
ఆఫీసులో బాగా పనిచేయడం ఒక్కటే సరిపోదు.. దాన్ని ఉన్నత ఉద్యోగుల వద్ద చూపించుకోగలిగితేనే ప్రమోషన్లు వస్తాయని, ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఓ ఉద్యోగి తెలిపారు. ఈ విధానం వల్లే తనకు ప్రమోషన్ వచ్చినట్లు చెప్పారు. తాను చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. రోహిత్ యాదవ్ అనే ఈ ఉద్యోగి తన ప్రమోషన్‌కు దోహదపడిన నాలుగు ప్రత్యేకమైన అంశాలను తెలిపారు.
యాదవ్ తన కెరీర్‌లో ఎదిగేందుకు మొదటగా బాగా పని చేసినప్పటికీ, తన పనిని ఇతరులకు కనిపించేలా చేయడం ప్రారంభించినప్పటి నుంచే ఉద్యోగం పరంగా వృద్ధి సాధించినట్లు చెప్పారు.
వీక్లీ విన్స్(వారంలో సాధించిన విజయాలు)
ప్రతి శుక్రవారం యాదవ్ పని పరిమాణంతో సంబంధం లేకుండా తాను సాధించిన మూడు పని సంబంధిత విజయాలను డాక్యుమెంట్ చేసేవాడు. ఇది పనిపై స్పష్టతను పొందడానికి, సమీక్షల సమయంలో తన పని గురించి చర్చించడానికి సహాయపడినట్లు చెప్పారు.
మంత్లీ మేనేజర్ అప్‌డేట్స్
ప్రతి నెలా తన మేనేజర్‌కు కీలక ఫలితాలు, తాను నేర్చుకున్న పాఠాలను క్లుప్తంగా సందేశం పంపేవారు. ఈ అప్‌డేట్స్ తన పని ఫలితాలకు సంబంధించినవి మాత్రమే ఉండేవి. పని పరంగా గొప్పలు చెప్పుకోకుండా తనను తాను ఎలా తీర్చిదిద్దుకుంటున్నాడో పేర్కొన్నారు.
సరైన ప్రశ్న అడగడం
వన్-ఆన్-వన్ సమావేశాల్లో ఆయన అడిగే ప్రధాన ప్రశ్న.. ‘తదుపరి స్థాయికి సిద్ధంగా ఉండటానికి నేను ఏమి మెరుగుపరుచుకోవాలి?’. ఈ ప్రశ్న నిర్మాణాత్మక అభిప్రాయానికి మార్గం వేసింది. మేనేజర్ తనను చూసే విధానాన్ని మార్చిందని యాదవ్ వివరించారు.
సమావేశాలలో మాట్లాడటం
ప్రతి మీటింగ్‌లోనూ తన అభిప్రాయాలు చెప్పేవాడని తెలిపారు. సమావేశాల్లో నిశ్శబ్దంగా ఉండే వారిని అధికారులు విస్మరించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
ఈ పోస్ట్‌పై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. యాదవ్ వ్యూహాత్మక కెరీర్ విధానాన్ని చాలా మంది లింక్డ్ఇన్ వినియోగదారులు ప్రశంసించారు. ‘నేను కార్పొరేట్ వాతావరణానికి కొత్త. ఈ చిట్కాలకు చాలా ధన్యవాదాలు. రేపటి నుంచి ప్రారంభిస్తాను’ అని ఒక కొత్త ఉద్యోగి స్పందించారు. ‘నేను మీరు చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్లను ప్రయత్నించాను. కానీ మీలా జరగలేదు. చెప్పేది కనీసం వినే సహాయక మేనేజర్ అవసరమని నమ్ముతున్నాను’ అని మరో వ్యక్తి రాశారు. మరొకరు ‘పక్షపాతం పనిచేసే చోట ఇది పని చేయదు’ అని చెప్పారు.
ఇదీ చదవండి: చైనాకు యూఎస్ వార్నింగ్.. భయమంతా అదే..