కొద్ది రోజుల్లో నూతన సంవత్సరం 2026 రాబోతోంది. న్యూ ఇయర్ అనగానే అందరికీ కొత్త క్యాలెండర్లు గుర్తుకువస్తాయి. ఆ రోజు మార్కెట్‌లో లభించే అందమైన, వైవిధ్యభరితమైన క్యాలెండర్లు ఎవరినైనా ఇట్టే అకట్టుకుంటాయి. అయితే టపాసులు, అగ్గిపెట్టెల ఉత్పత్తికి పేరొందిన శివకాశికి క్యాలెండర్ల ముద్రణతో విడదీయరాని సంబంధం ఉందనే సంగతి మీకు తెలుసా? శివకాశిలో క్యాలెండర్ల పరిశ్రమ ఎలా వృద్ధి చెందింది? ఈ క్యాలెండర్ల ప్రత్యేకత ఏమిటి?
తమిళనాడులోని శివకాశి పట్టణాన్ని ‘కుట్టి జపాన్’ (చిన్న జపాన్) అని పిలుస్తారు. దీనికి ప్రధాన కారణం ఇక్కడ అభివృద్ధి చెందిన టపాసులు (బాణసంచా), అగ్గిపెట్టెల పరిశ్రమలే. అయితే ఈ రెండు రంగాలతో పాటు శివకాశి భారతదేశంలోనే అతిపెద్ద ముద్రణ (Printing) పరిశ్రమకు కూడా ముఖ్య కేంద్రంగా ఉంది. ప్రతి ఏటా దేశం నలుమూలలకు సరఫరా అయ్యే క్యాలెండర్ల తయారీలో శివకాశి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇక్కడి క్యాలెండర్ల పరిశ్రమ విలువ వేల కోట్ల రూపాయలలో ఉంది. ఇది స్థానికంగా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. ముద్రణ ఉత్పత్తుల తయారీలో శివకాశి తన ప్రత్యేకతను దశాబ్దాలుగా నిరూపించుకుంటూ వస్తోంది.
చారిత్రక పునాది
శివకాశిలో ముద్రణ పరిశ్రమ వృద్ధి వ్యూహాత్మకంగా జరిగింది. ఈ కథ 20వ శతాబ్దం ప్రారంభంలో మొదలైంది. అగ్గిపెట్టెల, పటాకుల తయారీదారులు తమ ఉత్పత్తులకు లేబుల్స్ ముద్రించడానికి యంత్రాలను దిగుమతి చేసుకున్నారు. క్రమంగా ఈ యంత్రాలను ఉపయోగించి క్యాలెండర్లు తదితర ఇతర వాణిజ్య ఉత్పత్తులను ముద్రించడం ప్రారంభించారు. ఈ పరిశ్రమ వృద్ధికి కీలకమైన అంశం ఏమిటంటే, ఇక్కడి వేడి, పొడి వాతావరణం. ఇది ముద్రించిన కాగితాలు త్వరగా ఆరిపోయేందుకు, భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ముద్రణ కళ, అనుబంధ పనులలో అపారమైన నైపుణ్యం ఉన్న శ్రామిక శక్తి అందుబాటులో ఉంది. ఇది ప్రపంచ స్థాయి ఉత్పత్తులను తయారు చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది.
సాంకేతికత-ముద్రణ ప్రక్రియ
శివకాశి క్యాలెండర్ పరిశ్రమ కేవలం సంప్రదాయ పద్ధతులపైననే ఆధారపడకుండా, ఆధునిక సాంకేతికతను వేగంగా అందిపుచ్చుకుంది. ప్రారంభంలో లిథో ప్రింటింగ్ వంటి పద్ధతులు వాడుకలో ఉన్నప్పటికీ, ప్రస్తుతం చాలా యూనిట్లలో అత్యాధునిక ఆఫ్‌సెట్ ప్రింటింగ్ యంత్రాలు ఉన్నాయి. ఈ యంత్రాలు అధిక నాణ్యతతో వేగంగా, తక్కువ ఖర్చుతో రంగుల ముద్రణను సాధ్యం చేస్తున్నాయి. క్యాలెండర్ తయారీ ప్రక్రియలో డిజైన్, ప్లేట్ తయారీ (ప్రీ-ప్రెస్,ప్రింటింగ్), చివరి మెరుగులు (పోస్ట్-ప్రెస్) అంటే కత్తిరించడం, మ్యాట్ ఫినిషింగ్, రిమ్మింగ్, బైండింగ్ లాంటి పలు దశలు ఉంటాయి. శివకాశిలోని ముద్రణాలయాలు ఈ ప్రక్రియలన్నిటినీ నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నందున నాణ్యతను స్థిరంగా కొనసాగించగలుగుతున్నాయి.
