
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి
న్యూఢిల్లీ: ఎక్స్‌ప్రెస్‌వేలు, ఆర్థిక కారిడార్‌లను వేగవంతంగా విస్తరించిన నేపథ్యంలో దేశీయంగా లాజిస్టిక్స్ వ్యయాలు వచ్చే రెండు నెలల్లో సింగిల్ డిజిట్ స్థాయికి తగ్గుతాయని కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఇప్పటికే ఇది 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గినట్లు ఐఐటీ చెన్నై, ఐఐటీ కాన్పూర్, ఐఐఎం బెంగళూరు రూపొందించిన నివేదికలో వెల్లడైందని పేర్కొన్నారు.
డిసెంబర్ కల్లా ఇది 9 శాతానికి దిగి వస్తుందని అసోచాం వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. లాజిస్టిక్స్ వ్యయాలు తగ్గడం వల్ల అంతర్జాతీయంగా మన ఎగుమతిదారులు మరింతగా పోటీపడేందుకు వీలవుతుందన్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాల్లో లాజిస్టిక్స్ వ్యయాలు 12 శాతంగా ఉండగా, చైనాలో 8–10 శాతంగా ఉన్నాయని మంత్రి చెప్పారు.
మరోవైపు, వచ్చే అయిదేళ్లలో భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దాలని నిర్దేశించుకున్నట్లు ఆయన తెలిపారు. తాను రవాణా మంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ రూ. 14 లక్షల కోట్లుగా ఉండగా, ప్రస్తుతం రూ. 22 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. పరిశ్రమ 4 లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తోందని, కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యధికంగా జీఎస్‌టీ కడుతోందని గడ్కరీ చెప్పారు.
ప్రస్తుతం అమెరికా ఆటోమొబైల్ పరిశ్రమ రూ. 78 లక్షలకోట్లుగా, చైనా మార్కెట్ రూ. 47 లక్షల కోట్లుగా తొలి రెండు స్థానాల్లో ఉండగా, భారత్ మూడో స్థానంలో ఉంది. శిలాజ ఇంధనాల దిగమతులపై భారత్ ఏటా రూ. 22 లక్షల కోట్లు వెచ్చించాల్సి వస్తోందని, దేశం పురోగమించాలంటే వీటికి ప్రత్యామ్నాయంగా స్వచ్ఛ ఇంధనాలను వినియోగించడం కీలకమని మంత్రి తెలిపారు.