ఎకానమీకి వడ్డీ రేట్ల తగ్గింపు జోష్‌ | RBI Cuts Repo Rate by 25 bps to 5. 25 Percent | Sakshi
Sakshi News home page

ఎకానమీకి వడ్డీ రేట్ల తగ్గింపు జోష్‌

Dec 6 2025 12:05 AM | Updated on Dec 6 2025 12:05 AM

RBI Cuts Repo Rate by 25 bps to 5. 25 Percent

కీలక రేటులో 0.25 శాతం కోత 

5.25 శాతానికి దిగివచ్చిన రెపో 

రూ. లక్ష కోటలిక్విడిటీ దన్ను 

ఆర్‌బీఐ తాజా పాలసీ సమీక్షలో నిర్ణయాలు

అంచనాలను మించిన ఆర్థిక పురోగతికి దన్నుగా రిజర్వ్‌ బ్యాంక్‌ తాజాగా వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను తగ్గించింది. ఆరు నెలల తదుపరి పావు శాతం కోత పెట్టడంతో రెపో రేటు 5.25 శాతానికి దిగివచ్చింది. యూఎస్‌ టారిఫ్‌ల సవాళ్ల నేపథ్యంలో ఎకానమీకి జోష్‌నిస్తూ బ్యాంకింగ్‌ వ్యవస్థలో రూ. లక్ష కోట్ల లిక్విడిటీకి సైతం తెరతీసింది. వివరాలు చూద్దాం..

ముంబై: ఆర్‌బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా అధ్యక్షతన మూడు రోజులపాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్ల తగ్గింపునకు ఏకగ్రీవంగా మొగ్గు చూపింది. ఫలితంగా రెపో రేటులో 0.25 శాతం కోత పడింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో తాజాగా 5.25 శాతానికి క్షీణించింది. ఫలితంగా గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు మరింత దిగివచ్చేందుకు దారి ఏర్పడింది. అంతేకాకుండా ఇటీవల కొద్ది నెలలుగా యూఎస్‌ వాణిజ్య టారిఫ్‌లతో సవాళ్లు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థకు దన్నునిస్తూ బ్యాంకింగ్‌ వ్యవస్థలో రూ. లక్ష కోట్ల లిక్విడిటీకి సైతం ఎంపీసీ వెసులుబాటు కల్పించింది. తాజా పరపతి సమీక్షలో తటస్థ విధానాలు అవలంబించడం ద్వారా భవిష్యత్‌లోనూ రేట్ల కోతకు వీలున్నట్లు సంకేతాలిచి్చంది. ఈ ఏడాది ఇప్పటివరకూ ఆర్‌బీఐ నాలుగుసార్లు కోత విధించడం ద్వారా రెపో రేటును 5.25 శాతానికి చేర్చింది. అంటే 2025 ఫిబ్రవరి నుంచి 1.25 శాతంమేర దిగివచి్చంది.  

ప్రభుత్వ ప్రోత్సాహానికితోడుగా.. 
ఇప్పటికే యూఎస్‌ టారిఫ్‌లతో దేశీ ఎగుమతులు నీరసించగా.. వాణిజ్య లోటు పెరిగింది. మరోపక్క డాలరుతో మారకంలో రూపాయి సరికొత్త కనిష్టానికి పడిపోయింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థకు ఎదురవుతున్న సవాళ్లకు చెక్‌ పెట్టే బాటలో మరింత లిక్విడిటీ ద్వారా రుణాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఆర్‌బీఐ సంకల్పించింది. తద్వారా సమర్థవంత ఆర్థిక పురోగతికి అండగా నిలిచే నిర్ణయాలను ప్రకటించింది. ఇప్పటికే మరోవైపు కేంద్ర ప్రభుత్వం సైతం జీఎస్‌టీ రేట్లలో సంస్కరణలు, కారి్మక చట్టాలు, ఫైనాన్షియల్‌ రంగ నిబంధనల సరళీకరణ ద్వారా జీడీపీకి జోష్‌నిచ్చే చర్యలను చేపట్టింది. వెరసి ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలకు ఆర్‌బీఐ నిర్ణయాలు జత కలవనున్నాయి.  

