
ఒకప్పుడు వ్యక్తిగత గోప్యతకు మన సమాజం అత్యంత ప్రాధాన్యాన్ని ఇచ్చేది. తిన్నా, తినకపోయినా, ఎన్ని కష్టాలు, నష్టాలు వచ్చినా... అన్నీ నాలుగు గోడల మధ్యనే జరిగిపోయేవి. ఏ ఒక్క విషయమూ గడప దాటి బయటకు పోయేది కాదు. ఒకవేళ బయటి వారికి తెలిస్తే తమ కుటుంబ గౌరవానికి, పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లినట్లు బాధపడేవారు. స్నేహితులైనా, హితులైనా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడి పంపించే వారు.
కానీ నేటి అంతర్జాల యుగంలో, డిజిటల్ సాంకేతికతలో వచ్చిన పెను మార్చుల వల్ల మనది అంటూ ఏ ఒక్క రహస్యం కూడా మిగలకుండా పోతోంది. వ్యక్తిగత గోప్యత కోసం మన చుట్టా మనం కట్టుకున్న గోడలు బద్దలవుతున్నాయి. మనం తినే తిండి దగ్గర నుంచి, మన ఇష్టానిష్టాలు, వ్యాపకాలు, స్నేహాలు, భావాలు, మన అభిరుచులు... ఇలా ఒకటేమిటి అన్నీ బహిర్గతం అయి పోతున్నాయి. మనమందరం ఏఐ సాంకేతికను వాడుకుంటున్నాము అని సంతోషపడుతున్నాము. కానీ నిజానికి అదే మనల్ని వాడుకుంటోంది. ఇప్పుడు ఏఐ సాంకేతికతకు ముడి సరుకు మనుషులు, వారి అలవాట్లే.
ఇప్పుడు అందరం ఆ ఏఐ ఆడించే తోలుబొమ్మలం. ఏఐ ఆధారిత అనువర్తనాలు ఆడిస్తున్నట్లు ఆడతున్నాం. అంతర్జాల వేదికలయిన ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి వాటిల్లో మనకు ఖాతా ఉంటే చాలు... మనల్ని మనం అమ్ముకున్నట్టే! మనకు తెలియకుండానే మనల్ని ఎవరో పల్లకీల్లో ఉరేగిస్తుంటారు. మనకు తెలియకుండానే మనల్ని అమ్మేస్తుంటారు. మన చుట్టూ మనకు తెలియకుండానే ఏఐ అనువర్తనాల నిఘా వ్యవస్థలు సాలెగూడుల్లా అల్లుకుపోయి ఉన్నాయి. పొరపాటున మనం అంతర్జాలంలోని అనువర్తనాల ద్వారా ఏదన్నా వస్తువు కొన్నా, ఇష్టమైన తిండి గురించి చూసినా, నచ్చిన టాపిక్‌పై వార్తలు చదివినా, విన్నా... ఆ సమాచారం మొత్తం సేకరించి మనకు భవిష్యత్తులో ఏమి కావాలో, మనం ఏమి తినాలో, ఏ సినిమా చూడాలో, ఏమి చదవాలో కూడా అవే సూచిస్తున్నాయి.
ఇదీ చదవండి: అలవోకగా రూ.కోట్లు సంపాదించే మార్గం..
వీటివల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లడం మాత్రమే కాదు, సమాజం స్వేచ్ఛగా ఆలోచించే మెదళ్లను, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే గుండెలను కోల్పోతోంది. గోప్యత అనేది రహస్యాల గురించి కాదు... గోప్యత అనేది మన జీవనంపై మనకుండే నియంత్రణను తెలియచేస్తుంది. కానీ కాలక్రమేణా మనకు తెలియకుండా మనమే మన జీవితంపై నియంత్రణ కోల్పోతున్నాం. గోప్యత లేని ప్రపంచంలో మనకు గౌరవ మర్యాదలు ఉండవు. మనలో మానవత్వం హరించుకుపోయి, మార్కెట్లకు అనుగుణంగా బతకటానికి అలవాటుపడతాము.
గోప్యతను కాపాడుకోవటం మన నైతిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వ బాధ్యత. ఇందుకోసం అందరం బాధ్యత తీసుకుని, మరొకరి గోప్యతకు భంగం వాటిల్లే పనులకు స్వస్తి చెప్పాలి. విద్యా విధానంలో కూడా కేవలం ఆధునిక సాంకేతికతను చొప్పించడమే కాక... నైతిక, మానవతా విలువలను ఇమిడ్చినప్పుడే రేపటి తరానికి జీవితపు విలువ తెలిసివస్తుంది. – ఈదర శ్రీనివాస రెడ్డి, ప్రొఫెసర్