నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సంస్కరణలు
దేశంలోని జాతీయ రహదారులపై వర్తించే టోల్ పాలసీకి ఆధారం అయిన మూడు దశాబ్దాల నాటి సూత్రాలను సవరించడానికి సిద్ధమవుతున్నారు. 1995 నుంచి పెద్దగా మారకుండా ఉన్న టోలింగ్ ఫ్రేమ్‌వర్క్‌ను ఆధునిక ట్రాఫిక్ నమూనాలు, ఆపరేటింగ్ ఖర్చులు, మెరుగైన రహదారి నాణ్యతను ప్రతిబింబించేలా సంస్కరించడానికి నీతి ఆయోగ్ (NITI Aayog) నాయకత్వం వహిస్తోంది.
రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అభ్యర్థన మేరకు ప్రస్తుతం ఉన్న టోలింగ్ నిబంధనలను సమీక్షించి గత 30 సంవత్సరాల్లో జరిగిన మార్పులకు అనుగుణంగా మరింత వాస్తవికమైన యూజర్ ఫీజు మోడళ్లను సిఫార్సు చేయాలని నీతి ఆయోగ్ కొన్ని సంస్థలను నియమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ సిఫార్సులు వస్తాయని అంచనా వేస్తున్నారు.
పాతబడిన విధానాలు..
ప్రస్తుత టోల్ నిర్మాణం 1995 ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా రూపొందించబడింది. ఇది మూడు ప్రామాణిక కొలమానాలపై ఆధారపడి ఉంది.
వెహికల్ ఆపరేటింగ్ ఖర్చు-ఇంధనం, నిర్వహణ ఖర్చుల లెక్క.
వెహికల్ డ్యామేజీ ఫ్యాక్టర్ - రహదారిపై వాహనం వల్ల కలిగే అరుగుదలను లెక్కించడం.
టోల్ చెల్లించే స్థోమత-ధర, వినియోగదారుల ఆర్థిక పరిస్థితుల అంచనా.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. ఈ పాతబడిన ఫార్ములాలు భారతదేశంలోని విస్తరించిన హైవే నెట్‌వర్క్‌కు సరిపోవడం లేదు. జాతీయ రహదారుల రుసుము నిబంధనలు 2008 ప్రకారం టోల్ రేట్లను ఏటా సవరించినప్పటికీ (ఏప్రిల్ 1 నుంచి హోల్‌సేల్ ధరల సూచిక ఆధారంగా) అంతర్లీన ప్రాథమిక రేటు నిర్ణయం పాతదిగానే ఉంది.
నీతి ఆయోగ్ ఎజెండా
నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమగ్ర అధ్యయనం కీలక అంశాలపై దృష్టి సారించనుంది. రవాణా ప్రాజెక్ట్‌ల నిర్మాణం, నిర్వహణ, ఆపరేషన్ ఖర్చులను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా లెక్కించనున్నారు. రియల్‌టైమ్ వినియోగం, ట్రాఫిక్ డెన్సిటీ, మౌలిక సదుపాయాల విలువను ప్రతిబింబించే కొత్త ధరల విధానాన్ని సిఫార్సు చేయనున్నారు.
పార్లమెంటరీ ప్యానెల్ సిఫార్సులు
పార్లమెంటరీ ప్రజా పద్దుల కమిటీ (PAC) జాతీయ రహదారులపై శాశ్వత టోలింగ్ పద్ధతిని నిలిపివేయాలని సిఫార్సు చేసింది. నిర్మాణ, నిర్వహణ ఖర్చులు పూర్తిగా రికవరీ అయిన తర్వాత టోల్ వసూళ్లను నిలిపివేయాలని లేదా గణనీయంగా తగ్గించాలని కమిటీ సూచించడం గమనార్హం.
టోల్ ధరల నిర్ణయం, వసూలు, నియంత్రణలో పారదర్శకతను నిర్ధారించడానికి ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (AERA) తరహాలో ఒక ప్రత్యేక టారిఫ్ అథారిటీని ఏర్పాటు చేయాలని PAC ప్రతిపాదించింది.
ఇదీ చదవండి: కొత్త క్రెడిట్ కార్డుకు అప్లై చేస్తే సిబిల్ తగ్గుతుందా?


