
ప్రపంచ వాణిజ్య వేదికపై అమెరికా (US), చైనాల మధ్య టారిఫ్‌లు, వాణిజ్యపరమైన ఆంక్షల రూపంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అరుదైన లోహ అయస్కాంతాల సరఫరాను అడ్డుకోవద్దని అమెరికా చైనాకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అమెరికా విధించిన టారిఫ్‌లకు ప్రతిచర్యగా ఈ కీలక లోహాల ఎగుమతులను నియంత్రించాలని చైనా చూస్తోంది. ఈ అరుదైన లోహాల ఉత్పత్తి, శుద్ధి ప్రక్రియలో చైనా ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్యం చెలాయిస్తోంది.
ప్రపంచంలోని అరుదైన ఖనిజాల తవ్వకంలో దాదాపు 70%, వాటి శుద్ధిలో 90% వరకు చైనా నియంత్రిస్తోంది. ఈ ఏకఛత్రాధిపత్యం కారణంగా ఈ లోహాలపై ఎగుమతి నియంత్రణలను విధిస్తే అమెరికాపై చైనా గణనీయమైన ప్రభావాన్ని చూపగలదు. ఈ నేపథ్యంలో చైనా తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి, టారిఫ్‌లను తగ్గించుకోవడానికి ఈ లోహాల నియంత్రణను ఒక ‘ట్రంప్ కార్డ్’గా ఉపయోగించుకోవాలని చూస్తోంది.
అరుదైన లోహ అయస్కాంతాల ఉపయోగాలు
అరుదైన లోహ అయస్కాంతాల్లో ముఖ్యంగా నియోడైమియం (Neodymium), ప్రెసోడైమియం (Praseodymium), డిస్ప్రోసియం (Dysprosium) వంటి మిశ్రమాలతో తయారైన శాశ్వత అయస్కాంతాలు (Permanent Magnets) కీలకంగా ఉన్నాయి. ఇవి ఆధునిక సాంకేతికతకు, డిఫెన్స్ రంగానికి వెన్నెముకగా ఉన్నాయి. ఇవి చాలా చిన్నవిగా, తేలికగా ఉండి శక్తివంతమైన అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తాయి. వీటిని ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు.
రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ఎలక్ట్రిక్ వాహనాల మోటార్లలో, పవన విద్యుత్ టర్బైన్‌ల జనరేటర్లలో కీలకం. ఇవి అధిక సామర్థ్యంతో శక్తి మార్పిడిని సాధ్యం చేస్తాయి.
కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు, స్పీకర్లు, హెడ్‌ఫోన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో ఇవి తప్పనిసరి.
అధునాతన ఆయుధ వ్యవస్థలైన ఫైటర్ జెట్‌లు, క్షిపణులు, ఇతర స్మార్ట్ బాంబులు వంటి వాటిలో ఉపయోగించే మోటార్లు, సెన్సార్లకు ఈ అయస్కాంతాలు ఎంతో అవసరం. ఈ కారణం వల్లనే ఈ లోహాలను వ్యూహాత్మకంగా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు.
ఎంఆర్‌ఐ యంత్రాలు (మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్), పేస్‌మేకర్లు, హియరింగ్ ఎక్విప్‌మెంట్లు వంటి వైద్య పరికరాల్లో వీటిని ఉపయోగిస్తారు.
పవర్ టూల్స్, రోబోటిక్స్, హై-పెర్ఫార్మెన్స్ ఏసీ సర్వో మోటార్లతో సహా అనేక పారిశ్రామిక అనువర్తనాలలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి.
అరుదైన అయస్కాంత లోహాల వివాదం కేవలం వాణిజ్య పరమైన సమస్య కాకుండా ప్రపంచ భద్రత, సాంకేతిక ఆధిపత్యం, గ్రీన్ ఎనర్జీ భవిష్యత్తుకు సంబంధించిన అంశం. ఈ లోహాలపై చైనాకున్న పట్టు దాన్ని ఒక శక్తివంతమైన భౌగోళిక రాజకీయ ఆయుధంగా మారుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా, ఇతర దేశాలు చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి తమ సొంత అరుదైన లోహాల సరఫరా గొలుసులను బలోపేతం చేసుకోవాలి.
ఇదీ చదవండి: ఆస్తులు పంచితే బజారున పడాల్సిందే..