రూ. లక్ష కోట్లు ఇలా 
ఓపెన్‌ మార్కెట్లో ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయడం ద్వారా దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి రూ. లక్ష కోట్లను విడుదల చేయనున్నట్లు ఆర్‌బీఐ తాజా పాలసీలో పేర్కొంది. రెండు దశలలో అంటే ఈ నెల 11న రూ. 50,000 కోట్లు, 18న మరో రూ. 50,000 కోట్లు విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. ఇందుకు దన్నుగా ఈ నెల 16కల్లా 5 బిలియన్‌ డాలర్ల విలువైన మూడేళ్ల డాలర్‌–రూపీ కొనుగోళ్లు–అమ్మకాల స్వాప్‌ను చేపట్టనుంది. సీజనల్‌గా బ్యాంకింగ్‌ వ్యవస్థ ఎదుర్కొంటున్న లిక్విడటీ సమస్యలకు ఈ చర్యలు పరిష్కారం చూపనున్నట్లు ఆర్‌బీఐ తెలియజేసింది. 

రూపాయిపై కల్పించుకోం..
ఫారెక్స్‌ మార్కెట్లో రూపాయి కదలికలపై ఎలాంటి ధరల శ్రేణినీ లక్ష్యంగా పెట్టబోమని మల్హోత్రా తెలియజేశారు. దేశీ కరెన్సీ దిద్దుబాటును అడ్డుకోబోమని స్పష్టం చేశారు. రూపాయికి సరైనస్థాయిని మార్కెట్టే నిర్ణయిస్తుందని తెలియజేశారు. డాలరుతో మారకంలో రూపాయి 90కు పతనమైన నేపథ్యంలో ఆర్‌బీఐ గవర్నర్‌ ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

బ్యాలన్స్‌చేస్తూ 
ఓవైపు దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ట వృద్ధిని సాధిస్తోంది. మరోపక్క అక్టోబర్‌ నుంచి ద్రవ్యోల్బణం భారీగా క్షీణిస్తోంది. దీంతో లక్ష్యానికంటే దిగువకు ధరలు జారుతున్నాయి. వెరసి వృద్ధి– ధరల సమతౌల్యానికి చర్యలు తీసుకుంటున్నాం. వృద్ధి పరిస్థితులను కొనసాగించేందుకు వీలుగా పాలసీ నిర్ణ యాలతో మద్దతిస్తున్నాం. బయటినుంచి సవాళ్లు ఎదు రవుతున్న నేపథ్యంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తావించదగ్గస్థాయిలో నిలకడను చూపుతూ వృద్ధి పథంలో ప్రయాణిస్తోంది. ధరలు వెనకడుగు వేయడంతో వృద్ధికి వీలైన చర్యలు తీసుకునేందుకు వీలు చిక్కుతోంది.         – సంజయ్‌ మల్హోత్రా ఆర్‌బీఐ గవర్నర్‌

ఈఎంఐలు తగ్గనున్నాయ్‌
ఈ ఏడాది ఇప్పటివరకూ ఆర్‌బీఐ నాలుగుసార్లు కీలక వడ్డీ రేటును తగ్గించింది. దీంతో రెపో రేటు 1.25 శాతంమేర దిగివచి్చంది. ఇప్పటికే 1 శాతంవరకూ రెపో తగ్గడంతో ప్రధానంగా గృహ రుణ వినియోగదారులకు భారీగా కలసిరానుంది. ప్రామాణిక రుణ వడ్డీ రేటు(ఈబీఎల్‌ఆర్‌) ఆధారిత గృహ రుణాలపై ఈఎంఐ మొత్తం తగ్గనుంది. ఇప్పటికే గృహ రుణ రేట్లు సుమారుగా 9 శాతం నుంచి 7.5 శాతంవరకూ దిగివచ్చాయి. ఇదేస్థాయిలో రేట్లు కొనసాగితే ఉదాహరణకు రూ. 50 లక్షల రుణంపై రూ. 9 లక్షలవరకూ ఆదాకానున్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు అంచనా వేశాయి. 20 ఏళ్లకాలానికి 8.5 శాతం వడ్డీ రేటులో రూ. 50 లక్షల గృహ రుణం తీసుకుంటే  నెలకు రూ. 43,400 చొప్పున ఈఎంఐ చెల్లించవలసి ఉంటుందని పేర్కొన్నాయి. అయితే తాజా తగ్గింపు పూర్తిగా వర్తిస్తే అంటే 7.25 శాతానికి రుణ రేటులో కోతపడితే ఈఎంఐ చెల్లింపులో దాదాపు మరో రూ. 4,000 తగ్గే వీలుంది. ఇలాకాకుండా రూ. 43,400 చొప్పున చెల్లింపులు కొనసాగిస్తే.. 3 ఏళ్లకుపైగా వాయిదాల మొత్తం తగ్గవచ్చని అభిప్రాయపడ్డాయి.

