృవీకరించడానికి వీలు కల్పిస్తుంది.