సత్యసాయి శత జయంతి వేడుకల సదస్సులో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ప్రశాంతి నిలయం: సాంకేతిక విజ్ఞానం ద్వారా నూతన ఆవిష్కరణలతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయం సాయికుల్వంత్ సభా మందిరంలో గురువారం సత్యసాయి శతజయంతి వేడుకలలో భాగంగా సత్యసాయి సేవాసంస్థల 11వ జాతీయ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజౖరెన గడ్కరీ మాట్లాడుతూ.. సత్యసాయి బాబా ఆధ్యాత్మిక బోధనలు, సేవా కార్యక్రమాలతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చారన్నారు. తాను ఇక్కడి భక్తిభావనను, విలువలను, సేవా భావాన్ని చూసి ప్రేరణ పొంది తదుపరి జీవితంలో మరింత మంచి చేయాలనే తపనతోనే వచ్చానని చెప్పారు.
ప్రతి మనిషిలో సత్ప్రవర్తన, మంచి సాంగత్యం, ఉన్నత విద్యాగుణం ఉత్తముడిలా తీర్చిదిద్దుతాయన్నారు. ఎదుటి వ్యక్తి అవసరాలను గుర్తించి చేతనైన సాయం చేసే గుణాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. సత్యసాయిని స్ఫూర్తిగా తీసుకుని ఆయన ఆశయాలను ముందుకు నడిపే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం సత్యసాయి సేవా సంస్థల కార్యక్రమాల వివరాలతో కూడిన పుస్తకాన్ని సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు విడుదల చేశారు. అంతకుముందు గడ్కరీ సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.


