‘హిల్ట్ పి’పై పరిశ్రమల శాఖకు ముందుగా చెప్పలేదా?
మున్సిపల్, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ విభాగాలనూ సంప్రదించలేదా?
కేబినెట్ నోట్ చూసే వరకు బయటకు పొక్కలేదనే ప్రచారం.. సంబంధిత మంత్రికీ తెలియదంటున్న అధికార వర్గాలు
మీడియా సమావేశానికి మంత్రి దూరంగా ఉండటాన్ని గుర్తుచేస్తున్న వైనం
టీజీఐఐసీ లేఖ ఆధారంగా పాలసీ రూపొందించారని అంటున్న సచివాలయ వర్గాలు
భారీ కుంభకోణం అంటూ బీఆర్‌ఎస్, బీజేపీ ఆరోపణలు
ఎస్‌ఆర్‌ఓ రేటులో 30 శాతానికే భూముల అప్పగింత నిర్ణయంపై అనుమానాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ పారిశ్రామిక భూముల బదిలీ విధానం (హిల్ట్ పి) ఒక పక్క రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంటే మరోపక్క సంబంధిత పరిశ్రమల శాఖకు కూడా తెలియకుండానే కొత్త పాలసీ కేబినెట్‌లో చర్చకు వచ్చిందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. లోతైన కసరత్తు లేకుండా కేవలం పరిశ్రమల శాఖ అధీనంలోని టీజీఐఐసీ రాసిన లేఖ ఆధారంగా పాలసీ తయారైనట్లు సమాచారం. కేబినెట్ నోట్‌లో ఈ అంశం గమనించే వరకు సదరు మంత్రికి కూడా అందుకు సంబంధించిన సమాచారం లేదని అధికార వర్గాలు చెబుతుండటం గమనార్హం.
అత్యంత ముఖ్యమైన పాలసీ కేబినెట్‌లో ఆమోదం పొందినా.. మీడియాకు వివరాల వెల్లడికి పరిశ్రమల మంత్రి దూరంగా ఉన్నారని అంటున్నారు. మరోవైపు టీజీఐఐసీ నుంచి పరిశ్రమల వివరాల తీసుకుని ‘మల్టీ యూజ్ జోన్లు’గా మార్చే బాధ్యతను అప్పగించిన హెచ్‌ఎండీఏతో పాటు పురపాలక, రెవెన్యూ శాఖలతో కూడా పాలసీ రూపకల్పనపై సంప్రదింపులు జరపలేదని తెలుస్తోంది. ఇంకోవైపు ‘హిల్ట్ పి’ హడావుడిగా రూపొందించడం, ఆమోదించడం వెనుక జరిగిన తతంగం అనుమానాలు తావిచ్చేలా ఉందన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది.
సంబంధిత శాఖ మంత్రి ప్రమేయం లేకుండానే పాలసీకి తుది రూపం ఇవ్వడమే దీని వెనుక భారీ భూ కుంభకోణం దాగి ఉందనడానికి నిదర్శనమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రిజిస్ట్రేషన్ విలువలో (ఎస్‌ఆర్‌ఓ రేటు) కేవలం 30 శాతానికే భూములు బదలాయించడాన్ని బీఆర్‌ఎస్, బీజేపీలు తప్పుబడుతున్నాయి. ప్రైవేటు వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకే ప్రభుత్వ ఖజానాకు భారీగా కన్నం పెడుతున్నారని ఆరోపిస్తున్నాయి. ఇంకోవైపు పాలసీలోని నియమ నిబంధనలపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ప్రభుత్వ పరంగా సరైన స్పందన లేదనే చర్చా జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం.. ‘హిల్ట్ పి’ పేరిట జరుగుతున్న తతంగానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
టీజీఐఐసీ లేఖ ఆధారంగానే పాలసీ!
ఔటర్ రింగు రోడ్డు లోపల, సమీప ప్రాంతాల్లో 9,292.53 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 22 పారిశ్రామిక వాడల్లోని 4,740.14 ఎకరాల భూమిని ఇతర అవసరాలకు వినియోగించేలా అనుమతించాలని కోరుతూ తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ (టీజీఐఐసీ) రాష్ట ప్రభుత్వానికి లేఖ రాసింది. దాని ఆధారంగానే ‘హిల్ట్ పి’కి రూపకల్పన జరిగింది. ఈ నెల 17న జరిగిన కేబినెట్ భేటీ దానికి ఆమోదం తెలిపింది.
అయితే ఈ పాలసీ రూపకల్పనలో గతంలో పరిశ్రమల శాఖలో ఏళ్ల తరబడి చక్రం తిప్పిన ఓ కీలక అధికారి పాత్ర ఉన్నట్లు సమాచారం. కాగా పాలసీ రూపకల్పనకు సంబంధించి సంబంధిత శాఖ మంత్రితో పాటు ఉన్నతాధికారులు ఎవరూ కూడా సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవని సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. ఈ కారణంగానే పాలసీలో శాస్త్రీయత లేకపోవడంతో పాటు ‘హిల్ట్ పి’ లోపాల పుట్టగా తయారైందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హడావుడిగా ఎందుకు?
