
ఐఏఎఫ్ నిబంధనలను సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ: భారత వైమానిక దళం(ఐఏఎఫ్) నిబంధనల ప్రకారం పింఛను ‘బహుమతి కాదు’, సవతి తల్లిని కుటుంబ పింఛనుకు అర్హురాలిగా పరిగణించలేమని కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. చట్టపరంగా, బాంధవ్యం కోణంలో చూసినప్పుడు సవతి తల్లి కన్న తల్లికి భిన్నంగా ఉండటమే ఇందుకు కారణమని వివరించింది. తల్లి అంటే కన్నతల్లి అనే అర్థంలోనే భావించాల్సి ఉంటుందని, సవతి తల్లిని కాదని తెలిపింది. నిర్వహణ, ఇతర సంక్షేమ ప్రయోజనాలపై ఉన్నత న్యాయస్థానం గతంలో వివిధ సందర్భాల్లో ఇచి్చన తీర్పులను కేంద్రం ప్రస్తావించింది.
పింఛను ప్రయోజనాలను కోరుకునే వ్యక్తి, సంబంధిత చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం స్పష్టమైన అర్హతను నిరూపించుకోవాల్సి ఉంటుందని గురువారం జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనానికి కేంద్రం తెలిపింది. జోగి అనే ఉద్యోగి చిన్న తనంలోనే ఆరేళ్ల వయస్సు ఉండగా కన్నతల్లి చనిపోయింది. దీంతో, తండ్రి మరొకరిని వివాహం చేసుకున్నారు. సవతి తల్లి జయశ్రీ ఆయన్ను పెంచి పెద్ద చేశారు.
జోగి 2008లో చనిపోయారు. ఆయనది ఆత్మహత్య అని ఐఏఎఫ్ తెలిపింది. కుటుంబ పింఛనుకు వచ్చే సరికి సవతి తల్లి అర్హురాలు కాదని ఐఏఎఫ్ స్పష్టం చేసింది. దీంతో, ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తల్లి స్థానంలో తనకు కుటుంబ పింఛను ఇవ్వాలని కోరారు. ఐఏఎఫ్ పింఛను నిబంధనలు–1961 ప్రకారం ఉద్యోగి చనిపోయిన పక్షంలో కుటుంబ పింఛనుకు..వితంతువు, చట్టబద్ధంగా వివాహం చేసుకున్న తండ్రి లేదా తల్లి, చట్టబద్ధ వారసుడైన కుమారుడు లేదా కుమార్తె అర్హులని స్పష్టం చేస్తోందని కేంద్రం వివరించింది. ధర్మాసనం ఈ కేసు తదుపరి విచారణను నవంబర్ 20వ తేదీకి వాయిదా వేసింది.