ప్రముఖ టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్.. తన ఎలక్ట్రిక్ మొబిలిటీ శ్రేణిని విస్తరించడంలో భాగంగానే విడా ఏవోటర్ వీఎక్స్2 గో 3.4 కిలోవాట్ స్కూటర్ ప్రవేశపెట్టింది. దీనిని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు. ఈ కొత్త మోడల్ ధర రూ. 1,02,000 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). కానీ BaaS (బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ ఆప్షన్) ప్లాన్ కింద రూ. 60000లకు కొనుగోలు చేయవచ్చు.
హీరో విడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ నవంబర్ 2025 నుండి దేశవ్యాప్తంగా ఉన్న VIDA డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటుంది. వీఎక్స్2 గో 3.4 కిలోవాట్ వేరియంట్ అందుబాటులోకి రావడంతో.. విడా వీఎక్స్2 సిరీస్‌లో మూడు స్కూటర్లు అందుబాటులోకి వచ్చాయి.

విడా ఏవోటర్ వీఎక్స్2 గో 3.4 కిలోవాట్ వేరియంట్.. డ్యూయల్-రిమూవబుల్ బ్యాటరీ సిస్టమ్‌తో వస్తుంది. ఇది 100 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 70 కిమీ/గం కాగా.. ఇందులో 27.2 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ ఉంటుంది.
ఇదీ చదవండి: అక్టోబర్‌లో ఎక్కువమంది కొన్న కార్లు ఇవే..
హీరో మోటోకార్ప్ తన కస్టమర్ల సౌకర్యార్థం.. దేశంలో 4600 ఛార్జింగ్ పాయింట్లు, 700 సర్వీస్ సెంటర్‌ల నెట్‌వర్క్ కలిగి ఉంది. కాబట్టి హీరో ఎలక్ట్రిక్ కొనుగోలు చేసేవారికి.. ఛార్జింగ్ సంబంధిత ఇబ్బందులు, సర్వీసుకు సంబంధించిన ఆలస్యాలు వుండవు. కాగా ఇప్పటికే హీరో విడా స్కూటర్లు మార్కెట్లో మంచి ఆదరణ పొందుతున్నాయి.
BaaS అంటే: వినియోగదారుడు బ్యాటరీని కొనుగోలు చేయకుండా, సర్వీస్ రూపంలో దాన్ని అద్దెకు తీసుకోవడం లేదా సబ్‌స్క్రిప్షన్ విధానంలో ఉపయోగించడం. అంటే.. వినియోగదారుడు స్కూటర్ (EV) కొనుగోలు చేస్తాడు కానీ బ్యాటరీని కాదు. బ్యాటరీని కంపెనీ అద్దె లేదా సబ్‌స్క్రిప్షన్ ఆధారంగా అందిస్తుంది. కాబట్టి ఎక్స్ షోరూమ్ ధర తగ్గుతుంది.