‘హిల్ట్ పి’ కింద.. పారిశ్రామిక భూములను ‘మల్టీ యూజ్ జోన్’గా మార్చి అందులో నివాస, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, హోటళ్లు, పార్కులు, కల్చరల్ సెంటర్లు వంటివి నిర్మించేలా అనుమతులు ఇస్తారు. అయితే ఈ భూ బదలాయింపు ప్రక్రియను హడావుడిగా కేవలం రెండు నెలల వ్యవధిలోనే పూర్తి చేస్తామని ప్రకటించడం అనుమానాలకు తావిస్తోంది.
దరఖాస్తు పరిశీలన, ఆమోదం అందుకు అయ్యే డెవలప్‌మెంట్ ఇంపాక్ట్ ఫీజు వసూలు వంటి ప్రక్రియ అంతా కేవలం 66 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు హిల్ట్ పీ మార్గదర్శకాలు విడుదల చేసిన ఆరు నెలల వరకే దరఖాస్తులు తీసుకుంటామని తెలిపింది. అయితే వేలాది ఎకరాల భూమిని మల్టీ యూజ్ జోన్‌గా మార్చేందుకు సంబంధించిన దరఖాస్తుల గడువును కేవలం ఆరు నెలలుగా నిర్దేశించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తక్కువ ధరతో ఖజానాకు కన్నం
గతంలో (2023) మూడు పారిశ్రామిక వాడల్లోని భూములపై పూర్తి యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్ రైట్స్) కల్పిచేందుకు జారీ చేసిన ఉత్తర్వుల్లో రిజిస్ట్రేషన్ విలువ (ఎస్‌ఆర్‌ఓ)పై 100 నుంచి 200 శాతం అదనంగా చెల్లించాలని పేర్కొన్నారు. ఇలా ఫ్రీ హోల్డ్ రైట్స్ దక్కించుకున్న యజమానులు హెచ్‌ఎండీఏ లేదా పురపాలక శాఖకు ‘ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్’ కోసం అదనంగా చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ‘హిల్ట్ పి’లో మల్టీ యూజ్ జోన్‌గా మార్చుకునేందుకు పరిశ్రమల యజమాన్యాలు ఎస్‌ఆర్‌ఓ విలువలో కేవలం 30 నుంచి 50 శాతం చెల్లిస్తే సరిపోతుందని పేర్కొనడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కాగా ఇలా వసూలయ్యే మొత్తంలో నుంచే హెచ్‌ఎండీఏ లేదా పురపాలక శాఖకు ‘ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్’ చార్జీలు చెల్లిస్తామని పేర్కొన్నారు. పారిశ్రామిక వాడల్లోని భూములకు టీజీఐఐసీ ధరతో పోలిస్తే ఎస్‌ఆర్‌ఓ విలువ తక్కువగా ఉంటుంది. కాబట్టి ‘మల్టీ యూజ్ జోన్’గా మార్చుకునేందుకు ఎస్‌ఆర్‌ఓ రేటు వసూలు చేస్తేనే ప్రభుత్వ ఖజానాకు గండిపడి, పరిశ్రమల యాజమాన్యాలకు భారీగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అలాంటిది ప్రస్తుతం ఎస్‌ఆర్‌ఓ విలువలో కేవలం 30 శాతం మాత్రమే చెల్లిస్తే చాలనడంపై విపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.
పరిశ్రమల్లోని భూములపై స్పష్టత లేకుండానే..
ఏళ్ల క్రితం ఏర్పాటైన పారిశ్రామిక వాడల్లో కొన్ని పరిశ్రమలు మూతపడగా, మరికొన్ని పరిశ్రమలు అనధికారికంగా చేతులు మారాయి. కొన్నిచోట్ల ప్రభుత్వం ఇచి్చన లీజు గడువు కూడా ముగిసినట్లు సమాచారం. ఈ అంశాలపై లోతైన కసరత్తు లేకుండా పాలసీని తెచ్చి బదలాయింపునకు పూనుకోవడం వెనుక కొందరు ప్రభుత్వ పెద్దలు, బడా రియల్టర్ల హస్తం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. వీటన్నిటిపై వివరణ ఇవ్వాల్సిన పరిశ్రమల శాఖ మంత్రి.. కేవలం బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోలను ప్రస్తావిస్తూ ఆరోపణలను ఖండించడమే తప్ప..‘హిల్ట్ పి’కి సంబంధించి సరైన వివరణ ఎందుకు ఇవ్వడం లేదనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.


