రష్యాకు చెందిన ప్రధాన చమురు ఉత్పత్తిదారులపై ఆంక్షలు అమలులోకి రానుండటంతో భారతదేశం చమురు దిగుమతులను పెంచుకోవడానికి మిడిల్‌ఈస్ట్ దేశాలపై మొగ్గు చూపుతోంది. దాంతో మధ్యప్రాచ్యం(మిడిల్‌ఈస్ట్) నుంచి భారత్‌కు సరుకులు తీసుకురావడానికి చమురు ట్యాంకర్ల(క్రూడాయిల్ సరఫరా చేసే షిప్‌లు) బుకింగ్స్ గణనీయంగా పెరిగాయి.
పెరిగిన డిమాండ్
షిప్ బ్రోకర్ నివేదికల ప్రకారం ఈ వారం ఇప్పటివరకు సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల నుంచి ముడి చమురును రవాణా చేయడానికి సుమారు డజను ట్యాంకర్లను అద్దెకు తీసుకున్నారు. ఈ ట్యాంకర్లు అరేబియా సముద్రం మీదుగా రవాణా కానున్నాయి. ఇది గత నెలలో ఇదే నమోదైన కేవలం నాలుగు బుకింగ్‌లతో పోలిస్తే పెరిగింది.
ఈ బుకింగ్‌ల్లో వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్స్ (వీఎల్‌సీసీ) అని పిలువబడే సూపర్ ట్యాంకర్లతో పాటు చిన్న సూయజ్‌మ్యాక్స్ నౌకలు కూడా ఉన్నాయి. భారతీయ దిగుమతిదారులు ఇంకా అదే మార్గాల్లో మరిన్ని ట్యాంకర్లను అద్దెకు తీసుకోవాలని చూస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.
నవంబర్ 21 నుంచి ఆంక్షలు
నవంబర్ 21న రోస్‌నెఫ్ట్ పీజేఎస్సీ(Rosneft PJSC), లుకోయిల్ పీజేఎస్సీ(Lukoil PJSC)పై ఆంక్షలు అమలులోకి రానున్న నేపథ్యంలో భారత చమురు వ్యాపారులు రష్యాయేతర ముడి చమురు కొనుగోళ్లవైపు మళ్లుతున్నారు. భారతదేశంలోని రిఫైనరీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌తో సహా ఐదు ప్రధాన రిఫైనరీలు ఈ వారం తర్వాత రష్యన్ ముడి చమురు డెలివరీ చేసుకోబోమని ఇప్పటికే ప్రకటించాయి. మిగిలిన కంపెనీలు మాత్రం ఆంక్షలు లేని రష్యా చమురు విక్రేతల నుంచి కొనుగోళ్లు కొనసాగించవచ్చని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: డ్రైవర్ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!


