2025 ఆగస్టు 15 నుంచి 'ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్' (FASTag Annual Pass) ప్రారంభమైంది. ఇది అమలులోకి వచ్చిన మొదటి రోజు సాయంత్రం 7:00 గంటల వరకు.. సుమారు 1.4 లక్షల మంది వినియోగదారులు వార్షిక పాస్‌ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేసుకున్నారు. టోల్ ప్లాజాలలో దాదాపు 1.39 లక్షల లావాదేవీలు నమోదయ్యాయి. ఆ తరువాత కూడా ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌కు డిమాండ్ భారీగా పెరిగిపోయింది.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు & ఎక్స్‌ప్రెస్‌వేలలోని సుమారు 1,150 టోల్ ప్లాజాలలో దీనిని అమలు చేసింది.
వాహనదారులు ఫాస్టాగ్‌లో డబ్బులు అయిపోయిన ప్రతిసారి రీచార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి రూ.3 వేలు చెల్లించి వార్షిక ఫాస్టాగ్ రీచార్జ్ చేసుకుంటే 200 ట్రిప్పులు లేదంటే ఏడాది గడువుతో (ఏది ముందు అయితే అది) ఈ పాస్ వర్తిస్తుంది. వాహనదారులు కొత్తగా ఫాస్టాగ్ కొనాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం వాహనంపై అతికించిన ఫాస్టాగ్‌కే ఆ మొత్తాన్ని రీచార్జ్ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌కు డిమాండ్
ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్‌కు డిమాండ్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధానంగా..
యాన్యువల్ పాస్ ద్వారా ఒకేసారి రూ. 3,000 చెల్లించి సంవత్సరానికి 200 టోల్ క్రాసింగ్‌లు లేదా ఒక సంవత్సరం (ఎదైనా ముందే వచ్చే వరకు) ప్రయాణం అనుమతిస్తుంది. కాబట్టి ఒకసారి చెల్లించి ఏడాది ప్రయోజనం పొందవచ్చు.
సాధారణంగా ప్రతి టోల్‌కి రూ. 80 నుంచి రూ. 100 వరకు ఖర్చవుతుంది. కానీ యాన్యువల్ పాస్‌తో ఇది చాలా తగ్గుతుంది.
యాన్యువల్ పాస్‌కు తీసుకోవడంతో.. రీఛార్జ్ ఎప్పుడు అయిపోతుందో అనే గాబరా అవసరం లేదు. కాబట్టి టోల్ లైన్‌లలో గడువు తీరేవరకు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. తద్వారా సమయం తగ్గుతుంది.
యూజర్-ఫ్రెండ్లీ కొనుగోలు & యాక్టివేషన్ ప్రక్రియ చాలా సులభం.


