breaking news
magnets
-
‘రేర్’ మ్యాగ్నెట్ల కోసం రేసు..
అరుదైన లోహ అయస్కాంతాల (రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ – ఆర్ఈఎం) సరఫరాపై చైనా ఆంక్షలు విధించడం, దిగుమతి చేసుకున్న మ్యాగ్నెట్స్ నిల్వలు త్వరలోనే ఖాళీ అయిపోనుండటంతో ప్రత్యామ్నాయ అవకాశాలను దొరకపుచ్చుకోవడంపై భారత్ మరింతగా కసరత్తు చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలు, గృహోపకరణాలు మొదలైన వాటిల్లో ఉపయోగించే మ్యాగ్నెట్స్ కొరత వల్ల ఉత్పత్తి దెబ్బతినే ముప్పు ఏర్పడటంతో ఆర్ఈఎం సరఫరా కోసం ఇతర దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. అమెరికా, రష్యా, వియత్నాం, ఇండొనేషియా, జపాన్‌లాంటి దేశాలతో చర్చిస్తోంది. అదే సమయంలో ప్రధాన సరఫరాదారైన చైనాతో కూడా చర్చలు జరుపుతోంది. ఇతర దేశాలతో భారత్ ఒప్పందాలు కుదుర్చుకున్నా సరఫరా వ్యవస్థను సిద్ధం చేసుకునేందుకు 45–60 రోజులు పడుతుందని అంచనా. ఆసియా దేశాల నుంచి దిగుమతి చేసుకునేందుకు 45 రోజులు, అమెరికా.. రష్యా నుంచి దిగుమతులకు 60 రోజుల వ్యవధి పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశీయంగా దిగుమతి చేసుకున్న నిల్వలు జూన్ ఆఖరు వరకే సరిపోతాయని అంచనా. దీంతో, ఒప్పందాలు కుదుర్చుకునేందుకు భారత్ వేగంగా పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం భారత్ ఏటా 809 టన్నుల ఆర్‌ఈఎంను దిగుమతి చేసుకుంటోంది. అమెరికాతో టారిఫ్‌ల యుద్ధంతో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో కీలకమైన ఈ మ్యాగ్నెట్ల ఎగుమతులను ఏప్రిల్ మధ్య నుంచి చైనా నిలిపివేసింది. అంతర్జాతీయంగా ఆర్ఈఎం ఉత్పత్తిలో ఏకంగా 70 శాతం, ప్రాసెసింగ్‌లో 90 శాతం వాటాతో చైనా ఆధిపత్యం చలాయిస్తుండటంతో సరఫరా నిలిపివేత సెగ అన్ని దేశాలనూ తాకుతోంది. ప్రత్యామ్నాయాలపైనా దృష్టి.. ఆసియా దేశాల్లో చూస్తే జపాన్‌లో కూడా ఆర్ఈఎం ఉన్నప్పటికీ చైనా మ్యాగ్నెట్లంత నాణ్యంగా ఉండవని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ముందుగా వియత్నాం, ఇండొనేషియా నుంచే ఆర్‌ఈఎంను దిగుమతి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వివరించాయి. అందులోనూ, సరఫరా వ్యవస్థను తక్షణం ఏర్పాటు చేసుకునే వీలున్నందున వియత్నాం నుంచి వెంటనే దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నాయి. మరోవైపు, కంపెనీలు మ్యాగ్నెట్లను విడిగా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా మొత్తం అసెంబ్లీలను లేదా సబ్–అసెంబ్లీలను దిగుమతి చేసుకునేందుకు అనుమతించేలా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే, ఇందుకోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్ఐ) స్కీముల నిబంధనలు మార్చాల్సి ఉంటుందని పరిశీలకులు తెలిపారు. దిగుమతి చేసుకున్న వాటికి దేశీయంగా అదనంగా విలువ జోడిస్తేనే ప్రోత్సాహకాలు గానీ సబ్సిడీలు గానీ పొందడానికి వీలుంటుందని పీఎల్ఐ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి. మొత్తం అసెంబ్లీలను దిగుమతి చేసుకున్నా ప్రోత్సాహకాలు వర్తించేలా ప్రభుత్వం నిబంధనలు సడలిస్తే కాస్త ప్రయోజనకరంగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. స్మార్ట్‌వాచీలు, ఇయర్బడ్స్కూ ఎఫెక్ట్ .. ఆర్ఈఎం కొరత కేవలం ఆటోమొబైల్ పరిశ్రమపైనే కాకుండా స్మార్ట్‌వాచీలు, వైర్లెస్ ఇయర్‌బడ్స్ (టీడబ్ల్యూఎస్) ఉత్పత్తిపై కూడా ప్రతికూల ప్రభావం చూపనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఇలాంటి ఎల్రక్టానిక్స్ ఉత్పత్తుల్లో సదరు మ్యాగ్నెట్ల వినియోగం