కార్పొరేట్లు సైతం ఖుషీ
రెపో రేటు దిగిరావడంతో వ్యక్తిగత రుణాలతోపాటు.. కార్పొరేట్‌ రంగానికీ లబ్ధి చేకూరనుంది. ఆర్‌బీఐ నుంచి తీసుకునే రుణాలపై వాణిజ్య బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటు రెపో. వెరసి రెపో తగ్గడంతో బ్యాంకులు ఆమేర తమ కస్టమర్లకు వడ్డీ రేట్ల తగ్గింపును బదిలీ చేయవలసి ఉంటుంది. ఇది ఎంసీఎల్‌ఆర్, బేస్‌ రేటు తదితరాల ఆధారంగా తీసుకునే వ్యక్తిగత, వాహన, గృహ, బిజినెస్‌ రుణాలన్నిటికీ వర్తించనుంది. వెరసి రుణాలు మరింత చౌకకానున్నాయి. ఇది రుణాలకు డిమాండ్‌ను పెంచడంతో వినియోగం ఊపందుకునే వీలుంది. ఇది ఇండ్రస్టియల్, ఆటో, క్యాపిటల్‌ గూడ్స్, రియల్టీ రంగాల అమ్మకాలలో వృద్ధికి దారి చూపుతుందని, ఫలితంగా ఉపాధి కల్పన సైతం మెరుగుపడే వీలున్నదని ఆర్థికవేత్తలు వివరించారు.  

ఆటో రంగ జోరు 
వడ్డీ రేటు కోత ఇటీవల ఆటో రంగ వృద్ధికి మరింత ఊతమివ్వనుంది. జీఎస్‌టీ సంస్కరణలతో వడ్డీ రేట్ల తగ్గింపు జత కలవడం ఇందుకు తోడ్పాటునిస్తుంది. అందుబాటులో రుణాలతో వినియోగం బలపడుతుంది.  – శైలేష్‌ చంద్ర, ఆటో పరిశ్రమల అసోసియేషన్‌(సియామ్‌) ప్రెసిడెంట్‌ 

కొత్తవాళ్లకు పుష్‌ 
గృహ రుణాలపై తగ్గనున్న వడ్డీ రేట్లు మరింతమంది ప్రజలు సొంత ఇళ్లవైపు ఆలోచించేందుకు ప్రోత్సాహాన్నిస్తాయి. ఇంతవరకూ నిర్ణయం తీసుకోని వ్యక్తులు, కుటుంబాలు గృహ కొనుగోలుకి ముందడుగు వేసే వీలుంది. – రియల్టీ రంగ సమాఖ్యలు క్రెడాయ్, ఎన్‌ఏఆర్‌ఈడీసీవో(నరెడ్కో)

లక్ష్యాలివీ 
ఈ ఏడాదికి ద్రవ్యోల్బణ లక్ష్యాన్ని ఆర్‌బీఐ తాజాగా 2.6% నుంచి 2 శాతానికి కుదించింది. మరోపక్క జీడీపీ వృద్ధిపై గత అంచనా 6.8 శాతాన్ని 7.3 శాతానికి మెరుగుపరచింది.  

అరుదుగా 
ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి అర్ధభాగంలో ద్రవ్యోల్బణం 2.2 శాతానికి పరిమితంకావడం.. దేశ జీడీపీ 8 శాతం పుంజుకోవడం ఆర్థిక వ్యవస్థ పటిష్టతను సూచిస్తున్నట్లు మల్హోత్రా పేర్కొన్నారు. ఇలా అరుదుగా జరుగుతుందని తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement