5న నిర్ణయాలు వెల్లడి
రెపో రేటు కోతపై మిశ్రమ అంచనాలు
ముంబై: ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమీక్షా సమావేశం బుధవారం ప్రారంభమైంది. రెపో రేటును పావు శాతం తగ్గించొచ్చన్న అంచనాల మధ్య కొనసాగుతున్న ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం కనిష్టాలకు చేరి, జీడీపీ వృద్ధి బలపడడం, రూపా యి మారకం విలువ ఆల్‌టైమ్ కనిష్టాలకు పతనమైన సమయంలో జరుగుతున్న ఎంపీసీ భేటీ.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందోనన్న ఆసక్తి నెలకొంది. కొందరు విశ్లేషకులు పావు శాతం రేటు కోతను అంచనా వేస్తుంటే, యథాతథ స్థితినే కొనసాగించొచ్చని మరికొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆర్‌బీఐ ఎంపీసీ తన నిర్ణయాలను శుక్రవారం (5న) ఉదయం వెల్లడించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి మూడు విడతల్లో ఆర్‌బీఐ రెపో రేటును 1% తగ్గించడంతో 5.5 శాతానికి దిగిరావడం తెలిసిందే. ‘‘డిసెంబర్‌లో రెపో రేటు 0.25% తగ్గింపు ఉంటుందని అంచనా వేస్తున్నాం. వృద్ధి బలంగా ఉంది. అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యో ల్బణం గణనీయంగా తగ్గింది. దీంతో రేట్ల కోతకు అదనపు వెసులుబాటు లభించింది’’అని క్రిసిల్ ముఖ్య ఆర్థికవేత్త ధర్మకృతి జోషి తెలిపారు. వడ్డీ రేట్ల కోతకు అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా సైతం గత నెలలో సంకేతం ఇచ్చారు.


