దేశ రాజధాని న్యూఢిల్లీలో 100 శాతం ఇథనాల్‌తో నడిచే పర్యావరణ అనుకూల ఫ్లెక్స్ ఫ్యూయల్ కారును ప్రదర్శిస్తూ కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రకటన చేశారు. ఈ సాంకేతికత భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన కాలుష్యం తగ్గింపు, రైతుల ఆదాయం పెంపు, ఇంధన దిగుమతుల కోత.. వంటి సమస్యలకు ఒకేసారి పరిష్కారాన్ని అందిస్తుందని చెప్పారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన కేంద్ర మంత్రి ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాల ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. ‘ఈ కారు పూర్తిగా 100 శాతం ఇథనాల్‌పై నడుస్తుంది. ఇది పెట్రోల్ కంటే ఆర్థికంగా చాలా భరోసానిస్తుంది. ఇథనాల్ లీటరు ధర సుమారు రూ.65 ఉండగా, పెట్రోల్ ధర రూ.110గా వద్ద ఉంది’ అని తెలిపారు. తాను ప్రదర్శించిన కారు 60 శాతం విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తుందని, తద్వారా వాస్తవ ఇంధన ఖర్చు లీటరుకు కేవలం రూ.25 మాత్రమే అవుతుందని చెప్పారు. ‘ఇది సరసమైనదైతేనే ప్రజలు ఇథనాల్‌ను కొనుగోలు చేస్తారు’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
రైతులకు లాభం, దేశానికి స్వయం సమృద్ధి
వ్యవసాయ ఉప ఉత్పత్తుల నుంచి ఇథనాల్ ఉత్పత్తి అవుతుందని మంత్రి గుర్తు చేశారు. దీనివల్ల రైతులకు నేరుగా లాభం చేకూరుతుందని అన్నారు. ‘విరిగిన బియ్యం, మొక్కజొన్న, చెరకు రసం, గడ్డి.. ఇలాంటి వ్యవసాయ వ్యర్థాలతో ఇథనాల్ ఉత్పత్తి జరుగుతుంది. ఇది పూర్తిగా గ్రీన్ ఎనర్జీ, జీరో పొల్యూషన్’ అని గడ్కరీ పేర్కొన్నారు. శిలాజ ఇంధనాల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించడం వల్ల ఆర్థికంగా లాభం కలుగుతుందని ‘వాహనాల్లో ఇథనాల్ వాడితే మన రైతులే లాభపడతారు. శిలాజ ఇంధనాల దిగుమతి ఖర్చు తగ్గుతుంది. కాలుష్యం నియంత్రణలోకి వస్తుంది. గ్రామీణ ఉపాధి పెరుగుతుంది’ అని హామీ ఇచ్చారు.
🚨 "Government-backed studies show no significant performance issues or component damage from using 20% ethanol-blended petrol"
- Minister Nitin Gadkari. pic.twitter.com/kZdnmGC5Zl— Indian Tech & Infra (@IndianTechGuide) December 5, 2025
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 శాతం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. దేశంలో దాదాపు 550 ఇథనాల్ డిస్టిలరీలు పనిచేస్తున్నాయని, ఇండియన్ ఆయిల్ ఒక్కటే సుమారు 400 ఇథనాల్ పంపులను నిర్వహిస్తోందని ఆయన వెల్లడించారు.