తక్కువగానే ఉన్నప్పటికీ, కీలకమైన విడిభాగం కావడం వల్ల అది లేకపోతే ప్రోడక్టు అసంపూర్ణంగా ఉంటుందని పేర్కొన్నాయి. ఈ పరిశ్రమకు సంబంధించి మ్యాగ్నెట్ల నిల్వలు మరికొద్ది నెలల పాటు సరిపోవచ్చని, ఆ తర్వాత కూడా సరఫరా లేకపోతే సమస్యలు తీవ్రమవుతుందని వివరించాయి. అలర్టులు, నోటిఫికేషన్లు వచ్చినప్పుడు ఇయర్‌బడ్స్, స్మార్ట్ వాచీలు వైబ్రేట్ అయ్యేందుకు ఉపయోగపడే మోటార్లలో ఈ మ్యాగ్నెట్లను వినియోగిస్తారు. రేర్ ఎర్త్ మ్యాగ్నెట్లపై చైనా ఆంక్షలు కొనసాగిస్తే, వాటిపై ఆధారపడే స్మార్ట్ వాచీలు, ఇతర డివైజ్‌ల కొరతకు దారి తీయొచ్చని విశ్లేషకులు చెప్పారు. కౌంటర్‌పాయింట్ నివేదిక ప్రకారం 2025 తొలి క్వార్టర్లో స్మార్ట్ వాచీల అమ్మకాలు 5% పెరిగినప్పటికీ, వార్షికంగా మాత్రం 33% క్షీణించిన పరిస్థితి నెలకొంది. అయితే, మ్యాగ్నెట్ల కొరతతో ఉత్పత్తి పడిపోయి, క్రమంగా సరఫరాకు మించిన డిమాండ్ ఏర్పడితే స్మార్ట్ వాచీల ధరలు పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. చైనాకు భారత ఆటో పరిశ్రమ బృందం ఆర్ఈఎంల దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఆటో పరిశ్రమ ప్రతినిధుల బృందం చైనాకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే 40–50 మంది కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లకు వీసా అనుమతులు వచ్చాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ విషయంపై భేటీ అయ్యేందుకు చైనా వాణిజ్య శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లు వివరించాయి. ఖరీదు తక్కువే అయినా కీలక భాగమైన ఆర్ఈఎంల ఎగుమతులపై చైనా ఆంక్షలు కొనసాగినా, క్లియరెన్సుల్లో జాప్యం జరిగినా భారత ఆటోమోటివ్ పరిశ్రమకు రిసు్కగా పరిణమిస్తుందని క్రిసిల్ రేటింగ్స్ పేర్కొంది. – సాక్షి, బిజినెస్‌డెస్క్ -
ఇక ద్రవాలూ అయస్కాంతాలే!
అయస్కాంతం అన్న పేరు వినగానే మన మనసుల్లో మెదిలేది ఇనుము లాంటి లోహమే. సూక్ష్మస్థాయి ఇనుము రజను (ఫెర్రోఫ్లూయిడ్స్) చూసేందుకు ద్రవంలా కనిపించినా.. దీని అయస్కాంత ప్రభావం తాత్కాలికం. అయితే లారెన్స్ బెర్క్లీ నేషనల్ లేబొరేటరీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఇకపై ద్రవరూపంలో శాశ్వత అయస్కాంతాలు అందుబాటులోకి రానున్నాయి. అయితే ఏంటి? అంటున్నారా. ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్ రంగాల్లో చాలా ప్రయోజనాలే ఉన్నాయి. ఫెర్రోఫ్లూయిడ్స్ 1960ల నుంచి ప్రత్యేకమైన స్పీకర్లు, గడియారాల్లో వాడారు. దాదాపు మిల్లీమీటర్ సైజున్న ఫెర్రోఫ్లూయిడ్స్ను త్రీడీ ప్రింటింగ్ ద్వారా తయారు చేయడం ద్వారా తాము శాశ్వత ద్రవ అయస్కాంతాన్ని తయారు చేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త టామ్ రస్సెల్ తెలిపారు. వీటిని ఇంకో ద్రవంలో వేలాడదీసినప్పుడు ఫెర్రోఫ్లూయిడ్స్లోని నానోస్థాయి కణాలు అంచుల్లో గుమికూడుతున్నట్లు గుర్తించారు. ఈ దశలో వాటిపై అయస్కాంత తీగల చుట్టను దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఫెర్రోఫ్లూయిడ్స్ కూడా చైతన్యవంతమయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. అయస్కాంత తీగ చుట్టను తొలగించిన తరువాత కూడా ఫెర్రోఫ్లూయిడ్స్ తమ అయస్కాంతత్వాన్ని కోల్పోకుండా ఉండటం. ఈ ప్రయోగంలో నీటిబొట్టు చందంగా ఉన్న ఫెర్రోఫ్లూయిడ్స్ను ఇతర ఆకారాల్లోనూ తయారు చేసే అవకాశమున్నందున వాటితో శరీరం లోపలి భాగాల్లోకి మందులు సరఫరా చేయగల వ్యవస్థలను అభివృద్ధి చేయవచ్చునని టామ్ తెలిపారు. -
ఎల్జి నుంచి మడత పెట్టే టీవీలు
-
చిన్నారి కడుపులో 'మెటల్' బాల్..!
