రిలయన్స్ ముసాయిదా మేనిఫెస్టో ఆవిష్కరణ
ఉద్యోగుల ఉత్పాదకత పది రెట్లు పెంపు లక్ష్యం
సమాజ శ్రేయస్సుపైనా దృష్టి
న్యూఢిల్లీ: ఆయిల్ నుంచి రిటైల్, టెలికం వరకు వివిధ రంగాల్లో విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ రాబోయే రోజుల్లో అధునాతన తయారీ సామర్థ్యాలతో ఏఐ ఆధారిత డీప్ టెక్ దిగ్గజంగా రూపాంతరం చెందాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆరు లక్షలకు పైగా ఉన్న ఉద్యోగుల ఉత్పాదకతను పది రెట్లు పెంచుకోవాలని, దేశ ఆర్థిక వ్యవస్థ, సమాజంపై పది రెట్లు సానుకూల ప్రభావం చూపేలా వ్యవహరించాలని నిర్దేశించుకుంది. ఈ లక్ష్య సాధనకు తోడ్పడేలా, కంపెనీ ఏఐ మేనిఫెస్టోను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ మంగళవారం ఆవిష్కరించారు.
‘మానవ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన సాంకేతిక పురోగతి’గా కృత్రిమ మేధను ఈ సందర్భంగా అభివర్ణించారు. దేశీయంగా డిజిటల్ పరివర్తనకు సారథ్యం వహించిన విధంగానే ఏఐ విప్లవానికి కూడా నేతృత్వం వహించాలని నిర్దేశించుకున్నట్లు చెప్పారు. భద్రత, విశ్వసనీయత, జవాబుదారీతనం హామీతో ప్రతి భారతీయునికి అతి తక్కువ వ్యయాలతో ఏఐని అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ‘అధునాతన తయారీ సామర్థ్యాలతో ఏఐ ఆధారిత డీప్ టెక్ కంపెనీగా మారే దిశగా రిలయన్స్ ముందుకు సాగుతోంది. రిలయన్స్ ఏఐ ముసాయిదా మేనిఫెస్టోను సిద్ధం చేసుకున్నాం. కార్యాచరణ ప్రణాళిక అమలుకు ఇది గైడ్‌గా పనిచేస్తుంది‘ అని అంబానీ పేర్కొన్నారు.
ఐడియాలకు ఆహ్వానం..
టెలికం, రిటైల్, ఎనర్జీ, మెటీరియల్స్, లైఫ్ సైన్సెస్, ఆర్థిక సేవలు, మీడియా తదితర వ్యాపార విభాగాలతో పాటు దాతృత్వ కార్యకలాపాలవ్యాప్తంగా ఏఐని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఉపయోగపడే ఐడియాలు ఇవ్వాలని ఉద్యోగులను అంబానీ కోరారు. జనవరి 10 నుంచి 26 వరకు కొత్త ఆలోచనలను తెలియజేయాలని సూచించారు. ఏఐ హార్డ్‌వేర్, రోబోటిక్స్‌లాంటి వాటితో సమర్ధత, సుస్థిరత, సాంకేతిక స్వావలంబనను సాధించేందుకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
మేనిఫెస్టో ఇలా..
మేనిఫెస్టో మొదటి భాగంలో అంతర్గత పరివర్తన, ఏఐని టెక్నాలజీ ప్రాజెక్టుగా కాకుండా కొత్త పని విధానంగా పరిగణించే అంశాలను చేర్చారు. రెండో భాగంలో దేశీయంగా ఏఐ పరివర్తనకు తోడ్పడే విజన్‌ని పొందుపర్చారు. కొనుగోళ్ల నుంచి చెల్లింపుల వరకు, నియామకాల నుంచి రిటైర్మెంట్ల వరకు, ప్లాంటు నుంచి పోర్టు వరకు కీలకమైన విధుల్లో మానవ ప్రమేయాన్ని తగ్గించే విధంగా, నిర్ణయాల ప్రక్రియకు తోడ్పడేలా సంస్థవ్యాప్తంగా ఏఐతో పని విధానాల్లో మార్పులను తొలి భాగంలో ప్రస్తావించారు.
డేటా, సమన్వయం, భద్రత, వివిధ వ్యాపారాలవ్యాప్తంగా పర్యవేక్షణ మొదలైన వాటన్నింటికీ ప్రమాణాలు నిర్దేశించేలా పన్నెండు అంచెల డిజిటల్ ఫంక్షనల్ కోర్ (డీఎఫ్‌సీ) ఉంటుంది. తమ వ్యాపారాలు, దాతృత్వ కార్యకలాపాల ద్వారా ఏఐ ఆధారిత భారతదేశ పరివర్తనకి తోడ్పడాలనే రిలయన్స్ ఆకాంక్షలను ప్రతిఫలించేలా రెండో భాగం ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ, విద్య, సమ్మిళిత ఆర్థిక సర్వీసులు మొదలైన వాటిల్లో ఏఐ దన్నుతో కొత్త సొల్యూషన్స్, కొత్త మెటీరియల్స్‌ను కనుగొనేందుకు అపార అవకాశాలు ఉన్నాయని అంబానీ చెప్పారు.


