చుక్కల్లో ఫ్లైట్‌ టికెట్‌! | festive Season Airfare Surge | Sakshi
Sakshi News home page

చుక్కల్లో ఫ్లైట్‌ టికెట్‌!

Nov 22 2025 8:01 AM | Updated on Nov 22 2025 8:01 AM

festive Season Airfare Surge

వరుస సెలవులు, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు  

డిసెంబర్‌ నెలలో భారీగా పెరిగిన డిమాండ్‌  

 సాధారణ చార్జీలు సైతం రెట్టింపు  

సాక్షి,  హైదరాబాద్‌: డిసెంబర్‌ మాసాన్ని సొమ్ము చేసుకొనేందుకు ఎయిర్‌లైన్స్‌ రంగంలోకి దిగాయి. వరుస సెలవులు, క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ మార్గాల్లో చార్జీలు భారీగా పెంచాయి. దీంతో సాధారణ రోజుల్లో ఉండే చార్జీలు రెట్టింపయ్యాయి. హైదరాబాద్‌ నుంచి ప్రతి రోజు సుమారు  12వేల మందికి పైగా అంతర్జాతీయ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. వారిలో గల్ఫ్‌దేశాలకు  ప్రయాణం చేసేవారే  5000 మందికి పైగా ఉంటారు. డిసెంబర్‌ నెలలో ఈ ప్రయాణాలు  మరింత పెరగనున్నాయి. హైదరాబాద్‌ నుంచి సింగపూర్, మలేíÙయా, థాయ్‌లాండ్, మాల్దీవులు, యూరప్‌ తదితర ప్రాంతాలకు  విమాన చార్జీలు రెట్టింపయ్యాయి.  

దు‘బాబోయ్‌’... 
డిసెంబర్, జనవరి నెలల్లో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకొనే  దుబాయ్‌ ఎయిర్‌ఫేర్‌  ప్రయాణికులను బెంబేలెత్తిస్తోంది. సాధారణంగా రౌండ్‌ ట్రిప్‌ రూ.16000 వరకు ఉంటుంది. కానీ డిసెంబర్‌ మొదటి వారంలో ఈ చార్జీలు  రూ.31,215 నుంచి రూ.35,745 వరకు పెరిగాయి. హైదరాబాద్‌ నుంచి ఎక్కువ మంది పర్యాటకులు దుబాయ్‌ని సందర్శించనుండగా గల్ఫ్‌ దేశాల్లో  స్థిరపడిన  తెలుగు ప్రజలు డిసెంబర్‌ వరుస సెలవుల కోసం సొంత ఊళ్లకు తరలిరానున్నారు. దీంతో చార్జీలు పెరిగినట్లు పలు ట్రావెల్స్‌ సంస్థల ప్రతినిధులు పేర్కొంటున్నారు. దుబాయ్‌తో పాటు సౌదీ అరేబియా, మస్కట్, దోహ, షార్జా తదితర దేశాల నుంచి  తెలుగు రాష్ట్రాలకు  ఎక్కువ మంది తరలి రానున్నారు. దీంతో చార్జీలు  అమాంతంగా పెరిగినట్లు ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.  

డిసెంబర్‌ రెండో వారంలో హైదరాబాద్‌ నుంచి షార్జాకు వెళ్లేందుకు రూ.25,000కు పైగా చార్జీలు పెరిగినట్లు తార్నాకకు చెందిన శ్రీకాంత్‌  తెలిపారు. సాధారణంగా అయితే  రూ.12000 వరకు మాత్రమే ఉంటుందన్నారు. అలాగే యూరప్‌ దేశాలకు రాకపోకలు సాగించే  లూఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ వంటి  సంస్థలు  చార్జీల మోత మోగిస్తున్నాయి, హైదరాబాద్‌–లండన్‌ మధ్య డిసెంబర్‌ మొదటి వారంలో రూ.1.14 లక్షల నుంచి  రూ.1.72 లక్షల వరకు చార్జీలు  నమోదయ్యాయి. ‘ప్రస్తుతం నవంబర్‌ నెలలో లండన్‌ నుంచి హైదరాబాద్‌కు రూ.35000 ఉంటే  డిసెంబర్‌లో అది రెట్టింపైంది’ అని సికింద్రాబాద్‌కు చెందిన ఓ ట్రావెల్స్‌ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు.  

బ్యాంకాక్‌.. బెంబేలు.. 
సోలో టూరిస్టులు అత్యధికంగా ప్రయాణం చేసే  బ్యాంకాక్, వియత్నాం, ఫిలిప్పీన్స్‌ తదితర దేశాలకు సైతం డిసెంబర్‌ చార్జీలు బెంబేలెత్తిస్తున్నాయి. సాధారణ రోజుల్లో  బ్యాంకాక్‌కు హైదరాబాద్‌ నుంచి రౌండప్‌ చార్జీలు రూ.25000 లోపు  ఉంటాయి.కానీ డిసెంబర్‌ మొదటి వారంలో రూ.39,933 వరకు పెరిగాయి. డిసెంబర్‌ నెలాఖరు వరకు ఈ చార్జీలు మరింత మోత మోగనున్నాయి. నూతన సంవత్సక వేడుకల కోసం  ఇప్పటి నుంచే  ప్లాన్‌ చేసుకుంటున్న సిటీ టూరిస్టులకు విమాన చార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. బ్యాంకాక్‌ తర్వాత  ఎక్కువ మంది ఆసక్తి చూపించే వియత్నాం, ఫిలిప్పీన్స్‌ దేశాలకు సైతం డిసెంబర్‌ ఫీవర్‌ తాకినట్లు ట్రావెల్‌ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి.

పెరగనున్న ప్రయాణికుల రద్దీ.. 
హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి  ప్రతి నెలా సుమారు  23 లక్షల నుంచి  26 లక్షల  మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో 20 లక్షల మందికి పైగా దేశీయ ప్రయాణికులు ఉంటే..  మరో 3.5 లక్షల మంది వరకు అంతర్జాతీయ ప్రయాణికులు ఉంటారు. అక్టోబర్‌ నెల లెక్కల ప్రకారం 26,02,,798 మంది ప్రయాణం చేశారు. వీరిలో 21,27,635 మంది దేశీయ ప్రయాణికులు కాగా, 4,75,163 మంది అంతర్జాతీయ ప్రయాణికులు. ఈ ఒక్క నెలలోనే  18,499 విమాన సర్వీసులు హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగించాయి. డిసెంబర్, జనవరి నెలల్లో  రద్దీ పెరిగే అవకాశం ఉంటుందని ఎయిర్‌పోర్ట్‌ వర్గాలు  అంచనా వేస్తున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement