ఉక్రెయిన్ యుద్ధం ముగింపుకు సంబంధించి జరుగుతున్న దౌత్య ప్రయత్నాల మధ్య రష్యా–ఉక్రెయిన్ మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసిందని మాస్కో సోమవారం తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఘటనను ఉగ్రదాడిగా పేర్కొంది. యుద్ధ విరమణ చర్చలపై తమ వైఖరిని మార్చుకుంటామని రష్యా స్పష్టం చేసింది.
రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రకారం... ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం మధ్యలో మాస్కో–సెంట్ పీటర్స్‌బర్గ్ మధ్య ఉన్న నోవ్గొరడ్ ప్రాంతంలోని పుతిన్ అధికారిక నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ మొత్తం 91 డ్రోన్లను ప్రయోగించిందని తెలిపారు. అయితే వాటన్నింటినీ రష్యా గగనతల రక్షణ వ్యవస్థలు ధ్వంసం చేసినట్లు వెల్లడించారు.ఈ ఘటనకు ప్రతీకారంగా ఉక్రెయిన్‌లోని కొన్ని లక్ష్యాలను ఇప్పటికే ఎంపిక చేసినట్లు లావ్రోవ్ తెలిపారు. యుద్ధం ముగింపుకు సంబంధించి ఇప్పటివరకు ఉన్న రష్యా చర్చల వైఖరిని పునఃసమీక్షిస్తాం అని హెచ్చరించారు.
ఇదే సమయంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. అమెరికా నేతృత్వంలో సాగుతున్న దౌత్య ప్రయత్నాలను భగ్నం చేయడానికే రష్యా ఈ విధమైన ప్రమాదకర ప్రకటనలు చేస్తోందని ఆయన విమర్శించారు. పుతిన్ నివాసంపై దాడి జరిగిందన్న కథనం పూర్తిగా కల్పితం. ఉక్రెయిన్‌పై మరిన్ని దాడులకు, ముఖ్యంగా కీవ్‌పై దాడులకు న్యాయబద్ధత కల్పించేందుకే రష్యా ఈ కథనాన్ని ప్రచారం చేస్తోంది. అలాగే, యుద్ధాన్ని ముగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోకుండా తప్పించుకోవడానికీ ఇదే కారణం అని జెలెన్స్కీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ఈ పరిణామాలతో రష్యా–ఉక్రెయిన్ యుద్ధంపై అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న శాంతి ప్రయత్నాలు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