క్యాలెండర్ల వైవిధ్యం
శివకాశి ముద్రణ పరిశ్రమ అందించే క్యాలెండర్ల శ్రేణి అపరిమితంగా ఉంది. ఇక్కడ నెలవారీ ఆర్ట్ పేపర్ క్యాలెండర్ల నుండి, ప్రతిరోజూ ఉపయోగించే క్యాలెండర్లు, ప్రత్యేక డిజైన్లతో కూడిన డై-కట్ క్యాలెండర్ల వరకు అనేక రకాలు ముద్రిస్తుంటారు. ఈ క్యాలెండర్లలో హిందూ దేవతల చిత్రాలు, ప్రకృతి దృశ్యాలు, సినిమా తారలు, వాణిజ్య ప్రకటనలు ముద్రితమవుతాయి. శివకాశిలోని ముద్రణాలయాల ప్రత్యేకత ఏమిటంటే.. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన భాషలలో.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, ఇతర ఉత్తర భారతీయ భాషలలో క్యాలెండర్లను ముద్రిస్తుంటాయి. ఇంతటి సామర్థ్యం కలిగినందునే దేశీయ క్యాలెండర్ మార్కెట్‌లో శివకాశి ముఖ్యమైన వాటాను కలిగి ఉంది.
కార్పొరేట్ బ్రాండింగ్
శివకాశి క్యాలెండర్ పరిశ్రమ స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఇది ముద్రణ రంగంలో ఒక క్లస్టర్గా ఉంది. అంటే ఒకే చోట అనేక ముద్రణ యూనిట్లు, వాటికి అవసరమైన ఇంక్, కాగితం, ప్లేట్లు, యంత్రాల విడిభాగాలు సరఫరా చేసే అనుబంధ పరిశ్రమలు ఉన్నాయి. ఫలితంగా తయారీ వ్యయం తగ్గి, ఉత్పత్తులు పోటీ ధరలకు లభ్యమవుతాయి. అంతేకాకుండా ఇక్కడి క్యాలెండర్ పరిశ్రమ కార్పొరేట్ బ్రాండింగ్‌కు చిరునామాగా మారింది. చిన్న వ్యాపార సంస్థలు మొదలుకొని భారీ బహుళ జాతి సంస్థల యాజమాన్యాలు తమ వినియోగదారులకు నూతన సంవత్సర కానుకగా క్యాలెండర్లను కానుకగా ఇస్తుంటాయి. ఈ నేపధ్యంలో ఈ సంస్థలు పెద్ద మొత్తంలో క్యాలెండర్లను శివకాశిలోనే ఆర్డర్ చేస్తుంటాయి. ఇది శివకాశి ముద్రణ పరిశ్రమకు స్థిరమైన ఆదాయ వనరుగా మారింది.
భవిష్యత్ సవాళ్లు
డిజిటల్ క్యాలెండర్లు, మొబైల్ అప్లికేషన్ల విస్తరణ కారణంగా సంప్రదాయ క్యాలెండర్లకు డిమాండ్ నెమ్మదిగా తగ్గుతున్నప్పటికీ, శివకాశిలో ఈ ప్రభావం అంతగా కనిపించదు. భారతదేశంలో మతపరమైన క్యాలెండర్లకు ఉన్న డిమాండ్ దీనికి ప్రధాని కారణంగా నిలిచింది. శివకాశి ప్రింటింగ్ తయారీదారులు కేవలం క్యాలెండర్లకు మాత్రమే పరిమితం కాకుండా అత్యాధునిక డైరీలు, పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, ప్యాకేజింగ్ లేబుల్స్, మల్టీకలర్ వాణిజ్య ముద్రణ ఉత్పత్తులను కూడా భారీగా తయారు చేస్తున్నారు. నాణ్యతపై దృష్టి పెట్టడం, కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా వైవిధ్యాన్ని చూపడం, సకాలంలో డెలివరీ చేయగల సామర్థ్యం తదితర అంశాలు శివకాశి ముద్రణ పరిశ్రమ భవిష్యత్తును కాపాడుతున్నాయి.
ఇది కూడా చదవండి: ‘బ్రేక్‌ఫాస్ట్ రారాజు’.. ఇంటర్నెట్‌లో ఆసక్తికర యుద్ధం


