
టోల్ ప్లాజాల వద్ద లారీలకు ఓవర్ లోడ్ పేరుతో అదనపు వసూళ్లు
చెల్లింపు ప్రక్రియ ఆలస్యం
కిలోమీటర్ల మేర నిలిచిపోతున్న వాహనాలు
వాహనదారులు, ప్రయాణికులకు అవస్థలు
రూ.లక్షల్లో ఓవర్ లోడ్ రుసుం వసూలు
పట్టించుకోని అధికారులు
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న టోల్ ప్లాజా యాజమాన్యం
జాతీయ రహదారులపై రయ్..రయ్ మంటూ వెళుతున్న వాహనాదారులకు టోల్ ప్లాజాల వద్ద చుక్కలు కనిపిస్తున్నాయి. యాజమాన్యాలు తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు, నిర్లక్ష్యం ఫలితంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. ఓవర్ లోడ్ పేరుతో అదనంగా వసూళ్లు చేస్తుండడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. తరచూ ట్రాఫిక్ జామ్ అవుతున్నా సంబంధిత శాఖల అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. పలు సందర్భాల్లో టోల్ దాటాలంటే అరగంటకు పైగా సమయం పడుతోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టంగుటూరు: జాతీయ రహదారి–16పై నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. టోల్ ప్లాజాల వద్ద ఎలాంటి జాప్యం జరుగకుండా ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. టోల్ ప్లాజా వద్ద బిల్లింగ్ కేంద్రాలతో సంబంధం లేకుండా వెళ్లే సౌకర్యం ఉంది. కానీ, ఇటీవల కాలంలో కొన్ని టోల్ ప్లాజాల నిర్వాహకులు తీసుకుంటున్న చర్యలు వాహనదారులను అవస్థలపాలుజేస్తోంది. విజయవాడ–నెల్లూరు మధ్య సింహపురి ఎక్స్‌ప్రెస్ వే లిమిటెడ్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలోని టంగుటూరు, ముసునూరు, బొల్లాపల్లి టోల్ ప్లాజాలు ఉన్నాయి.
ఎక్కడా లేని విధంగా వీటిల్లో పెద్ద వాహనాలకు ఓవర్ లోడ్ ఫీజులు వసూలు చేస్తున్నారు. ఓవర్ లోడ్ వసూలు చేసే సమయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పలు అంబులెన్సులు, ఎమ్మెల్యేల వాహనాలు సైతం ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నాయి. కనీసం అంబులెన్సు ఉన్న సమయంలో కూడా ట్రాఫిక్ క్రమబదీ్ధకరించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టోల్ ప్లాజాల వద్ద ప్రతి రోజూ ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. అత్యవసర పనుల నిమిత్తం వెళ్లేవారు, బస్సుల్లో కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఆస్పత్రులకు పోయే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్ ప్లాజా వద్ద వాహనం 10 సెకన్ల కంటే ఎక్కువ సేపు వేచి ఉండాల్సి వస్తే టోల్ చెల్లించాల్సిన అవసరం లేదని నిబంధన ఉంది. దీనిని నిర్వాహకులు పట్టించుకుంటున్న దాఖల్లాల్లేవు.
ఓవర్ లోడ్ పేరుతో ఓవరాక్షన్...
టంగుటూరు, ముసునూరు, బొల్లాపల్లి టోల్ ప్లాజాల్లో ఓవర్ లోడ్ పేరుతో ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ రూ.లక్షల్లో ఓవర్ లోడ్ ఫీజు వసూలు చేస్తూ తమ ఖజానా నింపుకుంటున్నారు. వాస్తవానికి రవాణా శాఖ అధికారులు విధించాల్సిన ఓవర్ లోడ్ ఫీజు టోల్ ప్లాజాల్లో వసూలు చేస్తూ వాహనదారుల జేబుకు చిల్లుపెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా అటు ప్రభుత్వంగానీ, ఇటు అధికారులుగానీ పట్టించుకోవడం లేదు.
వాహనదారులకు అందని సేవలు...
టోల్ ప్లాజాల్లో వాహనదారులకు సేవలందించేందుకు టోల్ ఫ్రీ నంబరు 1033 ఉంది. దానికి వాహనదారులు ఫోన్ చేస్తే సిబ్బంది స్పందించరు. టోల్ ప్లాజా పెట్రోలింగు వాహనం ఎక్కడ ఉంటుందో తెలియదు. వారి పర్యవేక్షణ కొరవడటంతో రాత్రి పూట లారీ డ్రైవర్లు రోడ్డు పక్కన పెట్టుకుని నిద్రపోతూ ఉంటారు. ఆ సమయంలో ఆయిల్ దొంగలు అదే అదునుగా చూసుకుని లారీ ట్యాంకుల్లో డీజిల్ కాజేసిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
అలాగే జాతీయ రహదారి అంబులెన్సులో ప్రాథమిక చికిత్సకు అవసరమైన మందులు ఉండవు. అధికారులు ఇస్తున్నా ఆంబులెన్సు సిబ్బంది అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే అంబులెన్స్‌లో ప్రథమ చికిత్స చేయాల్సిన వైద్యులు, సిబ్బంది లేరని, వాటిని అలంకార ప్రాయంగా సింగరాయకొండలోని కలికవాయి వద్ద ఉంచుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
సమయం వృథా అవుతోంది
చేప పిల్లల లోడు లారీతో నెల్లూరు వైపు వెళ్తుంటాను. టంగుటూరు, ముసునూరు, బొల్లాపల్లి టోల్ ప్లాజాల యాజమాన్యాలు మోసం చేస్తున్నాయి. టంగుటూరు టోల్ ప్లాజాలో ఓవర్ లోడ్ టన్ను ఉందంటూ ఒక్కో ప్లాజాలో అరగంట పాటు లారీ ఆపుతున్నారు. ఓవర్ లోడ్ డబ్బులు రూ.280 వసూలు చేస్తున్నారు, మళ్లీ కాటా పెడితే పాసింగు ఉందని, తిరిగి డబ్బులిస్తున్నారు. దీంతో సమయం వృథా అవుతోంది. చేప పిల్లల లోడుకు ఆక్సిజన్ ఉంటుంది. ఏదైనా తేడా పడి చేప పిల్లలు చనిపోతే రూ.లక్షల్లో నష్టం వస్తుంది. టోల్ ప్లాజాకు ఇరువైపులా ఉన్న కాటాలు తేడాగా ఉన్నాయి. అధిక లోడు చూపిస్తోంది. తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు నిర్వహించాలి. – వీర్ల సత్యనారాయణ, లారీ డ్రైవర్, గుడివాడ
ప్రతిరోజూ గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్...
టోల్ ప్లాజా యాజమాన్యం ఓవర్ లోడ్ పేరుతో నగదు వసూళ్లు చేస్తుండటంతో ప్రతిరోజూ గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ తీరు ఒక రోజు అర రోజు కాదు.. నిత్యం కొనసాగుతోంది. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్న వాహనదారుల కష్టాలు అన్నీఇన్నీ కావు. ప్రతిరోజూ వాహనదారులు స్థానిక పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేస్తుండటంతో వారు వచ్చి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చేస్తున్నారు. అది కూడా కొంత సమయమే. మళ్లీ పరిస్థితి మొదటికొస్తోంది.