కడుపు నొప్పితో బాధపడుతున్న చిన్నారికి వైద్యులు పెయిన్ కిల్లర్స్ తో చాలాకాలం వైద్యం నిర్వహించారు. అయితే మందులకు ఏమాత్రం తగ్గకపోగా నొప్పి పెరుగుతుండటంతో చివరికి అనుమానం వచ్చి...ఎక్స్ రే తీయించారు. కడుపులో కనిపించిన బంతిలాంటి ఆకారం చూసి విస్తుపోయారు. ఎన్నో రకాల మెటల్ వస్తువులు, అయిస్కాంతాలు ఒక్కచోటికి చేరి పేరుకుపోవడమే చిన్నారి నొప్పికి కారణమని గుర్తించారు. శస్త్ర చికిత్స నిర్వహించి ఆయా వస్తువులను బయటకు తీశారు. చిన్నపిల్లలు మట్టి, సుద్దముక్కలు వంటివి తినడం మనం చూస్తుంటాం. కానీ ఉత్తరప్రదేశ్ మధురకు చెందిన మూడేళ్ళ బాలుడు ఏది కనిపిస్తే అది కడుపులో వేసుకున్నట్టున్నాడు. అందుకే ఆపరేషన్ నిర్వహించిన డాక్టర్లు అతడి పేగుకు చుట్టుకుపోయిన 29 అయిస్కాంతం ముక్కలు, ఓ బ్యాటరీ, ఓ కాయిన్ తోపాటు మరెన్నో చిన్న చిన్న వస్తువులను బయటకు తీశారు. నొప్పితో బాధపడుతున్న చిన్నారిని నెల క్రితం తల్లిదండ్రులు ఢిల్లీకి దగ్గరలోని ఫరీదాబాద్ మెట్రో ఆస్పత్రిలో చేర్పించారు. అప్పట్లో అతడికి మొదటిసారి ఎక్స్ రే తీశారు. స్కానింగ్ లో అతడి కడుపులో పేరుకుని ఉన్న పెద్ద మెటల్ బాల్ లాంటి ఆకారాన్ని చూసి డాక్లర్లు ఆశ్చర్యపోయారు. ఫరీదాబాద్ మెట్రో హస్పిటల్ లోని లాప్రోస్కోపిక్ సర్జరీ హెడ్.. డాక్టర్ బ్రహ్మ దత్ పాఠక్... చిన్నారి కడపులోని వస్తువులను గుర్తించారు. సుమారు ఓ సంవత్సరం నుంచి బాలుడికి ఇటువంటి వస్తువులు తినే అలవాటు ఉన్నట్లుగా ఉందని... మాగ్నెట్లన్నీ ఓచోట చేరి బంతి ఆకారంలో మారి, చిన్నారి నొప్పికి కారణం కావడమే కాక, కడుపులోని ఇతర భాగాలను సైతం పాడుచేస్తుండటాన్ని డాక్టర్లు గమనించారు. 'ఇది చాలా సమస్యాత్మకమైన కేసు. అయస్కాంతాలన్నీ చుట్టుకుపోవడం వల్ల చిన్నారి పేగు పూర్తిగా పాడైపోయింది. శస్త్ర చికిత్స చేయడానికి సుమారు మూడు గంటలు పట్టింది. మా వైద్య బృందం అంతా కలిసి ఆ చిన్ని పొట్టనుంచి ఒకదాని తర్వాత ఒకటిగా వస్తువులు తీస్తూనే ఉన్నాం.' అని డాక్టర్ పాఠక్ చెప్పారు. చిన్నారి కుటుంబ సభ్యులు జ్యువెలరీ బాక్స్ లు తయారు చేసే వ్యాపారం ఇంట్లోనే చేస్తుంటారని, దీంతో నేలపై పడిన ప్రతి వస్తువునూ చిన్నారి తినేయడం వల్లనే ఈ సమస్య వచ్చిందని వైద్యులు చెప్తున్నారు. మెటల్ వస్తువులు అతి చిన్నవిగా ఉంటే రోజువారీ కాలకృత్యాల్లో బయటకు వెళ్ళిపోయి ఉండేవని, పెద్దవిగా ఉండటంతో కడుపులోనే పేరుకు పోవడంతో.. ఈ కేసులో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చికిత్స చేయాల్సి వచ్చిందని వైద్యులు అంటున్నారు. ఇప్పటికైనా పేగు చాలాశాతం తినేయడంవల్ల చిన్నారి ఎక్కువకాలం నొప్పితో బాధపడే అవకాశం ఉందని, తగ్గడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుందని వైద్యులు చెప్తున్నారు. శస్త్ర చికిత్స అనంతరం చిన్నారి కుటుంబ సభ్యులు కూడ అతడిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇంట్లోని వస్తువులన్నీ అతడికి అందకుండా జాగ్రత్త పడుతున్నారు.