అలవోకగా రూ.కోట్లు సంపాదించే మార్గం.. | SIP SWP Two Pillars of Mutual Fund Strategy Build wealth gradually youth finance | Sakshi
Sakshi News home page

అలవోకగా రూ.కోట్లు సంపాదించే మార్గం..

Sep 6 2025 10:00 AM | Updated on Sep 6 2025 11:01 AM

SIP SWP Two Pillars of Mutual Fund Strategy Build wealth gradually youth finance

డబ్బే డబ్బును సంపాదిస్తుంది. అదేలా..అంటారా? మనం చేసే పెట్టుబడులే దీర్ఘకాలంలో భారీగా సంపదను సృష్టిస్తాయి. అందుకు చాలామంది రియల్‌ఎస్టేట్‌, వ్యాపారం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లు, బంగారం.. వంటివి ఎంచుకుంటారు. ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతోంది. దీన్ని తట్టుకొని మన సంపద దీర్ఘకాలంలో భారీగా పెరగాలంటే సరైన ఇన్వెస్ట్‌మెంట్‌, టైమ్‌ ఎంతో అవసరం. పైన తెలిపిన పెట్టుబడి మార్గాల్లో ఇన్వెస్ట్‌ చేయాలంటే భారీగా నగదు కావాల్సి ఉంటుంది. అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారికోసం స్టాక్‌మార్కెట్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ క్రమానుగత పెట్టుబడులు ఎంతో మేలు చేస్తాయి. వీటిలో కనిష్ఠంగా రూ.100 నుంచి పొదుపు చేసి దీర్ఘకాలంలో సంపద సృష్టించవచ్చు. ఇలా యుక్త వయసులో చేసిన పొదుపును రిటైర్‌మెంట్‌ తర్వాత సంతోషంగా ఖర్చు పెట్టవచ్చు. అలా ఖర్చు పెడుతూ కూడా తిరిగి సంపదను సృష్టించే ఎస్‌డబ్ల్యూపీ విధానాల గురించి కూడా ఈ కథనంలో తెలుసుకుందాం.

క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్‌)

స్టాక్‌ మార్కెట్‌, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై అవగాహన చాలా మందిలో ఇ‍ప్పుడిప్పుడే పెరుగుతోంది. చిన్న మొత్తాల్లో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి సిప్ (SIP) మంచి మార్గంగా మారింది. సిప్‌లో ప్రతి నెలా మీరు పెట్టుబడి పెట్టే చిన్న మొత్తమే కాలక్రమేణా పెరుగుతుంది. తద్వారా మీ పెట్టుబడిపై మంచి రాబడి లభిస్తుంది.

సిప్ అంటే ఏమిటి.. ఇదెలా పనిచేస్తుంది?

సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్.. దీన్నే సంక్షిప్తంగా సిప్ అని వ్యవహరిస్తారు. అంటే రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్. ఇందులో మీరు ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తారు. సిప్ అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, మీరు చిన్న మొత్తాలతో కూడా పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ఇది కాలక్రమేణా పెద్ద మొత్తంగా మారుతుంది.  ఈ ప్రక్రియలో మీరు పదేపదే పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి నెలా ఒక నిర్ణీత మొత్తం ఆటోమేటిక్‌గా మీ బ్యాంక్ ఖాతా నుంచి కట్ అయి మ్యూచువల్ ఫండ్‌కు వెళుతుంది.

నెలకు రూ.3000 ఇన్వెస్ట్ చేస్తే..

సిప్‌ ద్వారా ఇప్పుడు మీరు ప్రతి నెలా రూ .3000 పెట్టుబడి పెట్టడం మొదలుపెడితే, 10 సంవత్సరాల తరువాత మీ పెట్టుబడి ఎలా పెరుగుతుందన్నది  ఉదాహరణ ద్వారా చూద్దాం.. మీరు సిప్ ద్వారా మ్యూచువల్ ఫండ్లో పెట్టుబడి పెడితే, అది సగటున 12% వార్షిక రాబడిని ఇస్తుంది. అప్పుడు 10 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ.3,60,000 అవుతుంది. అదే సమయంలో ఈ పెట్టుబడిపై వచ్చే రాబడి సుమారు రూ.3,37,017 ఉంటుంది. అంటే పదేళ్ల తర్వాత మీ చేతికి మొత్తంగా రూ.6,97,017 వస్తుంది.

