నాణేల ముద్రణను నిలిపివేసిన అమెరికా టంకశాల
అసలు విలువ కంటే తయారీ ఖర్చు ఎక్కువ కావడమే కారణం
చివరిసారిగా 235 ప్రత్యేక నాణేల ముద్రణ
వాషింగ్టన్: అమెరికాలో 232 ఏళ్ల సుదీర్ఘ ఘన చరిత్ర కలిగిన పెన్నీ(అధికారికంగా సెంట్) కథ ముగిసింది. ఫిలడెల్ఫీయాలోని అమెరికన్ టంకశాల(మింట్) చివరి పెన్నీని బుధవారం మధ్యాహ్నం ముద్రించింది. ఆ తర్వాత పెన్నీల ప్రింటింగ్ శాశ్వతంగా నిలిచిపోయింది. పెన్నీల తయారీని ఆపేయడం ద్వారా 56 మిలియన్ డాలర్ల ప్రజాధనం ఆదా చేయబోతున్నట్లు కోశాధికారి బ్రాండన్ బీచ్ చెప్పారు. ఈ నాణేల తయారీని ఎందుకు నిలిపివేశారన్నది చర్చనీయాంశంగా మారింది.
వాటి అసలు విలువ కంటే తయారీ ఖర్చే ఎక్కువ కావడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఒక్కో పెన్నీ తయారీ ఖర్చు పదేళ్ల క్రితం 1.42 సెంట్లుగా ఉండేది. ఇప్పుడు అది ఏకంగా 3.69 సెంట్లకు పెరిగిపోయింది. దాంతో తయారీని ఆపేయడానికే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొగ్గుచూపారు. ఒక్కో నాణెంపై 2 సెంట్లకుపైగా నష్టపోవాల్సి వస్తోందని, అదంతా వృథా ఖర్చు కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే చాలా నష్టపోయామంటూ ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు.
ఒక్కో నాణేం ధర లక్ష డాలర్లు?
అమెరికా మింట్ గణాంకాల ప్రకారం చూస్తే 2024 ఆర్థిక సంవత్సరంలో 5.61 బిలియన్ డాలర్ల విలువైన నాణేలు చలామణిలో ఉండగా, అందులో పెన్నీల వాటా 57 శాతం(3.2 బిలియన్ డాలర్లు). వెండింగ్ యంత్రాల నుంచి క్యాండీలు, చాక్లెట్లు కొనడానికి, పార్కింగ్ టికెట్లకు డబ్బులు చెల్లించడానికి సాధారణంగా పెన్నీలు ఉపయోగిస్తుంటారు. కానీ, కొన్నేళ్లుగా వీటి వాడకం తగ్గిపోయింది. నాణేలు సేకరించేవారు మాత్రం వీటిని దాచుకుంటున్నారు. కొత్త పెన్నీలను మార్కెట్‌లోకి తీసుకురావడం కొన్ని నెలల క్రితమే నిలిపివేశారు. ఒమేగా గుర్తు ఉన్న ప్రత్యేక పెన్నీలను మాత్రం చివరిసారిగా ముద్రించారు.
వీటిని డిసెంబర్‌లో వేలం ద్వారా విక్రయించబోతున్నారు. ఇవి గుర్తుగా దాచుకోవడానికే ఉపయోగపడతాయి. బుధవారం ఈ రకం నాణేలను 235 వరకు ముద్రించారు. వీటిలో 232 నాణేలను వేలం వేస్తారు. ఒక్కొక్కటి లక్ష డాలర్లు(రూ.88.71 లక్షలు) పలకవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ సొమ్మును టంకశాల కార్యకలాపాల కోసం వెచి్చస్తారు. మిగతా మూడు నాణేలను ప్రజల సందర్శనార్థం ప్రదర్శనకు ఉంచుతారు. అలాగే మింట్‌లో 235 గోల్డ్ పెన్నీలు కూడా ముద్రించినట్లు సమాచారం. వీటిని ఏం చేస్తారన్నది ఇంకా తెలియరాలేదు.
పాత నాణేల చెలామణి యతాథతం
ఫిలడెల్ఫీయాలో పెన్నీల తయారీ 1793లో ప్రారంభమైంది. ఇది డాలర్ విలువలో వందలో ఒక వంతు. అంటే వంద పెన్నీలు ఒక డాలర్లు అని చెప్పొచ్చు. అమెరికా కరెన్సీలో అత్యల్ప ముఖ విలువ కలిగినవి పెన్నీలే. మొదట్లో కాపర్‌తో తయారు చేసేవారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జింక్, కాపర్ ఉపయోగించడం ప్రారంభించారు. ఎందుకంటే యుద్ధం వల్ల కాపర్ కొరత ఏర్పడడమే ఇందుకు కారణం. ముద్రణ ఆపినంత మాత్రాన వాటి చెలామణి ఆగిపోదు. ప్రస్తుతం సర్క్యులేషన్‌లో ఉన్న పాత పెన్నీ నాణేలను యథాతథంగా వాడుకోవచ్చు. అమెరికాలో చివరిసారిగా నాణేన్ని ఆపేసిన ఘటన 1857లో జరిగింది. ఆప్పట్లో హాఫ్–పెన్నీ ముద్రణను నిలిపివేశారు. అరుదైన హాఫ్–డాలర్ నాణేలు ఇప్పటికీ చెలామణిలో ఉన్నాయి.


