
దీపావళి బోనస్ (Diwali Bonus) ఇవ్వకపోవడంపై నిరసనగా ఉద్యోగులు చేపట్టిన ఆందోళన కేంద్ర ప్రభుత్వానికి లక్షల రూపాయల ఆదాయ నష్టాన్ని కలిగించింది. ఆగ్రా-లక్నో ఎక్స్ ప్రెస్ వేలోని ఫతేహాబాద్ టోల్ ప్లాజా వద్ద ఆదివారం గంటలపాటు గేట్లు తెరిచి ఉంచడంతో వేలాది వాహనాలు టోల్ చెల్లించకుండా టోల్ గేట్ దాటి వెళ్లిపోయాయి.
దేశమంతా ఘనంగా జరుపుకొనే అతిపెద్ద పండుగ దీపావళి. ఈ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో కార్పొరేట్ కంపెనీల నుంచి చిన్నాచితకా సంస్థల వరకు తమ ఉద్యోగులకు ఎంతో కొంత మొత్తాన్ని దీపావళి బోనస్‌ల కింద ఇస్తుంటాయి. శ్రీసాయి, దాతార్ టోల్ ఆపరేటింగ్ సంస్థలకు చెందిన ఉద్యోగులు కూడా తమకు దీపావళి బోనస్ లభిస్తుందని ఆశించారు.
గత వారం దీపావళి సందర్భంగా తమ బోనస్ లు తమ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని కంపెనీ హామీ ఇచ్చిందని, కానీ బోనస్‌లు జమ కాలేదని ఆందోళనకారులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన ఉద్యోగులు ఆదివారం రాత్రి టోల్ బూత్ బూమ్ బారియర్ ను తెరిచి సమ్మెలో కూర్చున్నారు. 10 గంటల పాటు కొనసాగిన ధర్నా అధికారులు బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన తరువాత విరమించారు.
“నేను ఏడాదిగా కంపెనీలో పనిచేస్తున్నాను. మాకు ఎటువంటి బోనస్ ఇవ్వలేదు. జీతాలు కూడా ఆలస్యంగా వస్తున్నాయి” అని ఒక ఉద్యోగి మీడియాకు తెలిపారు. బోనస్ ఇవ్వకపోగా కొత్త ఉద్యోగులను పెట్టుకుంటామని సంస్థ ప్రతినిధులు బెదిరించడం ఉద్యోగులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించాయి.
ఫతేహాబాద్ టోల్ ప్లాజా ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన ప్రవేశ మార్గంగా ఉంటోది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ను యమునా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా లక్నోకు అనుసంధానించే ఈ మార్గం దేశానికి కీలకమైన వ్యూహాత్మక రహదారిగా గుర్తింపు పొందింది.
ఇదీ చదవండి: జియో దీపావళి ఆఫర్.. ప్లాన్లపై ‘అన్‌లిమిటెడ్’ ప్రయోజనాలు