సిప్ ప్రయోజనాలు

  • చిన్న పెట్టుబడులతో ప్రారంభించి కాలక్రమేణా పెద్ద మొత్తంలో రాబడి సంపాదించవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ పద్ధతి ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

  • సిప్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు, మీరు మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు. కానీ దీర్ఘకాలికంగా ఇది రాబడిని సమతుల్యం చేస్తుంది. అంటే మార్కెట్ పడిపోయినా, కాలక్రమేణా మీ పెట్టుబడి సరైన దిశలో పెరగడానికి సిప్ సహాయపడుతుంది.

  • సిప్‌లో పెట్టుబడులను మీ సౌలభ్యానికి అనుగుణంగా సెట్ చేసుకోవచ్చు. ప్రతి నెలా మీ ఖాతా నుండి నిర్ణీత మొత్తం నేరుగా మ్యూచువల్ ఫండ్‌లో జమయ్యేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా ఆటోమేటెడ్ కాబట్టి మీరు మళ్లీ మళ్లీ ఆలోచించాల్సిన అవసరం ఉండదు.

  • సిప్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన రాబడిని పొందుతారు. మ్యూచువల్ ఫండ్స్ రాబడులు కాలక్రమేణా మెరుగుపడతాయి.

గుర్తుంచుకోవాల్సినవి..

  • సరైన మ్యూచువల్ ఫండ్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మంచి పనితీరు కనబరిచే ఫండ్లను ఎంచుకోవడం వల్ల మంచి రాబడి పొందవచ్చు.

  • మీ సామర్థ్యాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయండి. మీరు రూ.500తో కూడా సిప్ లో ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించవచ్చు.

  • సిప్ లో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఒడిదుడుకులను నివారించి మంచి రాబడి పొందవచ్చు.

  • క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తేనే సిప్ బెనిఫిట్ లభిస్తుంది. ఎంత ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే అంత ఎక్కువ రాబడి పొందొచ్చు.


సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(ఎస్‌డబ్ల్యూపీ)

సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(ఎస్‌డబ్ల్యూపీ).. ఇదేంటి.. మనకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) గురించి తెలుసు తప్ప ఈ ఎస్‌డబ్ల్యూపీ ఎక్కడి నుంచి వచ్చిందని అనుకుంటున్నారా? నిజమే!! ఇది సిప్‌కు పూర్తి రివర్స్ పద్ధతి. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి సంబంధించి సిప్ అన్నది అందరికీ మూలమంత్రంగా మారిపోయింది. చాలా మంది చిన్న, మధ్య స్థాయి ఇన్వెస్టర్లు.. ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు వివిధ కారణాల రీత్యా ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు.

ఎస్‌డబ్ల్యూపీలో ప్రతి నెలా లేదా నిర్దిష్ట కావధుల్లో నిర్దిష్ట మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే వీలుంటుంది. ఎస్‌డబ్ల్యూపీని వినియోగించుకునే ప్రతీసారి సదరు తేదీన ఫండ్ ఎన్‌ఏవీ ఆధారంగా యూనిట్ల రిడెంప్షన్, చెల్లింపులు ఉంటాయి.

ఎవరి కోసమిది?

చేతిలో కాస్త పెద్ద మొత్తం ఉండి.. నెలవారీనో, మూడు నెలలకోసారో ఇలా నిర్ధిష్ట కావధుల్లో చేతిలోకి డబ్బు రావాలనుకునేవారికి ఎస్‌డబ్ల్యూపీ విధానం చాలా అనుకూలం. ఇక పదవీ విరమణ చేసి (రిటైరీలు) క్రమానుగత ఆదాయాన్ని ఆశించే వారికీ ఇది అనువైన విధానమే. అయితే, దీన్ని ఎంచుకునే ముందు.. దీని తీరుతెన్నుల గురించి అవగాహన కలిగి ఉండటం మంచిది. ఇలా చేసిన బాలాజీ మూర్తి గురించి మీకు చెబుతాను. ఆయన దాదాపు 35 ఏళ్ల సర్వీసు తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఇటీవలే రిటైరయ్యారు. ఏకమొత్తంగా రూ.45 లక్షలు చేతికి వచ్చాయి. క్రమానుగతంగా ఆదాయాన్నిచ్చే సాధనంలో ఇన్వెస్ట్ చేద్దామని ఆయన అనుకుంటుంటే ఎవరో ఎస్‌డబ్ల్యూపీ గురించి సలహా ఇచ్చారు. ఆయన ఒకవేళ వారి సలహాను పాటిద్దామని భావించాడనుకోండి. అపుడు ఏం జరుగుతుందో చూద్దాం...

