
రెండు సంస్థలకు రూ. 1,345 కోట్ల ప్రోత్సాహక స్కీము
ప్రభుత్వ శాఖల మధ్య సంప్రదింపులు
భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి వెల్లడి
న్యూఢిల్లీ: దేశీయంగా రేర్ ఎర్త్ మాగ్నెట్స్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ప్రత్యేక పథకంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం రూ. 1,345 కోట్ల స్కీముపై వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. మాగ్నెట్స్ తయారీ కోసం ఎంపికయ్యే రెండు సంస్థలకు దీన్ని వర్తింపచేసే అవకాశం ఉంది. కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఈ విషయాలు వెల్లడించారు.
చర్చలు పూర్తయ్యాక ప్రతిపాదనను తుది ఆమోదం కోసం కేంద్ర క్యాబినెట్‌కు పంపే అవకాశం ఉంది. రేర్ ఎర్త్ ఆక్సైడ్‌లను మాగ్నెట్ల కింద మార్చే ప్రాసెసింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఈ సబ్సిడీలు ఉపయోగపడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ మాగ్నెట్స్ ఎగుమతులపై ప్రధాన సరఫరాదారు అయిన చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేíÙస్తున్న సంగతి తెలిసిందే. టెలికం, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ తదితర రంగాల్లో ఉత్పత్తికి ఇవి కీలకంగా ఉంటాయి.
ఎలక్ట్రిక్ ట్రక్కులకు స్కీము..
పీఎం ఈ–డ్రైవ్ కార్యక్రమం కింద ఎలక్ట్రిక్ ట్రక్కులు కొనుగోలు చేసే వారికి రూ. 9.6 లక్షల వరకు ఇన్సెంటివ్స్ ఇచ్చే పథకాన్ని కుమారస్వామి ఆవిష్కరించారు. సుమారు 5,600 ట్రక్కులకు వర్తించే ఈ పథకంతో పోర్ట్‌లు, లాజిస్టిక్స్, సిమెంట్, స్టీల్ తదితర పరిశ్రమలు లబ్ధి పొందనున్నాయి. మొత్తం వాహనాల్లో డీజిల్ ట్రక్కుల వాటా 3 శాతమే అయినప్పటికీ రవాణా సంబంధిత గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో 42 శాతం వాటా వాటిదే ఉంటోందని కుమారస్వామి తెలిపారు. ఈ నేపథ్యంలో ఉద్గారాలను తగ్గించే, పర్యావరణహితమైన సరకు రవాణా విధానాలను అమలు చేసేందుకు ఈ స్కీము దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ఈ–డ్రైవ్ పరిమాణం రూ. 10,900 కోట్లు కాగా, ఇందులో ఎలక్ట్రిక్ ట్రక్కుల కోసం రూ. 500 కోట్లు కేటాయించారు.