గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు ఇస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి
గ్లోబల్ సమ్మిట్‌కు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేయాలి
మౌలిక వసతుల కల్పనపై రాజీ పడొద్దు
అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
మీర్‌ఖాన్‌పేటలో ఏర్పాట్ల పరిశీలన
సాక్షి, రంగారెడ్డి జిల్లా/కందుకూరు: డిసెంబర్ 8, 9వ తేదీల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌కు దేశ విదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కాబోతున్నారని, అందువల్ల భద్రతా పరంగా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఆదివారం ఆయన గ్లోబల్ సమ్మిట్ జరిగే కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట సందర్శించారు. మధ్యాహ్నం హెలీకాప్టర్‌లో పుట్టపర్తి నుంచి ఫ్యూచర్‌సిటీ చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి గ్లోబల్ సమ్మిట్ నిర్వహించే ప్రదేశానికి చేరుకున్నారు.
అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు. గంటకు పైగా అక్కడ గడిపిన ముఖ్యమంత్రి సమ్మిట్ ఏర్పాట్ల గురించి తెలుసుకుని సలహాలు, సూచనలు ఇచ్చారు. ‘సమ్మిట్‌కు ఫారŠూచ్యన్– 500 కంపెనీల ప్రతినిధులు హాజరు కాబోతున్న సమయంలో ఏ చిన్న సమస్య కూడా ఉత్పన్నం కావొద్దు. మౌలిక వసతుల కల్పన విషయంలో రాజీ పడొద్దు. మూసీ ప్రక్షాళనలో భాగంగా శుభ్రం చేసిన నీటిని ఫ్యూచర్ సిటీ అవసరాలకు తరలించే ఏర్పాట్లు చేయాలి..’అని ఆదేశించారు
అపరిచితులను అనుమతించొద్దు
మీర్‌ఖాన్‌పేట నుంచి సమీపంలోని స్కిల్స్ యూనివర్సిటీకి చేరుకున్న సీఎం.. అక్కడ కొనసాగుతున్న నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఏఫ్‌సీడీఓ కార్యాలయం నిర్మాణ పనులు పరిశీలించారు. అక్కడ అధికారులతో మాట్లాడుతూ గ్లోబల్ సమ్మిట్‌ను విజయవంతం చేయాలని కోరారు. మీడియా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, గుర్తింపు కార్డులు లేని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దని పోలీసులకు సూచించారు. ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి తదితర నేతలు, కలెక్టర్ నారాయణరెడ్డి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