ఎస్‌డబ్ల్యూపీ తీరుతెన్నులు

బాలాజీ తనకందిన డబ్బు నుంచి సుమారు రూ.10 లక్షల మొత్తాన్ని ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా మేరకు ఒక డెట్ ఫండ్‌లో ఎస్‌డబ్ల్యూపీ కింద ఇన్వెస్ట్ చేశారు. రూ.10 ఎన్‌ఏవీ ఉన్న లక్ష యూనిట్లు కొన్నారు. ప్రతి నెలా 5వ తారీఖున రూ.10,000 విత్‌డ్రా చేసుకునేలా ఆయన ఎస్‌డబ్ల్యూపీని సెట్ చేసుకున్నారు. తర్వాత నెల 5వ తేదీన సదరు ఫండ్ ఎన్‌ఏవీ రూ.10.50గా ఉంది. ఆ రోజున ఆయన విత్‌డ్రా చేసుకోవాల్సిన రూ.10,000కు సరిసమానంగా రూ.10.50 రేటుతో 952.3810 యూనిట్లు రిడీమ్ చేశారు. ఫలితంగా ఎస్‌డబ్ల్యూపీ రిడెంప్షన్ అనంతరం ఆయన వద్ద ఇక 99,047.619 యూనిట్లు మిగిలాయి. అటుపైన ప్రతి నెలా ఇదే ప్రక్రియ కొనసాగుతుంది. ఒకవేళ ఎన్‌ఏవీ రూ.10 వద్దే స్థిరంగా ఉండి, ప్రతి నెలా రూ.10,000 విత్‌డ్రా చేసుకుంటూ పోతే ఆయన ఇన్వెస్ట్ చేసిన రూ.10 లక్షల పెట్టుబడి.. 100 నెలల దాకా సరిపోతుంది. అయితే, అది డెట్ ఫండ్ కాబట్టి నష్టాలు తక్కువ. రాబడులు కాస్త స్థిరంగానే వస్తుంటాయి. కాబట్టి 100 నెలలు పైబడి కూడా ఎస్‌డబ్ల్యూపీ కొనసాగవచ్చు.

ఎస్‌డబ్ల్యూపీ ఎన్నాళ్ల పాటు కొనసాగవచ్చు అనే విషయాన్ని పరిశీలిస్తే బాలాజీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో ఏటా 12 శాతం రాబడులు ఇస్తుండగా.. ప్రతి నెలా కార్పస్ నిధి నుంచి 1 శాతం మేర విత్‌డ్రా చేసుకుంటూ పోయినా ఎస్‌డబ్ల్యూపీ జీవితాంతం కొనసాగుతోంది. ఎస్‌డబ్ల్యూపీలో ప్రత్యేకత ఇదే. మ్యూచువల్ ఫండ్ ఏటా సానుకూల రాబడులు అందిస్తున్నంత కాలం.. ఆయన ఎస్‌డబ్ల్యూపీ కచ్చితంగా 100 నెలల వ్యవధికి మించి కొనసాగుతుంది.

గుర్తుంచుకోదగినవి..

  • ఎస్‌డబ్ల్యూపీలనేవి దీర్ఘకాలిక  కోణంలోనే ఉపయోగపడేవి. స్వల్పకాలిక కోణంలో ఇన్వెస్టరుకు పెద్దగా ప్రయోజనం ఉండదు.

  • ఎస్‌డబ్ల్యూపీ అనేది ఇతరత్రా నెలనెలా వచ్చే ఆదాయానికి అనుబంధంగా రాబడినిచ్చేదే తప్ప.. ఇదే ప్రధాన ఆదాయవనరు కాదు.

  • దీర్ఘకాలికంగా బ్యాలెన్స్‌డ్ ఫండ్స్‌ను ఎంచుకుంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.

  • తొలినాళ్లలో ఎక్కువగా అసలు మొత్తం నుంచే విత్‌డ్రాయల్ జరుగుతుంది.

ఇదీ చదవండి: ఆధునిక రైల్వే వ్యవస్థల అభివృద్ధికి సై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement